ఎమ్బీయస్‌: సెక్షన్‌ 8 పై రచ్చ – 03

ఆంధ్రులకు రావలసిన హక్కులు వాళ్లు తీసుకుంటే తెలంగాణ ప్రజలు బాధపడతారా? పోలవరం గ్రామాల గురించి ఆర్డినెన్సు తెచ్చుకుంటే యిక్కడ నిరసన ప్రదర్శనలు చేశారా? తెరాస ప్రభుత్వమే ఓ రోజు కాస్త హంగామా చేసి తర్వాత…

ఆంధ్రులకు రావలసిన హక్కులు వాళ్లు తీసుకుంటే తెలంగాణ ప్రజలు బాధపడతారా? పోలవరం గ్రామాల గురించి ఆర్డినెన్సు తెచ్చుకుంటే యిక్కడ నిరసన ప్రదర్శనలు చేశారా? తెరాస ప్రభుత్వమే ఓ రోజు కాస్త హంగామా చేసి తర్వాత కట్టిపెట్టేసింది. ప్రజలేమైనా ఆందోళన చెందారా? టెన్త్‌ షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాదులో వున్న వందకు పైగా సంస్థల్లో ఆంధ్ర ప్రభుత్వం తన వాటా తీసుకుంటానంటే తెలంగాణ ఓటర్లు వెళ్లి అడ్డం పడ్డారా? గొడవ జరుగుతున్నది ఉద్యోగుల మధ్య మాత్రమే. ఆంధ్ర వుద్యోగులు వెళ్లిపోతే తమకు ఉద్యోగాలు, పదోన్నతులు వస్తాయన్న ఆశతో కొందరు గొడవలు చేయవచ్చు. అవి పేపర్లో చదివి ఓహో అనుకోవడం తప్ప తెలంగాణలోని సాధారణ ప్రజలు చేస్తున్నదేమీ లేదు. ఉద్యోగులు ఎప్పుడూ లిటిగెంట్లే. ఈ రోజు యిదైంది. రేపు ఉత్తర తెలంగాణావాళ్లే అన్నీ పట్టుకుపోతున్నారని మరోరు అంటారు. రిజర్వేషన్లు అంటారు. అవి యిస్తే దానిలో కేటగరైజేషన్‌ కావాలంటారు. ఉద్యోగుల గొడవలతో మామూలు ఓటర్లకు సంబంధం వుండదు. అలాటప్పుడు వాళ్లను తలచుకుని భయం దేనికి? 

ఈ రోజు సెక్షన్‌ 8 గురించి పొద్దస్తమానం గోల చేస్తున్న బాబు, ఏడాదిగా కొన్ని ఆఫీసుల్లో ఐయేయస్‌ అధికారులను అడ్డుకుంటూ వుంటే ఏం చేశారు? ఏం ఆయన పార్టీ యూనిట్‌ యిక్కడ వుంది కదా? పార్టీ కార్మిక సంఘాలున్నాయి కదా? వాళ్ల చేత అధికారులకు రక్షణ కల్పించారా? కోర్టుకి వెళ్లారా? గవర్నరు వద్దకు వెళ్లి సెక్షన్‌ 8 గుర్తు చేసి, అది అమలు చేయకపోతే నిరాహారదీక్ష చేస్తా అన్నారా? మాట్లాడితే ప్రాజెక్టుల వద్ద వారంలో రెండు రోజులు నిద్రపోతా, కాలువల వద్ద రెండు రోజులు నిద్రపోతా, హైవేల దగ్గర నిద్ర పోతా అంటూంటారు. ఈ ఆఫీసుల వద్ద అన్యాయం జరక్కుండా కాపు కాస్తూ యిక్కడ నిద్ర పోవచ్చుగా! సెక్షన్‌ 8 విషయంలో ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. 'మీ అధికారాలు గవర్నరుకు అప్పగిస్తూ ఫలానా పాయింట్లతో మీరు తీర్మానం చేయండి' అని కేంద్రం ఏడాది క్రితం లేఖ రాసింది. మేం చెయ్యం ఫో అంది తెలంగాణ ప్రభుత్వం. ఇంకో రిమైండర్‌ రాసి వూరుకుంది కేంద్రం. 'తల తీసి యింకోడి చేతిలో పెట్టే అసలు అలాటి తీర్మానం ఏ రాష్ట్రమైనా చేస్తుందా? రాజకీయంగా వాళ్లు బతకాలా అక్కరలేదా? వాళ్లు ఎన్నటికీ చేయరు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించండి. పార్లమెంటులోనే ఏదో సవరణ చేయడమో, ఆర్డినెన్సు యివ్వడమో, మరోటో చేయండి' అని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రం వద్ద లాబీయింగ్‌ చేయాలా వద్దా? జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు కూర్చోవాలా వద్దా? 'పోలవరం ఆర్డినెన్సు జారీ చేయకపోతే ప్రమాణస్వీకారమే చేయనన్నాను' అని బాబు గొప్పగా చెప్పుకున్నారు. ప్రత్యేక హోదా గురించి కూడా ఓ ముక్క అంటే పోయేది కదా. అవన్నీ చట్టంలో లేనివి, చట్టంలో వున్న సెక్షన్‌ 8 అమలు చేయించడం వాటితో పోలిస్తే సులభమైనదే కదా, అదెందుకు చేయించలేకపోయారు? 

సెక్షన్‌ 8 సరిగ్గా అమలు కాకపోతే నష్టపోతే హైదరాబాదులో వున్న ఆంధ్రులు మాత్రమే. తెలంగాణలోని యితర ప్రాంతాల్లో ఆంధ్రులకూ ఎఫెక్టవరు. కానీ టెన్త్‌ షెడ్యూల్‌లోని సంస్థలలో భాగం దక్కపోతే ఆంధ్ర రాష్ట్రంలో వున్న ఆంధ్రులు విపరీతంగా నష్టపోతారు. ఆ నష్టం నివారించడానికి వాళ్ల ముఖ్యమంత్రిగా బాబు ఏం చేశారన్నది అతి ముఖ్యమైన ప్రశ్న. పంపకాలు కాగానే ఎవరైనా చేసేది తమ వాటాకు ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని రక్షించుకోవడం. ఇన్నాళ్లూ హైదరాబాదు రాజధాని కాబట్టి, సంస్థల ట్రైనింగ్‌ యిన్‌స్టిట్యూట్స్‌ దగ్గర్నుంచి యిక్కడే వున్నాయి. ఏడాది లోపుగా పంపకాలు పూర్తి చేసుకోవాలి, ఏడాది తర్వాత ఎక్కడ వుంటే వాళ్లవే అన్నపుడు పంపకాలు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే యిది ఉద్యోగాలు, ప్రమోషన్లు, స్కిల్స్‌ పెంచుకోవడం అనేటి అనేక అంశాలకు సంబంధించిన విషయం. ఇప్పుడేమైంది, తెలంగాణలోని 104 ఉమ్మడి సంస్థలు మావే అనేసింది తెలంగాణ సర్కారు. మీ తిరుపతిలోని యూనివర్శిటీలో మేం హక్కు కోరటం లేదు, మా హైదరాబాదులో వున్న యూనివర్శిటీల్లో మీరు ఏమీ అడగకండి అంటున్నారు గడుసుగా. ఆంధ్రలో వున్న సంస్థలకు పదిరెట్లు హైదరాబాదులో వున్నాయి – రాజధాని కాబట్టి. విభజన చట్టంలో ఆంధ్రకు అన్యాయం జరిగిందని బాబు పదేపదే చెప్పారు. అలాటి అన్యాయాల్లో యీ ఏడాది గడువు కూడా ఒకటన్నమాట. సెక్షన్‌ 8 చట్టంలో భాగం కాబట్టి అమలు చేయాలి అని వీరన్నట్టే, అదే చట్టంలో భాగం కాబట్టి ఉమ్మడి సంస్థల ఆధిపత్యం ఏడాది తర్వాత మాదే అని వీరంటున్నారు. అనేక లోటుపాట్ల చట్టం పార్లమెంటులో పాస్‌ కావడానికి సహకరించిన బిజెపి, టిడిపి (తెలంగాణ విభాగం – దానికి అధ్యకక్షుడు కూడా బాబే) ఆంధ్రకు జరిగిన, జరుగుతున్న నష్టాలను నివారించడానికి చూడాలా వద్దా? 

టెన్త్‌ షెడ్యూల్‌పై దృష్టి పెట్టకుండా బాబు ఎంతసేపూ రాజధాని గురించి పట్టుకున్నారు. అంతకుముందు ఋణమాఫీ. అలవికాని వాగ్దానం చేయడం, కెసియార్‌ లక్ష పరిమితి పెడితే తను లక్షన్నర పెట్టడం, మళ్లీ దాన్ని ఎలా కుదించాలా అన్న కసరత్తు చేయడం – దీనికే నెలలు పట్టింది. ఆ తర్వాత రాజధాని అంతర్జాతీయ స్థాయి నగరం అంటూ వూదరగొట్టడం, సింగపూరు, జపాన్‌ మోడళ్లు, మంత్రులను సింగపూరు పంపడం, ఏదో జరిగిపోతోందన్న భ్రమల్లో ప్రజలను ముంచడం. భూసమీకరణ పేర రైతులతో పేచీ. అన్నిటికన్నా ముందుగా రాబట్టుకోవలసిన ఆస్తిపాస్తులను పట్టించుకోలేదు. ఈ రోజు ఆంధ్ర విద్యార్థులకు, ఉద్యోగులకు అపారంగా నష్టం వాటిల్లింది. విద్యుత్‌ శాఖలో ఆంధ్ర మూలాలున్న ఉద్యోగాల గతి చూడండి. తెలంగాణ ఉన్నతాధికారులు వాళ్లని పంపేశారు. ఆంధ్రలో చేర్చుకోవటం లేదు. వీళ్లని తీసుకుంటే తక్కిన రంగాల్లోనూ యిదే జరుగుతుందని వారి భయం. అక్కడి నిరుద్యోగులకే ఉద్యోగాలు చూపిస్తారా? లేక వీళ్ల కోసం అదనపు ఉద్యోగాలు సృష్టిస్తారా? లేక పని లేకపోయినా ఉత్తినే జీతాలు యిస్తారా? వీళ్లను పంపేసి తెలంగాణలో ఉద్యోగాలు సృష్టిద్దామని తెరాస ప్రభుత్వం చూస్తోంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోయే ఉద్యోగులకు నెలజీతం లేకపోతే ఎలా గడుస్తుంది? వాళ్లకు కడుపుమండి రోడ్డెక్కి నాలుగు వాహనాలకు నిప్పుపెడితే అది శాంతిభద్రతల సమస్యగా మారదా? అప్పుడు సెక్షన్‌ 8 అమలు సబబే అని తెలంగాణ నాయకులు ఒప్పుకుంటారా? ఇన్నాళ్లూ చిన్న సంఘటనైనా జరగలేదు, ఎందుకు సెక్షన్‌ 8? అని అడిగేవాళ్లు యిలాటి విషయాలపై జవాబు చెప్పాలి. ఇలా రెచ్చగొడితే బాధితులు తిరగబడతారు. వీరి బాధలు ఆర్చేవారు, తీర్చేవారు ఎవరూ లేకుండా పోయారు. ఇప్పుడు ఓటు-నోటు విషయంలో బాబు, కెసియార్‌ రాజీ పడితే వీళ్ల గతేమిటో ఊహించడానికే భయంగా వుంది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2