దాదాపు 20 సెల్‌ఫోన్లు, రెండు ఇళ్లు, మోటార్ సైకిల్స్, కంప్యూటర్‌లు, డేటా స్టోరేజ్ డివైజ్‌లు, రిజిస్టర్‌లో 5వేల మంది పేర్లు, చిరునామాలు, తనకేమో అరడజనుకుపైగా మారుపేర్లు… ఇంకా ఇలాంటివే ఎన్నో. ఇవన్నీ ఆయుధాలుగా వాడిన వ్యక్తి ఏ పకడ్బందీ స్కామ్ చేయలేదు. ఓ రేంజ్‌లో మాఫియా ముఠానేమీ నడపలేదు.
మరి ఇంత పకడ్బందీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే… దీని ద్వారా అమాయకులైన ఆడపిల్లలను వశపరచుకోవడానికి. ప్రస్తుతం ఆడపిల్లల పరిస్థితి ఎంత భయంకరంగా, ఆందోళన కరంగా మారిందో తెలియడానికి తాజాగా వెల్లడైన ఆ వ్యక్తి నిర్వాకం ఒక నిదర్శనం.
తెలంగాణలోని నల్గొండకు చెందిన మధు అనే ప్రబుధ్దుడు సాగించిన అమ్మాయిల వేట… తెలుస్తుంటే టీనేజి ఆడపిల్లలున్న ప్రతి తండ్రీ ఉలిక్కిపడేలా ఉంది. అసలు అమ్మాయిలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా చెప్పలేని స్థితికి దారితీసేలా ఉంది. నల్గొండ జిల్లాకు చెందిన కలకండ మధు… ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్‌గా మంచి ఉద్యోగం చేస్తూ చక్కగా పెళ్లి చేసుకుని స్థిరపడే అవకాశం ఉన్నా అమ్మాయిలంటే విపరీతమైన కాంక్షతో దీని కోసం బోలెడంత సమయం, తెలివితేటలు వెచ్చించి, వారికి కెరీర్ గైడె పాటు ఒకరూ ఇద్దరూ కాదు వేలాది మంది డేటా సేకరించడం ఆడపిచ్చి ఉన్న మగవాడి చేత అది ఎంతపనైనా చేయిస్తుందనేందుకు నిదర్శనం.
ముఖ్యంగా టెక్నాలజీని, కమ్యూనికేషన్‌ని పక్కాగా వాడుకున్న తీరు భీతి గొల్పుతోంది. ఆడపిల్లల డేటా నమోదుకు టెన్త్‌క్లాస్, ఇంటర్, ఒయు ఎంట్రెన్స్ టెస్ట్, పిజి ఎగ్జామినేషన్స్… వగైరాలకు అప్లయ్ చేస్తున్నవారి వివరాలు సదరు విద్యాసంస్థల వెబ్ సైట్లలో ఉంచే హాల్ టిక్కెట్ల సమాచారం నుంచి మధు సులభంగా కొల్లగొట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. దీని ద్వారా అమ్మాయిల డేటాలు ఎంత సురక్షితమో అర్ధం అవుతోంది. కేవలం ఎల్బీనగర్‌లోని ఒక నెట్ సెంటర్ యజమాని శివ అనే వ్యక్తిని లొంగదీసుకోవడం ద్వారి మధు ఇది సాధించగలిగాడు. విభిన్న కోర్సులు చదవుతున్న 5వేల మంది అమ్మాయిల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో సహా దక్కించుకున్నాడు.
అమ్మాయిల టెలిఫోన్ నెంబర్లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లకు తగ్గట్టు సిమ్‌కార్డులు కొన్నాడు. దీని కోసం రోడ్‌సైడ్ కియోస్క్‌ల ద్వారా సిమ్‌కార్డులు అమ్మాలనే తొందరలో ఉండే సర్వీస్ ప్రొవైడర్ల ఆరాటాన్ని మధు వినియోగించుకున్నాడు. తద్వారా ఈ తరహా రోడ్ సైడ్ ప్రమోషన్‌లపై ప్రశ్నలు రేకెత్తించాడు. కొంచెం సొమ్ము ఎర చూపి బిజ్జి మహేశ్వర్, గుజ్జల్వార్ సతీష్ వంటి దొంగ పేర్లతో నకిలీ డేటాతో చైతన్యపురి, పంజాగుట్ట వంటి ఏరియాల్లో నుంచి సిమ్‌కార్డులను కొనగలిగాడంటేనే సదరు నిబంధనలెంత గొప్పగా అమలవుతున్నాయో తెలుసుకోవచ్చు. వీటిని ఉపయోగిస్తూ అమ్మాయిలకు మధు యధేఛ్చగా కాల్స్ చేయగలిగాడు.
మంచి మాటకారితనం ఉంటే చదువుకున్న అమ్మాయిలు సైతం బుట్టలో పడేయడం సులభమే నని మరోసారి మధు నిరూపించాడు. అంతేకాదు…కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ అంటూ ప్రస్తుతం యువతుల్లో కెరీర్ పట్ల ఉన్న ఆత్రాన్ని వీడు వాడుకున్న తీరు కూడా యువతులకు హెచ్చరికలు పంపుతోంది. దీనికి ముందుగా వారికి బర్త్‌డే గ్రీటింగ్స్ కూడా పంపి మరీ ట్రాక్ సిద్ధం చేసుకునేవాడు. తన మాటలు నమ్మినవారు తనను కలిసేట్టు చేసుకుని ఆ తర్వాత వారి ఆన్‌లైన్ ఐడీలు, ఎఫ్‌బి అడ్రస్‌లూ… వంటివి సేకరించి…అక్కడి నుంచి వారిని నయానో భయానో లొంగదీసుకునేవాడు. లేకపోతే వారి అభ్యంతరకర ఫొటోలను అప్‌లోడ్ చేయడం వంటివి చేశాడు.
తనకు లొంగిపోయిన వారి గురించి పని పూర్తియిపోయిందన్న గుర్తుగా ఓవర్ అనీ, తనను ఎదురు ప్రశ్నలేసిన వారికి డేంజర్ అనీ, తనకు పెద్దగా లాభించరు అనుకున్నవారి గురించి వేస్ట్ అనీ… ఇలా వేలాది అమ్మాయిలను డేటా మార్కింగ్ చేసి విభజించడం చూస్తుంటే… ఆడపిల్లలంటే వీడికెంత చులకనైన అభిప్రాయం ఉందో తెలుస్తుంది.
ఒక్కడు కాస్త బుర్ర ఉపయోగిస్తే… ఇంత మంది అమ్మాయిల జీవితాలను తలకిందులు చేసేలా చేయగలిగాడంటే… అదంతా ఆధునిక టెక్నాలజీ పుణ్యమే అని చెప్పకతప్పదు. ఓ వైపు అభివృధ్ధిని ఇస్తూనే మరో చేత్తో అదే సాంకేతిక విప్లవం అమాయక ఆడపిల్లల పాలిట శాపంగా మారుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో… ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మధు… అనే ఒక కామ పిశాచిని కటకటాల్లోకి పంపడంతో ఈ సమస్య పరిష్కారం అయిపోతుందనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి ఉండదు. కెరీర్ కౌన్సిలర్లు సహా ప్రతి ఒక్కరినీ సందేహాస్పదంగా చూడాల్సిన పరిస్థితులను రప్పించిన ఈ నేరం… ఆడపిల్లల భధ్రత పట్ల కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాల్సిన బాధ్యత సమాజానిదే.