ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి టీవీ మీడియాకు చాలా శక్తి వుందని అందరికీ తెలుసు. సన్ టీవీ వంటి నెట్‌వర్క్‌ను లోబరచుకుంటే తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవచ్చని ఏ గ్రూపయినా, ఏ పార్టీ అయినా అనుకుంటే ఆశ్చర్యం లేదు. దేశంలోని మొత్తం కేబుల్, శాటిలైట్ చందాదారుల్లో 35% మంది దక్షిణాది రాష్ట్రాలలో వున్నారు. ఆ రాష్ట్రాలలో అందరి కంటె అగ్రగామిగా వున్నది 1993లో ప్రారంభమైన సన్ గ్రూపు. కేరళలో మాత్రమే ద్వితీయస్థానం. తెలుగు రాష్ట్రాలలో దాని మార్కెట్ వాటా 26%, కర్ణాటకలో 37%, కేరళలో 29%, తమిళనాడులో 48%, దేశం మొత్తం మీద చూసుకుంటే 10.5%. దానికి 33 టీవీ ఛానెళ్లు, 45 రేడియో స్టేషన్లు వున్నాయి. కోటి మంది డిటిఎచ్ చందాదారులున్నారు. ఏటా రూ.2244 కోట్ల రెవెన్యూ వస్తోంది. రూ.737 కోట్ల లాభం. గత 20 ఏళ్లగా డిఎంకె కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో సఖ్యత పాటిస్తూ సన్ టీవీ అభివృద్ధికి తోడ్పడింది. కార్యక్రమాల నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం ప్రదర్శించడం చేత ప్రేక్షకుల ఆదరణ చూరగొని అత్యంత వేగంగా విస్తరించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలతో సరిపెట్టకుండా సినిమా రంగంలోకి కూడా వెళ్లి, యింకా యింకా అనేక రంగాల్లోకి చొచ్చుకుపోయింది. కళానిధి మారన్ పేరు మీద రూ.14500 కోట్ల ఆస్తి వుంది. అతను, అతని భార్య కావేరీ జీతాల రూపేణా 2013-14లో రూ.60 కోట్లు ఆర్జించారు. అతని వాటాదారు, సోదరుడు దయానిధి మారన్ కేంద్రమంత్రిగా కూడా చేశాడు.
అలాటి సన్ గ్రూపు యిప్పుడు సంక్షోభంలో మునిగింది. కేంద్ర హోం శాఖ దాని ప్రసారాలకు సెక్యూరిటీ క్లియరెన్సు నిలిపివేసింది. ఎందుకు అంటే మారన్ సోదరులపై కేసు నడుస్తోంది కాబట్టి అంది. మారన్ సోదరులకు ఆర్జన పెరిగినకొద్దీ ధనదాహం పెరిగిందనుకోవాలి. దయానిధి 2006లో టెలికామ్ మంత్రిగా వుండగా తన యింటికి 300 లైన్లతో ప్రయివేటు ఎక్స్‌ఛేంజ్ పెట్టించుకుని సన్ టీవికి వుపయోగించుకున్నాడు. అంతేకాదు, ఎయిర్‌సెల్ అధిపతి శివశంకరన్‌ను ఒత్తిడి చేసి ఆ కంపెనీని మలేసియావాసి ఆనందకృష్ణన్‌కు అమ్మించారు. అందుకుగాను కృతజ్ఞతాపూర్వకంగా ఆనందకృష్ణన్ సన్ టివి డిటిఎచ్ ఆపరేషన్స్‌లో రూ. 900 కోట్ల పెట్టుబడి ఇంగ్లండ్‌లో వున్న ఆస్ట్రో కంపెనీ ద్వారా పెట్టాడు. ఈ కేసు కారణంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సన్ టివికి చెందిన రూ.742.58 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసింది. హైకోర్టు ఆ ఆర్డరును సమర్థించింది. సన్ టివి దీనిపై సుప్రీం కోర్టుకి వెళ్లవచ్చు. ఈ కేసులు పెండింగులో వున్నాయి కాబట్టి దాని ప్రసారాలకు సెక్యూరిటీ క్లియరెన్సు యివ్వం అంటున్నారు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. దానికీ దీనికీ లింకేమిటి, యివ్వండి అని అరుణ్ జైట్లే చెప్పి చూశారు కానీ రాజ్‌నాథ్ వినలేదు. దాంతో సన్ గ్రూపు షేరు విలువ పడిపోయింది.
మారన్ల పట్ల ఎన్‌డిఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం అనుమానాస్పదంగానే వుంది. స్పైస్‌జెట్ చేతులు మారిన పద్ధతి గమనిస్తే యిది బోధపడుతుంది. అజయ్ సింగ్ అనే అతను స్థాపించి, చైర్మన్‌గా వున్న స్పైస్‌జెట్ కంపెనీలో అది ఆర్జిస్తున్న లాభాలు చూసి 2010లో మారన్ సన్ గ్రూపు ద్వారా రూ. 940 కోట్లు పెట్టుబడి పెట్టాడు. 2011 మార్చి నాటికి రూ.101 కోట్లు లాభంలో వున్న కంపెనీ మారన్ రూ. 800 కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా విస్తరించడంతో ఏడాది తిరిగేసరికి రూ.606 కోట్లు నష్టం మూటగట్టుకుంది. అయినా 2012లో అతను 27 బంబార్డియర్ క్యూ-400 ఎయిర్‌క్రాప్టులు కొని, వీటితో చిన్న పట్టణాలకు కూడా సర్వీసులు విస్తరిస్తాం అని చెప్పుకున్నాడు. మారన్ దూకుడు వలన 2014 మార్చి నాటికి కంపెనీ రూ.1003 కోట్ల నష్టానికి చేరుకుంది. స్వదేశీ, విదేశీ ఋణదాతలకు రూ. 2000 కోట్లు బాకీ వుంది. బ్యాంకులకు, ఆయిల్ కంపెనీలకు, ఎయిర్‌పోర్టు ఆపరేటర్లకు కలిపి రూ.1700 కోట్లు బాకీ పడింది. వడ్డీ రేట్లు తక్కువగానే వున్నా కంపెనీ వడ్డీ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చింది. భారతదేశంలో అత్యంత ధనికుల జాబితాలో 38 వ పేరు కళానిధి మారన్‌ది. అయినా అతను తన డబ్బు పెట్టి కంపెనీని ఎందుకు కాపాడలేదో
ఎవరికీ అర్థం కాలేదు. విచిత్రమైన పరిస్థితుల్లో దాని యాజమాన్యం అజయ్ సింగ్ చేతిలోకి వెళ్లేందుకు ప్రభుత్వం సహకరించింది. అది మారన్ సమ్మతితో జరిగిందో లేక ఎయిర్‌సెల్ విషయంలో మారన్లు శివశంకరన్‌ను ఒత్తిడి చేసి ఆనందకృష్ణన్‌కు అమ్మించినట్లు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అజయ్ సింగ్‌కు అమ్మించారో ప్రస్తుతానికి తెలియటం లేదు.
అజయ్ సింగ్ బిజెపి నాయకులకు, ముఖ్యంగా ప్రమోద్ మహాజన్‌కు సన్నిహితుడు. 1996లో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం వుండగా అతన్ని ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌కు డైరక్టరుగా నియమించారు. కార్పోరేషన్‌కు కొత్త బస్సులు సమకూర్చడంలో అతను ప్రధాన భూమిక వహించాడు. కితం ఏడాది బిజెపి ఎన్నికల ప్రచార కమిటీలోని స్పెషల్ సెల్‌లో అమిత్ షా, పీయూష్ గోయల్, అరుణ్ జైట్లేతో బాటు అతను కూడా సభ్యుడు. ఔట్‌డోర్, ఎలక్ట్రానిక్ పబ్లిసిటీ బాధ్యతను అతను నిర్వహించాడు. అతనికి సుమారుగా 40 కంపెనీలతో అనుబంధం వుంది. వాటిల్లో కొన్ని బ్యాంకులకు బకాయి పడ్డాయి కూడా. 2014 డిసెంబరులో కళానిధి మారన్ తన వద్దకు వచ్చి తనకు, కాల్ ఎయిర్‌వేస్‌కు గల 58.46% వాటా అమ్మజూపాడని అజయ్ అంటాడు. అది ఎంతకు కొన్నాడో చెప్పడం లేదు కానీ ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 60.31% వాటా అతనిదే. తక్కినది పబ్లిక్‌ది. ఈ వాటాలు కొనడానికి అజయ్‌కు డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందో సెబి అడగలేదు. అసలు ఏ రేటున వాటాలు చేతులు మారాయో కూడా అడగలేదు.
ఏదైనా కంపెనీలో 25% కంటె ఎక్కువ వాటాలు అమ్ముదామనుకున్నపుడు అందరికీ ఓపెన్ ఆఫర్ యివ్వాలి, తనకు నచ్చిన వాడి చేతిలో పెట్టేయకూడదు. 2013లో జెట్ ఎయిర్‌వేస్‌లోని 24% వాటాలు ఎతిహాద్‌కు అమ్మేసినపుడు యీ ప్రశ్న వచ్చింది. 25% లోపే కదా అని జవాబిచ్చారు. అప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. యుపిఏ ప్రభుత్వం ఎతిహాద్‌కు మూడేళ్లలో 13,300 సీట్ల నుండి 50 వేలకు పెంచుకోవడానికి అనుమతి యిచ్చి ఎయిర్‌ఇండియా వ్యాపారాన్ని దెబ్బతీసింది. అంతేకాదు, జెట్ ఎయిర్‌వేస్ భారత ప్రభుత్వం తనకిచ్చిన లండన్ ఎయిర్‌పోర్టులో పార్కింగ్ హక్కులను ఎతిహాద్‌కు 7 కోట్ల డాలర్లకు అమ్మడం కూడా అనుమానాలు రేకెత్తించింది. వీటిపై సుబ్రహ్మణ్యం స్వామి సందేహాలు లేవనెత్తుతూ సుప్రీం కోర్టుకి వెళ్లారు. అదే సుబ్రహ్మణ్యం స్వామి యిప్పుడు బిజెపి లెటర్‌హెడ్‌పై మోదీని ఉద్దేశించి ఏప్రిల్ – మేలలో మూడు లేఖలు రాసి స్పైస్‌జెట్‌ను అజయ్ సింగ్‌కు అప్పగించడంలో జరిగిన అక్రమాలను ప్రస్తావించారు. సెబి, యితర రెగ్యులేటరీ సంస్థలు తమ బాధ్యతలను విస్మరించాయని ఆరోపించారు. స్పెస్‌జెట్‌కు రూ.20 వేల కోట్ల ఆస్తులున్నాయని, దాదాపు 40% వాటాలు సాధారణ షేరుహోల్డర్‌ల చేతిలో, బ్యాంకుల చేతిలో వున్నాయనీ, యింత పెద్ద కంపెనీ చడీచప్పుడు లేకుండా చేతులు మారడమేమిటని అడిగారు. ప్రతీసారి ఉత్తరం అందినట్లు ప్రధాని కార్యాలయం నుండి ఎక్నాలెజ్‌మెంట్ వచ్చింది తప్ప సమాధానం రాలేదు.
వాటాలు పొందాక సెబికి సమర్పించిన పత్రాలలో షేరును కొన్న రేటు వెల్లడించవలసిన చోట అజయ్ సింగ్ ''రహస్యం'' (కాన్ఫిడెన్షియల్) అని రాశారు. అయినా సెబి కిమ్మనలేదు. స్పెస్‌జెట్ ధోరణిలో సన్ టీవీని రిలయన్సుకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక వెబ్‌సైట్ రాసింది. రిలయన్సు ప్రతినిథి దానిలో వాస్తవం లేదని ఖండించారు కానీ అనుమానాలు తొలగిపోలేదు. ఎందుకంటే దక్షిణాదిన విస్తరించవలసిన రాజకీయ అవసరం బిజెపికి వుంది. దానికి మీడియా చేతిలో వుండడం ఎంతైనా ఉపయోగకరం. తెలుగు మీడియా దిగ్గజం యిప్పటికే రిలయన్సు చేతికి వెళ్లిపోయింది. సన్ గ్రూపును కూడా రిలయన్సు వశపరచుకోగలిగితే అంబానీలకు వ్యాపారప్రయోజనాలు, బిజెపి రాజకీయప్రయోజనాలు రెండూ నెరవేరుతాయి. తమిళనాడులో డిఎంకెని ఎదుర్కోవాలంటే సన్ టీవీపై అదుపు ఉపకరిస్తుంది. ఇప్పటికే కేసుల పేరు చెప్పి సన్‌కు లైసెన్సులు ఆపేసి సన్ గ్రూపు షేరు విలువ పడిపోయేట్లా చేశారు. భయంతో వాటాదారులు షేర్లు అమ్మడం మొదలుపెడితే రిలయన్సు ఆ షేర్లను కొనేసి బలపడవచ్చు. తర్వాత ప్రభుత్వం ద్వారా కేసుల బూచి చూపించి సన్ యాజమాన్యం నుండి మారన్‌లను తప్పించవచ్చు. ఏం జరుగుతుందో ముందుముందు తెలుస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)