జాడించి కొట్టిన జాట్

సౌత్ సినిమాలకు నార్త్ లో ఆదరణ ఉన్నమాట వాస్తవం. కానీ వాటిని ఎలా ప్రజెంట్ చేస్తామనేది ముఖ్యం.

సౌత్ సినిమాలు కొన్ని నార్త్ బెల్ట్ లో సూపర్ హిట్స్ అవుతున్నాయి. కేజీఎఫ్, సలార్, పుష్ప.. ఈ సినిమాలన్నీ ఉత్తరాదిన బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ సౌత్ హీరోలకు నార్త్ లో మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. సౌత్ సెటప్ లో నార్త్ హీరో అన్నమాట. సినిమా మొత్తం చూడ్డానికి సౌత్ యాక్షన్ సినిమాలానే ఉంటుంది.

హీరో కొడితే వందల మంది ఛస్తారు, స్క్రీన్ మొత్తం దుమ్ములేస్తుంది. స్లో మోషన్ లో ఎలివేషన్లు హోరెత్తుతాయి, హీరో చేతిలో వెరైటీ వెపన్స్ కనిపిస్తాయి. తేడా అంతా ఒకటే, సౌత్ హీరో స్థానంలో సన్నీ డియోల్ కనిపించాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. పక్కా సౌత్ మాస్ మాసాలా కమర్షియల్ సినిమాను కాపీ కొడుతూ చాలా హిందీ సినిమాలొచ్చాయి. ఆ పేరడీలనే పేరడీ చేస్తే ఎలా ఉంటుందో జాట్ అలా ఉంటుంది.

అప్పుడెప్పుడో దక్షిణాదిన వచ్చిన ఛత్రపతి సినిమా మొన్నటి జవాన్, సలార్, కేజీఎఫ్ వరకు ఎన్నో సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. ప్రతిచోటా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ వెదుక్కోవచ్చు. దీనికితోడు రామాయణం రిఫరెన్స్ కూడా. హీరో రాముడు, విలన్ రావణుడు, నేపథ్యం వేరే.

మొన్నటికిమొన్న ఓ సౌత్ దర్శకుడు తీసిన సికిందర్ గాయాల నుంచి బాలీవుడ్ జనాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైమ్ లో మరో సౌత్ దర్శకుడు తీసిన జాట్, ఉత్తరాది ప్రేక్షకుల్ని జాడించి కొట్టింది. 90ల నాటి యాక్షన్ ను ఎలా చూపించినా హిందీ జనం లైక్ చేస్తారనే భ్రమల మధ్య తీసిన సినిమాగా జాట్ ను చెప్పుకోవచ్చు.

మచ్చుకు కూడా కొత్తదనం కనిపించని సినిమా ఇది. పూర్తిగా సౌత్ ఫ్లేవర్ తో తీసిన మూవీ కాబట్టి మనకు నచ్చదులే అనుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సినిమాల్ని ఇప్పటికే చూసేసిన నార్త్ ఆడియన్స్ కు కూడా ఇది నచ్చదు.

అక్కడి ఆడియన్స్ కు ఓ హిందీ సినిమా చూస్తున్నట్టు కాకుండా, హిందీ డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది జాట్. ఎందుకంటే, ఇందులో హీరో ఓ ఉత్తరాది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతడు అయోధ్య ట్రయిన్ ప్రయాణిస్తూ అనుకోకుండా సౌత్ కు వస్తాడు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మోటుపల్లి గ్రామంలో దిగుతాడు. వాస్తవానికి అక్కడ హిందీ ఛాయలే కనిపించవు. కానీ సన్నీతో పాటు, ఆ గ్రామానికి చెందిన మకరంద్ దేశ్ పాండే లాంటి చాలామంది చక్కగా హిందీలో మాట్లాడుకుంటారు. అందుకే ఇది హిందీ డబ్బింగ్ సినిమా వాసన కొడుతుంది తప్ప, పక్కా హిందీ సినిమా అనిపించదు.

దీనికితోడు ఇడ్లీ ప్రహసనం ఒకటి. ట్రయిన్ దిగిన హీరో ఇడ్లీ తినాలనుకోవడం, ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్లు.. మొత్తంగా సినిమాలో ఇడ్లీనే కీలక పాత్ర పోషించిందంటే నమ్మి తీరాల్సిందే. హిందీ ప్రేక్షకులపై దీన్ని ఇడ్లీ దాడిగా కూడా చెప్పుకోవచ్చు.

హీరోగా సన్నీ డియోల్ ను, విలన్ గా రణదీప్ హుడాను పెడితే, బాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారా? పాత చింతకాయపచ్చడి లాంటి పక్కా సౌత్ కథను బాలీవుడ్ మేకప్ తో సింగారిస్తే ఆడియన్స్ పాస్ చేసేస్తారా? అదే పనిగా దంచికొట్టుడు యాక్షన్ సీన్లు చూపించేస్తే వసూళ్ల వర్షం కురిపించేస్తారా? సినిమాకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదా? దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదా? అసలు దాన్ని ఎందుకు పట్టించుకున్న పాపాన పోలేదు?

సౌత్ సినిమాలకు నార్త్ లో ఆదరణ ఉన్నమాట వాస్తవం. కానీ వాటిని ఎలా ప్రజెంట్ చేస్తామనేది ముఖ్యం. మరీ ముఖ్యంగా ఎంత మాస్ మసాలా అయినా అందులో భావోద్వేగం పండిందా లేదా, మినిమం లాజిక్స్ అయినా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం అత్యవసరం. ఇలాంటి చెకింగ్స్ లేకుండా తీసిన జాట్, ఉత్తరాది ప్రేక్షకుల్ని జాడించి కొడుతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో సన్నీ డియోల్ మాత్రం సూపర్ హ్యాపీ. ఎందుకంటే, 90ల తరహా యాక్షన్ సినిమా చేయాలనే కుత ఇతడికి బాగా ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది. రిజల్ట్ సంగతి దేవుడెరుగు.

16 Replies to “జాడించి కొట్టిన జాట్”

  1. మనకి డబ్బులు ముట్టలేదు అనుకుంటా. అందుకే ఈ ఏడుపు. మూవీ సూపర్ అని టాక్ నార్త్ లో.

  2. Hammayya..Nuv ila yedusthunnav ante..cinema bagane vundi vuntadi..nee vaata neku andaledu ani nee yedupu ardham avuthundi le..gatha konni years lo nuv bad review ichina every big project hit ayyindi

Comments are closed.