దక్షిణాది గోడు హస్తినలో వినిపించాలి!

ఇవే డిమాండ్లను ఇంతకంటె బలంగా హస్తిన వేదికగా వినిపించడం వల్ల దేశం దృష్టిని ఆకర్షించవచ్చుననే వాదన వినిపిస్తోంది.

డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అనే మాటను అందరూ ఒప్పుకుంటారు. ఇలాంటి అన్యాయం జరగకుండా చక్కదిద్దే చర్యల గురించి పాలకుల వైపు నుంచి ఎవ్వరూ మాట్లాడడం లేదు. భాజపా, ఎన్డీయేలోని వారి అనుబంధ పార్టీలకు కూడా జరిగే అన్యాయం గురించి తెలుసు.. అయితే వారు మౌనం పాటిస్తూ వస్తున్నారు.

స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి నలుగురు ముఖ్యమంత్రులు హాజరు అయిన నేపథ్యంలో.. ఆందోళనకు గురవుతున్న రాష్ట్రాల గళం గట్టిగా వినిపించినట్టే. అయితే కేవలం తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక సమావేశం నిర్వహించినంత మాత్రాన, దక్షిణాదిలోనే మరొకచోట ఇంకోసారి సమావేశం నిర్వహించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. డీలిమిటేషన్ ద్వారా తమ రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఏమిటో హస్తినాపురం వేదికగానే ప్రకటించాల్సిన అవసరం ఉంది.

చెన్నైలో జరిగిన తొలి సమావేశంలో జేఏసీ ఏర్పాటు అయింది. 1971 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే ఎంపీ నియోజకవర్గాల పునర్ విభజన జరగాలనే తీర్మానం చేశారు. జేఏసీ రెండో సమావేశం తెలంగాణ హైదరాబాదులో జరగాలని కూడా నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడి వారి గోడును.. ఇక్కడిక్కడే చర్చించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? వీరి బాధలు, వీరి భయాలు తెలియవలసినది ఢిల్లీ పాలకులకు కదా అనే వాదన కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

డీలిమిటేషన్ కోసం కమిషన్ ను ఏర్పాటు చేయడానికి ముందే కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే సమావేశం గానీ.. తమ డిమాండ్లను బలంగా తెలియజేస్తూ ప్రదర్శన లేదా ధర్నా గానీ.. హస్తినలోనే నిర్వహించడం వలన.. సమస్య ఎక్కువ మంది ద‌ష్టికి వెళుతుందనేది పలువురి ఆలోచనగా ఉంది.

చెన్నైలో జరిగిన సమావేశానికి చంద్రబాబు మినహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా వచ్చినట్టే. కర్ణాటక సీఎం బదులు డిప్యూటీ సీఎం కూడా వచ్చారు. పంజాబ్ సీఎం కూడా వచ్చారు. ఢిల్లీలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా కాస్త సమయం చేసుకోగలిగితే.. అయిదుగురు ముఖ్యమంత్రులు, ఇంకా ఆయా రాష్ట్రాల్లోని కీలక నాయకులు కలిసి ఢిల్లీలో ఒక పెద్ద ప్రదర్శన, జంతర్ మంతర్ వద్ద ధర్నా, దీక్ష లాంటివి నిర్వహిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన సమావేశంలో లేవనెత్తిన భయాలు, చేసిన తీర్మానాలు, సూచనలు అన్నీ సహేతుకమైనవే. పునర్ వ్యవస్థీకరణ వద్దని ఎవ్వరూ అనడం లేదు. జనాభా నియంత్రణ సరిగ్గా పాటించినందుకు తాము అన్యాయానికి గురికాకూడదు అని మాత్రమే అంటున్నారు. ఇవే డిమాండ్లను ఇంతకంటె బలంగా హస్తిన వేదికగా వినిపించడం వల్ల దేశం దృష్టిని ఆకర్షించవచ్చుననే వాదన వినిపిస్తోంది.

7 Replies to “దక్షిణాది గోడు హస్తినలో వినిపించాలి!”

Comments are closed.