టీమిండియాకి బంగ్లా షాక్‌.. 2 వికెట్స్‌ డౌన్‌

ఆరంభం అదిరింది.. అనుకునేలోపు అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు టీమిండియా బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌. ఫలితంగా టీమిండియా 75 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా మరో…

ఆరంభం అదిరింది.. అనుకునేలోపు అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు టీమిండియా బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌. ఫలితంగా టీమిండియా 75 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా మరో ఆలోచన చేయకుండా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు ధావన్‌, రోహిత్‌శర్మ ఇన్నింగ్స్‌ని జాగ్రత్తగా బిల్డప్‌ చేశారు. పరుగులు రావడం కష్టంగా మారడంతో, ఎక్కడా ఛాన్స్‌ తీసుకోకుండా బ్యాటింగ్‌ చేశారు. అనవసరపు షాట్స్‌కి యత్నించలేదు.

అయితే, 16.3 ఓవర్ల వద్ద షకీబ్‌ బౌలింగ్‌లో ముందుకెళ్ళి బంతిని ఆడదామనుకున్న శిఖర్‌ ధావన్‌ని స్టంప్‌ ఔట్‌ చేశాడు బంగ్లా వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌. దాంతో తొలి వికెట్‌ని 75 పరుగుల వద్ద కోల్పోయింది టీమిండియా. ధావన్‌ ఔట్‌ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ ఎక్కువసేపు క్రీజ్‌లో కుదురుకోలేకపోయాడు. 8 బంతులు ఆడిన కోహ్లీ 3 పరుగులకే వికెట్‌ పారేసుకున్నాడు. రుబెల్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రహీమ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు కోహ్లీ.

బంగ్లాదేశ్‌ చిన్న జట్టే అయినా పసికూన అనుకోడానికి వీల్లేదు. పొరపాట్లకు తావివ్వకుండా వుంటే బంగ్లాపై భారీ స్కోర్‌ పెద్ద కష్టమేమీ కాదు. ఇక, రెండు కీలక వికెట్లు కోల్పోయి, 20 ఓవర్లకు టీమిండియా 84 పరుగులు చేసింది.