బాహుబలిని క్యాష్ చేసుకుంటున్నారు

బాహుబలికి వచ్చిన హైప్ ఇంతా అంతా కాదు. కానీ అదే సమయంలో ఇండస్ట్రీలో దానిపై వస్తున్న వార్తలు ఇన్నీ అన్నీ కావు.  ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఏరియాల వారీ బాహుబలి పంపిణీ హక్కులు…

బాహుబలికి వచ్చిన హైప్ ఇంతా అంతా కాదు. కానీ అదే సమయంలో ఇండస్ట్రీలో దానిపై వస్తున్న వార్తలు ఇన్నీ అన్నీ కావు.  ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఏరియాల వారీ బాహుబలి పంపిణీ హక్కులు కొనుకున్న వారు దానికి వస్తున్న హైప్ ను క్యాష్ చేసుకుంటున్నారన్నది. ఇది రెండు విధాలుగా జరుగుతోందట. 

ఒకటి థియేటర్ల దగ్గర భారీ అడ్వాన్స్ లు తీసుకోవడం. మంచి సినిమా, కాస్త నెల రోజుల పాటు కలెక్షన్లు కుమ్మేస్తుందనుకున్న సినిమా తమ థియేటర్లో ఆడాలని ఎగ్జిబిటర్లు కోరుకోవడం సహజం. అందుకే వారి దగ్గర నుంచి భారీ అడ్వాన్స్ లు తీసుకుని, సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే, ఆ విధంగా బాహుబలికి ఇచ్చిన సొమ్ముబయ్యర్లకు విడుదలకు ముందే అందిపోతుంది. 

ఇక రెండో విధానం..రీ సేల్ లేదా, భాగస్వామ్యం. తాము కొన్నదాన్ని ప్రీమియం రేట్లకు వేరే వాళ్లకు అమ్మేయడం, లేదా అందులో పావలా, అర్థ వాటా ఇచ్చేయడం ఈ విధంగా కొన్ని జిల్లాల్లో జరిగింది. ముఖ్యంగా మూడు నుంచి అయిదు జిల్లాలు వుండే ఏరియాలకు కొన్నవారు ఒక్కో జిల్లా వంతున విడగొట్టి అమ్మేయడం అన్నమాట.

అయితే బాహుబలి హక్కుల్లో ఎక్కువ ప్రభాస్ కు అతని సన్నిహితులకు, సాయి కొర్రపాటికి, దిల్ రాజుకు వున్నాయి. మిగిలినవి తక్కువే. ఈ సినిమాతో సాయి కొర్రపాటి తన పంపిణీ వ్యాపారాన్ని తొలిసారి కృష్ణా జిల్లాకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం 2న అక్కడ కార్యాలయం ప్రారంభిస్తున్నారు. 

ఎక్కడిక్కడ బాహుబలి రికార్డు రేట్లకే అమ్మారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలిపి ఏడు కోట్లుకు పైగా చెల్లించారు. దీనిని ప్రభాస్ సన్నిహితులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికి తెలుగు సినిమా లెక్కల ప్రకారం ఏ సినిమా కూడా అయిదున్నర కోట్ల నుంచి ఆరు కోట్లు దాటలేదు. మరి ఈ సినిమా ఏడు కోట్లకు పైగా అంటే కాస్త ఆలోచించాలి. ఆ టార్గెట్ రీచ్ అయితే బాహుబలి అద్భుతాలు సృష్టించినట్లే.