Jack Review: మూవీ రివ్యూ: జాక్

క్యాప్షన్ గా “కొంచెం క్రాక్” అని పెట్టారు కానీ, “చాలా క్రాక్” అనేది నిజం.

చిత్రం: జాక్
రేటింగ్: 2/5
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, రాహుల్ దేవ్ తదితరులు
కెమెరా: విజయ్ కె చక్రవర్తి
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: అచ్చు రాజమణి, శాం సీ ఎస్, సురేష్ బొబ్బిలి
నిర్మాత: బి వి ఎస్ ఎన్ ప్రసాద్
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
విడుదల తేదీ: 10 ఏప్రిల్ 2025

రెండు విడతల టిల్లు సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు జొన్నలగడ్డ “జాక్” టైటిల్ తో సినిమా అనగానే అది కూడా తన మార్క్ ట్రెండీ కామెడీ చిత్రమనుకున్నారు. బేబీ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ అనగానే యూత్ ఆడియన్స్ కి ఆసక్తి మరింత కలిగింది. అయితే ట్రైలర్ విడుదలయ్యే సరికి ఇదొక స్పై సినిమా అని తెలిసి సిద్ధు నుంచి కేవలం వినోదం మాత్రమే కోరుకునే యూత్ ఆడియన్స్ డిజపాయింటయ్యారు. అయినా సరే, సిద్ధు సినిమాల్లో విషయం ఉండకుండా పోదు అనే అభిప్రాయం కొంత, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం మీద గౌరవం ఇంకొంత కలిసి కొందరికి ఆసక్తిని కలిగించగలిగింది. ఇంతకీ విషయమేంటో చూద్దాం.

పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ) తనకి తాను జాక్ సర్ అని పేరు పెట్టుకుని గూఢచర్యం చేస్తుంటాడు. అతనికి స్పయ్యింగ్ అంటే ఇష్టం. “రా” లో ఉద్యోగం సంపాదించాలని అతని కోరిక. ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు. ఉద్యోగం రాకుండానే తనకి తానుగా ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్లో వేలు పెడతాడు.

ఇదిలా ఉంటే అఫ్సాన్ (వైష్ణవి) ఒక ప్రైవేట్ డిటెక్టివ్. జాక్ తండ్రి (నరేష్) తన కొడుకు ఏం చేస్తుంటాడో తెలుకోవాలని ఈ డిటెక్టివ్ ని నియమిస్తాడు. మరో పక్క అసలు సిసలు “రా” టీం (ప్రకాష్ రాజ్ అండ్ కో). ఇంకో పక్క టెర్రరిస్ట్ గ్యాంగ్ (రాహుల్ దేవ్ అండ్ కో). ఈ నాలుగు గుంపుల నాలుగుస్తంభాలాటలో చివరికి ఏమౌతుంది? హీరో ఏం చేస్తాడు? రా లో ఉద్యోగం వస్తుందా రాదా? వైష్ణవితో లవ్ ట్రాక్ ఎక్కడ ఎండౌతుంది? చూస్తుంటే చివరికి వీటి జవాబులు అందుతాయి.

నాలుగు గ్రూపుల్లో ఒకళ్లని పట్టుకోవాలని ఇంకొకళ్లు, మధ్యలో జరిగే గందరగగోళంతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాలనుకున్న కథ ఇది. అయితే యాక్షన్ ఎక్కువయ్యి, వినోదం తక్కువైన చిత్రమిది.

సినిమా మొదలైన అరగంట వరకు విసుగొస్తుంది. నవ్వురాని సో-కాల్డ్ బలవంతపు కామెడీతో కథనం సా….గుతూ ఉంటుంది. ఆ తర్వాత టెర్రరిస్టు కథ తెర మీదకొస్తుంది. టెర్రరిజంతో కూడిన స్పై కథలు తెలుగు తెర మీద అంతగా ఆడట్లేదు. బహుశా, ఈ మధ్యన టెర్రరిస్ట్ పేలుళ్లు వగైరాలు కనుమరుగవడంతో ఈ తరహా కథలు ఔట్ డేటెడ్ గా అనిపిస్తున్నాయి.

రా ఏజెంటుగా ఉద్యోగం సంపాదించడాన్ని మరీ తీసి పారేసినట్టు చూపించారు. ఐపీఎస్ ఆఫీసర్ (సుబ్బరాజు) తో పాటు ఈ గాలికి తిరిగే జాక్ “రా” ఇంటర్వ్యూకి వెళ్లడమే వింతగా ఉంది. అసలు ఏ క్వాలిఫికేషన్ తో వాకిన్ ఇంటర్వ్యూని తలపించే ఆ రా ఇంటర్వ్యూకి వచ్చాడు?

అదలా ఉంటే ఒక సన్నివేశంలో.. ఏకకాలంలో ఇండియాలోని వేరు వేరు ప్రాంతాల్లో 125 మంది రా ఏజెంట్స్ టెర్రరిస్టులు ఎక్కు పెట్టిన తుపాకీలకి పాయింట్ బ్లాంకులో ఉంటారు. వాళ్లందరికీ విషయం తెలియడంతో వెనక్కి తిరిగి ఆ టెర్రరిస్టులందర్నీ టపాటపా కాల్చిపారేస్తారు. అలా 125 మంది టెర్రరిస్టులూ ఏక కాలంలో చచ్చిపోతారు. “ప్రేక్షకులు మరీ అంతలా కనిపిస్తున్నారా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా భాస్కర్” అని అడగాలనిపిస్తుంది.

ఈ కథలో చూపించాలనుకున్నదేంటి? చదువు సంధ్యల్లేకపోయినా రా ఏజెంట్స్ ని తలదన్నే తెలివితేటలు కల యూత్ ఉంటారని, వాళ్లకి పూర్తి అర్హతలున్నా రా లోకి రూల్స్ మాట్లాడి తీసుకోరని చెప్పాలనా? తీసుకోవాలని సూచించడమా?

సరే అవన్నీ సినిమాటిక్ లిబర్టీస్ గా తీసుకోవాలనుకున్నా.. హృదయానికి హత్తుకునే లవ్ ట్రాక్ కానీ, గట్టిగా నవ్వించే కామెడీ కానీ లేవు. లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తోందంటే తీసింది బొమ్మరిల్లు భాస్కర్ కనుక. చాలా కాలం తర్వాత వచ్చి తన జానర్లో తన మార్క్ చూపించలేకపోయాడు. కొన్ని సీన్లైతే భాస్కర్ తీసాడా లేక సిద్ధూయే కానిచ్చేసాడా అనిపిస్తుంది. పార్కులో “నీతో సెక్స్ చేస్తే…” అంటూ సాగే సీన్లో “సెక్స్” అనే పదం చాలాసార్లు వినిపించి చిరాకు తెప్పిస్తుంది. ఇది భాస్కర్ మార్క్ కాదు. ట్రైన్ ఫైట్ సీన్లు ఒక బూతు మాట కూడా రెండుసార్లు వినిపించింది ట్రైలర్లో. సెన్సార్ వాళ్లు ఈ ఒక్కచోటైనా కళ్లు తెరిచి దానిని మార్పించారు. “సెక్స్” డైలాగ్ మాత్రం సెన్సార్ బోర్డుకి అభ్యంతరం అయినట్టులేదు.

సినిమాలో కామెడీ పండాలంటే హీరో పక్కన సైడ్ కిక్ ఉండాలి. ఇది ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఒకతరంలో పద్మనాభం, తర్వాత బ్రహ్మానందం, అటు పిమ్మట సునీల్, ఆ పిదప సత్య… ఇలా అందరు కమిడియన్స్ హీరోకి సైడ్ ఇక్ గా ఉండి కామెడీ పండించినవాళ్లే. ఆఖరికి టిల్లు స్క్వేర్ లో కూడా సిద్ధూ పక్కన ఒక కమెడియన్ ఉన్నాడు. కానీ ఇందులో ఎందుకో సిద్ధూ కాస్త ఓవర్ కాంఫిడెంటయ్యి మొత్తం సినిమాని తానే మోసెయ్యాలనుకుని మోయలేక చతికిలపడ్డాడు.

రాస్తునన్వాళ్లు, తీస్తున్నవాళ్లు గొప్ప ప్రాడక్ట్ ఇస్తున్నామనే అనుకుంటారు. కానీ ప్రేక్షకుల అంచనాలకు సరిపోవాలంటే చాలా కసరత్తు చెయ్యాలి. కథ, కథనం, మేకింగ్ స్టైల్, టెక్నికల్ బ్రిలియన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ కొత్తదనంతో కూర్చోపెడితేనే పనౌతుంది. అవేవె ఐందులో జరగలేదు.

బేసిక్ గా ఇది పాతచింతకాయ పద్ధతి రచన. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చేసాయి. ఆ కోవలో మరొకటి అన్నట్టుంది నేపథ్యం చూస్తే. మ్యూజిక్ పరంగా కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తుంది. కానీ పాటలు రెండూ వీక్ గానే ఉన్నాయి. సంగీత, సాహిత్యాల పరంగా హత్తుకోవు. కెమెరా వర్క్, ఎడిటింగ్ క్రిస్ప్ గానే ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే సిద్ధూ తనదైన శైలిలో నటించినా అతిగా మాట్లాడుతున్నట్టుంది తప్ప సెన్సిబుల్ గా మాట్లాడుతున్నట్టు కనబడడు. ఇలా హైపర్ గా, ఓవర్ గా ఉండే పాత్రని ఎక్కువసేపు భరించడం కష్టం.

వైష్ణవి చూడడానికి బాగుంది కానీ చేయడానికి పెద్ద ట్రాక్ లేదు ఆమెకి. హీరోని హనీ ట్రాపులోకి దింపే గూఢచారిణిలా ఉంది తప్ప సగటు హీరోయిన్ లా లేదు.

ప్రకాష్ రాజ్ ఇలాంటి జుజుబీ పాత్రలు చాలానే చేసేసాడు. తన నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. రా ఆఫీసర్ గా దర్శకుడు చెప్పినట్టు నటించేసి న్యాయం చేసాడు.

నరేష్ యాక్షన్ ఓవర్ గానే ఉంది. ఆయన దృష్టిలో అది కామెడీ కావొచ్చు. బిందు చంద్రమౌళిది అతిధి పాత్ర.

రాహుల్ దేవ్ టెర్రరిస్టుగా సెకండాఫులో కాసేపు వచ్చి “పోతాడు”.

ఓవరాల్ గా, ట్రైలర్ తో ఆసక్తి కలిగించలేక, సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేక నిరాశపరిచిన చిత్రమిది. ఇదే కథనానికి ఇంకాస్త లైటర్ మొమెంట్స్ కలిసే విధంగా ప్రోపర్ కామెడీ ట్రాక్ ఉండుంటే కామెడీ ఎంటర్టైనర్ అనిపించుకునేది. పోనీ ప్యూర్ యాక్షన్ చిత్రమనుకుందామా అంటే మేటర్ లో డెప్త్ లేదు, లాజిక్కుల్లేవు. దర్శకుడు భాస్కర్ చాలా కమెర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి పని కానిద్దామనుకున్నాడు కానీ రైటింగ్ వీక్ గా ఉండడం వల్ల ఫలితం దక్కలేదు. వెరసి సిద్ధ్హూ జొన్నలగడ్డకి ఈ చిత్రం థంబ్స్ డౌన్ అనే చెప్పాలి. క్యాప్షన్ గా “కొంచెం క్రాక్” అని పెట్టారు కానీ, “చాలా క్రాక్” అనేది నిజం.

బాటం లైన్: చాలా క్రాక్

13 Replies to “Jack Review: మూవీ రివ్యూ: జాక్”

  1. // ట్రైలర్ విడుదల అయ్యేసరికి ఇదొక స్పై సినిమా అని తెలిసి సిద్ధు నుంచి కేవలం వినోదం మాత్రమే కోరుకునే యూత్ ఆడియన్స్ డిజపాయింటయ్యారు.. //

    నీకు చెప్పారా యూత్ అంతా వచ్చి.. మేము కేవలం వినోదమే కోరుకుంటున్నాం అని.. సినిమా కి రివ్యూ రాయి. సర్వే లు రాయకు

  2. // వైష్ణవి చూడటానికి బాగుంది కానీ చెయ్యడానికి పెద్ద ట్రాక్ లేదు ఆమెకి. హీరో ని హనీ ట్రాప్ లోకి దింపే గూడచారిణి లా ఉంది తప్ప సగటు హీరోయిన్ లా లేదు.. //

    ఒరేయ్.. ఏందిరా ఈ రివ్యూ.. అన్ని సినిమాల్లో లాగా హీరో తో పాటలు డ్యాన్సుల పాత్ర ఉంటే, సగటు హీరోయిన్ పాత్ర లా ఉంది అని ఏడుస్తావు. ఇప్పుడేమో సగటు హీరోయిన్ లా లేదు అని ఏడుస్తున్నావు. అసలు నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఏడ్చిందా?

    నువ్వు రివ్యూ ఇవ్వాల్సింది సినిమాలో ఉన్న క్యారెక్టర్ ని ఎలా ప్రెజెంట్ చేసారు.. ఆ పాత్ర ని పోషించిన వాళ్లు ఎంత కన్విన్సింగ్ గా చేసారు అని.. అంతేగాని ఆ పాత్ర బదులు నువ్వు ఊహించుకుని వెళ్లిన పాత్ర ఉందా లేదా అని కాదు.

    సినిమా ఎలా తియ్యాలో చెప్పేముందు.. రివ్యూ ఎలా రాయాలో తెలుసుకుని ఏడు. గతం లో ఈ సైట్ లో రివ్యూ లకి చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు దరిద్రం గా ఉంటున్నాయి.

  3. భాస్కర్ తో విభేదాలు ఉన్నాయని టిల్లు ఒప్పుకున్నప్పుడే సినిమాకి సంబంధించి ప్రతి విషయం లో దర్శకుడిని పక్కన పెట్టి తనే వేలు పెట్టాడని అందరికీ అర్థం అయింది

  4. సిద్దు, దేవరకొండ ఇద్దరికి రెండు సినిమాలు హిట్ కాగానే పొగరు తలకెక్కింది, ఇపుడు తిక్క కుదిరింది.

  5. అందరూ తప్పక చూడవలసిన సూపర్ మూవీ మన ప్రియమైన హీరో సిద్దు సూపర్ నటన మంచి డైరెక్షన్

Comments are closed.