అడాలసెన్స్: హత్తుకునే కథ- ఆశ్చర్యపరిచే మేకింగ్

ఏ సినిమా అయినా కొందరికి నచ్చడం, కొందరికి నచ్చకపోవడం ఉంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రం మాత్రం అలా లేదు.

కొన్ని సినిమాలు బాగున్నాయనిపిస్తాయి;
కొన్ని కథలోకి లాక్కుపోయి మాయ చేస్తాయి;
కొన్ని సమాజానికి అద్దం పడతాయి;
మరికొన్ని అద్భుతమనిపిస్తాయి;
ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి.
కానీ ఇవన్నీ ఒక సినిమాయే చేస్తే?
చేసింది. ఒకరిని కాదు, ఇంచుమించు చూస్తున్న అందర్నీ.

ఏ సినిమా అయినా కొందరికి నచ్చడం, కొందరికి నచ్చకపోవడం ఉంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రం మాత్రం అలా లేదు. చూసినవాళ్ళంతా అద్భుతమంటున్నారు. వాళ్లలా అనడానికి ముఖ్యకారణం- సినిమా మొత్తం సింగిల్ షాట్లో తీయడం. అవును నిజమే. ఎక్కడా సీన్ కట్ అవ్వకుండా, ఎడిటర్ అవసరం లేకుండా, షూట్ చేసింది చేసినట్టుగా యథాతథంగా అప్లోడ్ చేసేసారు. అదే వింత, విడ్డూరం.

ఇంతకీ ఈ అరుదైన సింగిల్ సీన్ సినిమా టైటిల్ “అడాలసెన్స్”. ఇది ఒక బ్రిటీష్ చిత్రం. మూడు ఎపిసోడ్లుగా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు గంట.

ఎక్కడా షాట్ డివిజన్లు, సీన్ చేంజులు లేని ఈ సినిమా ఒక టెక్నికల్ వండరైతే, అసలు ఇందులో ఉన్న కంటెంట్ వీక్షకుల్ని ఆ ప్రపంచంలోకి లాక్కుపోతుంది.

13 ఏళ్ల పిల్లాడు జమీని పోలీసులు హత్యా నేరం కింద అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది తప్ప జాలి, దయ, స్పెషల్ ఇంటెరెస్ట్ వంటివి ఎలా చూపదో ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకీ జమీ నిజంగా హత్య చేసాడా? చేసాడు!! ఇదొక మలుపు. ఇంతకీ ఎందుకు చేసాడు? ఏమి ఆశించి చేసాడు అనేది ఇతివృత్తం.

ఒక్కో ఎపిసోడ్ ఒక్కో వాతావరణాన్ని చూపిస్తుంటుంది- పోలీస్ స్టేషన్లు, స్కూళ్లు, మెంటల్ హాస్పిటల్స్, ఇళ్లు…ఇలా ప్రతి చోటు మనుషులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కళ్లకికట్టినట్టు చూపాడు దర్శకుడు.

జమీకి, ఒక సైకాలజిస్ట్ కి మధ్యన జరిగే సంభాషణ ఒక హైలైట్. పిల్లల మానసిక ప్రవృత్తి ఎలా ఉంటోంది, ఏ ప్రభావం వల్ల ఎలా మారుతోంది అనేది చూడాల్సిన విషయం. జమీ ఒక బాలనేరస్థుడిగా మారే క్రమం తల్లిదండ్రుల్ని ఎంత బాధపెట్టింది, వాళ్లు కనీసం అతనిలో నేర ఛాయలు ముందుగా ఎందుకు కనిపెట్టలేకపోయారు అనేది కూడా చివరి ఎపిసోడ్ లో కనిపిస్తుంది.

కథ ముగింపుని ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కనుక చెప్పట్లేదు. ఇంతకీ ఈ చిత్రాన్ని రెండు సార్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ఎందుకంటే ఒక పక్కన కథనం, మరో పక్క సింగిల్ సీన్ గా చిత్రం మొత్తాన్ని ఎలా తీసారనే ఆసక్తి..దీని వల్ల మొదటి సారి చూసినప్పుడు పూర్తిగా సింక్ కాకపోవచ్చు. నెమ్మదిగా ఆ మేకింగ్ కి అలవాటు పడి, కథలోకి వెళ్తే ఇక అయ్యే వరకు తల తిప్పడం కష్టం.

ఈ వెబ్ చిత్రం సమాజంలో ఉన్న ఆలోచనలను, నైతికతను, వ్యక్తుల ప్రవర్తనను ప్రభావితం చేసే వ్యవస్థలను ప్రశ్నిస్తుంది. 13 ఏళ్ల బాలుడు హత్యకు పాల్పడినప్పుడు, మనం అతన్ని బాధితుడిగా చూడాలా లేదా అపరాధిగా చూడాలా అనే సందేహంలో పడిపోతాం. ఈ సిరీస్ సమాజం గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేటి టెక్నాలజీ అందరిమీదా కనిపించకుండా చాలా ప్రభావం చూపిస్తోంది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఫోరంస్ మన అభిప్రాయాలను రూపుదిద్దుతున్నాయి. మన సోషల్ మీడియా అల్గారిథమ్స్, మన డిజిటల్ ఛాయిసులు మనల్ని నిరంతరం నిర్దేశిస్తున్నాయి. చివరికి, ఈ సిరీస్ మనపై ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధిస్తుంది- “మనం నిజంగా స్వేచ్ఛగా ఉన్నామా, లేదా మనం కూడా కనిపించకుండా ఉన్న వ్యవస్థలకు బానిసలమా?”

ఒక మనిషిలో హింసా ప్రవర్తనకు ఎలా వస్తుంది? అది కుటుంబంలోనే ప్రారంభమవుతుందా? స్కూల్లోనా? సోషల్ మీడియాలోనా? సమాజం వ్యక్తులను ఎలా తీర్చిదిద్దుతుందో ఈ షో మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. చివరికి, ఈ సిరీస్ ఆలోచింపజేస్తుంది – పిల్లలను వదిలేయకుండా, వారిని అర్థం చేసుకోవడం, వారితో మమేకమవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.

ఈ సినిమా లాంటి మూడు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గురించి చెప్పుకోవాలంటే కంటెంట్ గురించి ఒకసారి, మేకింగ్ గురించి ఒకసారి వివరంగా చెప్పుకోవాలి.

ప్రపంచ సినిమా చరిత్రలో సింగిల్ షాట్ లో మూడు గంటల నిడివిగల కథనాన్ని ఇంత ఆసక్తికరంగా మలచడం ఇదే ప్రప్రధమం. ఎక్కడా అశ్లీలత లేకుండా, కుటుంబసమేతంగా చూసేవిధంగా ఉండడం దీనికున్న మరొక ప్లస్ పాయింట్.

కథలో విషయానికి, మేకింగులో విశేషానికి ఇది తప్పక చూడాల్సిన చిత్రం. సమయం చూసుకుని చూడడం మొదలుపెట్టండి. మూడు గంటలు సమయం తెలీదు.

7 Replies to “అడాలసెన్స్: హత్తుకునే కథ- ఆశ్చర్యపరిచే మేకింగ్”

  1. Asalu series chusava leka vere websites lo chusi dinchesava uncle… cinema antav, 3 episodes antav, 3 hours single take antav 😂

    4 episodes unnai, each episode is a single take without any cuts. Also 3rd episode lo undedi mental hospital kadu ra nayana jail ey adi.

Comments are closed.