రోడ్డు మీద ఆడది కనపడితే చాలు ఇకిలించడం, ఇంకా దాటితే సకిలించడం అసభ్యంగా మాట్లాడడం, అవకాశం దొరికితే మరింత ముందుకెళదామని చూడడం… ముంబయిలో కొందరు మగాళ్లకు కొత్తేమీ కాదు. అలా వారి వేధింపులకు గురైన ఆడవాళ్లు తలవంచుకు వెళ్లిపోవడాన్ని మాత్రమే చూసిన వారికి కొత్త అనుభవాన్ని రుచి చూపిందో యువతి ముంంబయిలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ దగ్గర గురువారం రాత్రి జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…
ఆరేళ్లుగా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న జమ్ముకు చెందిన పూర్ణిమా బెహాల్ అనే వర్ధమాన నటి. గత ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో నార్త్ ఇండియన్ టీన్ క్వీన్‌గా కూడా టైటిల్ గెలుచుకుంది.
ముంబయిలో నివసించే ఈమె అలవాటు ప్రకారం… బాంద్రా ప్రాంతంలో రాత్రి 10.30 గంటల సమయంలో జాగింగ్ కు వెళ్లింది. జాగింగ్ అనంతరం బ్యాండ్ స్టాండ్‌లోని ఓ సిమెంట్ బెంచ్‌పై కూర్చుంది.
ఆ సమయంలో ఓ పబ్‌లో బాక్సర్లుగా పనిచేసే ఇద్దరు యువకులు ఆమె దగ్గరకు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చారు. ఫోన్లో మాట్లాడుతున్న ఆమెను ఏమైనా హెల్ప్ కావాలా అంటూ అడగడంతో మొదలుపెట్టి… పేరేమిటని, ఎందుకు ఫోన్‌తో అంత బిజీగా ఉన్నావ్ అనీ… వరుసపెట్టి అసందర్భ ప్రశ్నలతో ఆమెను డిస్ట్రబ్ చేశారు.
ఆ తర్వాత ఒకడొచ్చి ఆమెకు అతి సన్నిహితంగా కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమెను మాటల్లో దింపడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. అన్నీ ఓపికగా భరిస్తూ… వారికి సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన పూర్ణిమ… మా ఇద్దరితో రాత్రి గడపడానికి ఎంత తీసుకుంటావ్? అన్న ప్రశ్నతో తన సహనాన్ని పూర్తిగా కోల్పోయింది.
దాంతో బిగ్గరగా అరవడం ప్రారంభించింది. అంతేకాక వారి మీద ఎదురుతిరిగింది. ఆమె ఎదురుదాడిని ఊహించని ఆ ఇద్దరూ అక్కడ నుంచి వేగంగా నడుస్తూ వెళ్లబోయారు. అయినా ఆమె విడవకుండా వెంటపడింది. దీంతో సమీపంలోని ఆటోలోకి ఎక్కేశారు. అయితే అప్పటికీ ఆమె వదలలేదు. మరో ఆటోలో వారి వెనుకే ఫాలో అయింది.
ఆటోలో వెంబడిస్తూనే అరుపులు కొనసాగించిన ఆమె ప్రయత్నం హిల్రోడ్లోని సెయింట్ ఆండ్రూస్ చర్చ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫలించింది. అక్కడ నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులు ఆమె అరుపులు విని వారిద్దరూ ఎక్కిన ఆటోని అడ్డగించారు. బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడు హర్యానాకు చెందిన దినేష్‌యాదవ్ అని పోలీసులు గుర్తించారు.
ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయం వదిలేయండని వాళ్లు కాళ్ల బేరానికి వచ్చినా పూర్ణిమ వినలేదు. బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో వారిద్దరి మీదా ఫిర్యాదు చేసింది. తన అరుపులను విన్నా కూడా అక్కడ కుటుంబ సమేతంగా వాకింగ్‌లూ జాగింగ్‌లూ చేస్తున్నవాళ్లు కూడా వినీ విననట్టు ఊరుకోవడం తననెంతో బాధించిందంది అంటోంది పూర్ణిమ. ఇలాంటి సందర్భాల్లో యువతులకు, మహిళలకు బాసటగా నిలవడానికి అందరూ ముందుకు రావాలని ఆమె కోరింది.
ఇలాంటివి జరిగేటప్పుడు ఆపడానికి ఎవరూ రారని, జరిగిపోయాక ఉద్యమాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలకు మాత్రం ముందుంటారని పూర్ణిమ లాంటి యువతులు గుర్తిస్తే… ఇక ఎప్పుడూ ఎవరి సాయం కోసం గొంతు చించుకోరు. తమ శక్తిని తామే నమ్ముకుంటారు.