రోహిత్‌ సెంచరీ.. బంగ్లా టార్గెట్‌ 303

రోహిత్‌ శర్మ దుమ్మురేపాడు.. రైనా ఆదుకున్నాడు.. వెరసి టీమిండియా స్కోర్‌ 300 పరుగులు దాటింది. బంగ్లాదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడ్తున్న టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302…

రోహిత్‌ శర్మ దుమ్మురేపాడు.. రైనా ఆదుకున్నాడు.. వెరసి టీమిండియా స్కోర్‌ 300 పరుగులు దాటింది. బంగ్లాదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడ్తున్న టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ జట్టు స్కోర్‌ 75 పరుగుల దాకా వికెట్‌ పడకుండా జాగ్రత్త పడినా, శిఖర్‌ ధావన్‌ ఔట్‌ కావడంతో పరిస్థితి మారింది. అక్కడిదాకా చాలా స్లోగా సాగిన టీమిండియా ఇన్నింగ్స్‌, ఆ తర్వాత ఇంకా గందరగోళంలో పడింది. నాలుగు పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రెహానే సైతం ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో 115 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియాను రైనా ఆదుకున్నాడు. రైనా, రోహిత్‌ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు.

65 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రైనా ఔటయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోర్‌ 237. ఇక ఆ తర్వాత రోహిత్‌ శర్మ చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ నమోదు చేసిన రోహిత్‌, సెంచరీ చేశాక మరింత వేగం పెంచాడు. 137 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ ఔట్‌ కాగా, చివర్లో జడేజా మెరుపులు మెరిపించాడు. 10 బంతులెదుర్కొన్న జడేజా 23 పరుగులు చేశాడు. ధోనీ కేవలం 6 పరుగులే చేసి నిరాశపర్చాడు.

బంగ్లా బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌కి 3 వికెట్లు దక్కాయి. మోర్టజా, షకీబ్‌, రుబెల్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటిదాకా టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలిచింది. పైగా, ప్రత్యర్థుల్ని అన్ని మ్యాచ్‌లలోనూ ఆలౌట్‌ చేయడం గమనార్హం. ఆ రికార్డ్‌ని టీమిండియా నిలబెట్టుకుంటుందా.? కాస్సేపాగితే తెలిసిపోతుంది. బ్యాట్స్‌మన్‌ పనైపోయింది, బౌలర్లే ఇక తమ సత్తా చాటుకోవాల్సి వుంది.