ఇరవయ్యవ తానా మహా సభలు డెట్రాయిట్ లో అంగరంగ వైభవం గా నిర్వహిస్తున్నారు కదా..కార్యదర్శిగా, అన్ని కార్యక్రమాలను సమన్వయపరచుకొనే ప్రధాన బాధ్యతలో మీ అనుభవాలను చెబుతారా?
ముఖ్యంగా డెట్రాయిట్ లో అంకితభావనతోను, క్రమశిక్షణతోనూ పనిచేసే స్వచ్చందకార్యకర్తలకు, ప్రతిభాపాటవాలకు మరియు దాతృత్వానికి కొరతలేని విషయం జగద్వితం. అందునా తానా సంస్థ పై ఆదరాభిమానాలను కలిగివున్నవారు ఎందరెందరో, నేను ఇప్పటికే అనేక సంవత్సరాలుగా తానా సంస్థ లో తానా ఫౌండేషన్ సహాయ కార్యదర్శి, కోశాధికారి, ప్రస్తుతం కార్యదర్శి గానే కాకుండా తానా బోర్డు సభ్యులు గా ఉండడం తో ఎక్కువమందితో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్నాను. అలాగే ఈ తానా మహాసభలకు సహ సమర్పకులైన స్థానిక డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ నాయకత్వం మరియు సభ్యులు తో గత కొద్ది సంవత్సరాలుగా అనేక సమస్యలు మరియు కార్యక్రమాలకు చేదోడు వాదోడు గా ఉండటం కూడా నాకు చాల సహకరించింది. అంతే కాకుండా కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ గారు, ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ గారు, డైరెక్టర్ మరియు గత ప్రెసిడెంట్ కోమటి జయరాం గారు, గత ప్రెసిడెంట్ మరియు సలహా కమిటీ చైర్మన్ బండ్ల హనుమయ్య గార్లతో వ్యక్తిగతంగాను వ్యవహార పరంగానూ సన్నిహిత సాంగత్యం మంచి సుఖమైన వాతావరణం కలిగించింది. పై చెప్పిన అనేక కారణాలు ఈ తానా మహాసభలకు సంబందించిన ముఖ్యమైన కమిటీల నాయకులను ఎంపిక చేయటం లో వారికి వివిధ భాద్యతల బదలాయింపు లో చాల ఉపయోగపడింది, ఇంకా చెప్పాలంటే ఆ నియామకాల కారణంగానే ఈ రోజున సమావేశాల గురించినంతవరకు ఏంతో ధైర్యంగా, స్థైర్యంగా మరియు నమ్మకంగా ఉన్నాము. ఇప్పటివరకు ఒక్కసారికూడా ఎటువంటి చిన్న సమస్య లేకుండా ఏర్పాట్లు జరుగుతూ ఉండటం అందరూ గమనిస్తున్నారు కదా
ఈ సారి జరగబోతున్న తానా సభలు ఎందు వల్ల ప్రత్యేకత సంతరించుకొన్నాయి?
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడివడి అభివృద్ధి పధంలో దూసుకు పోతున్న తరుణం లో జరుగనున్న మొట్టమొదటి సమావేశాలుగా గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈ తానా సమావేశాల మూల ధ్యేయం “సేవ: సంస్కృతికి జీవం, సమైక్యతకు బలం “ ను రెండు రాష్ట్రాల నాయకత్వానికి, ప్రజలకు తానా సంస్థ ఇచ్చే సందేశం గాను మరియు తానా సంస్థ యొక్క భవిష్యత్ కార్యాచరణకు ప్రామాణికంగాను భావించవచ్చును. మామూలుగానే అంతర్జాతీయం గుర్తింపు పొందిన తానా ద్వైవార్షిక మహాసభలకు ఈ పరిస్తుతుల్లో సమావేశాల్లో జరగబోయే కార్యక్రమాలపై తెలుగుప్రజలందరిలో ఎంతో ఆసక్తి, ఉత్సుకత కలుగడం లో ఆశ్చర్యం లేదు. వాటితో పాటు గొప్ప నాయకత్వం మరియు వాలంటీర్స్ ఉన్న డెట్రాయిట్ లో సమావేశాలు జరగనుండటం కూడా ఈ సమావేశాలకు ప్రత్యేకత తెచ్చాయని భావిస్తున్నాను.
ఈ కార్యక్రమ సన్నాహాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? వివిధ కమిటీల గురించి కొంచం చెప్పండి!
ఈ కార్యక్రమ సన్నాహాలు ఎంతో ముందుగా అంటే గత 2014 సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. తదుపరి అంచెలంచలుగా సుమారు 45 కమిటీలు 500 మంది కార్యకర్తలతో టీం బిల్డింగ్ జరిగింది. వారివారి నిపుణత మరియు ఆసక్తి లను అనుసరించి ఈ కమిటీల నాయకులను, ఉపనాయకులను నియమించటం జరిగింది. వీటిలో అతిముఖ్యమైన ప్రోగ్రాం/ఈవెంట్స్, ఆహార, రిజిస్ట్రేషన్, కల్చరల్, ధీంతానా, ఎక్షిబిట్స్, లిటరరీ, ఆధ్యాత్మిక, వ్యవసాయ, బిజినెస్, హాస్పిటాలిటి, వెన్యు, అలంకరణ, బాంకేట్ మరియు పొలిటికల్ కమిటీ లను ప్రత్యేకం గా చెప్పుకోవచ్చును. మొదటి సారిగా మొబైల్ ఆప్ ను కూడా IT కమిటీ ద్వారాను, మొట్ట మొదటిసారిగా రైతు సమస్యలపై వ్యవసాయ కమిటీ ను, విస్తృత స్థాయి లో ఇన్ఫర్మేషన్ హెల్ప్ కమిటీ ను ఈ సమావేశాల్లో ప్రమిఖంగా గమనించవచ్చును. అయితే సంక్లిష్ట మైన ఈ కమిటీల నిర్వహణ అన్నింటికీ కావలసిన నిపుణత కలిగిన స్వచ్చంద వాలంటీర్స్ డెట్రాయిట్ లోనే ఉండటం మా అదృష్టం
ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు వారి ప్రధాన వృత్తి వ్య్వసాయం. ఈ సారి వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం చెయ్యబోతున్నారని విన్నాం. అసలు ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అలాగే ఈ కార్యక్రమం వల్ల ఒనగూడే లాభాల గురించి కొంచం చెప్పండి.?
ముఖ్యం గా పూర్వ అధ్యక్షులైన బండ్ల హనుమయ్య గారి ఆశయం మరియు కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ గారి ప్రోత్సాహం ఈ మహత్తర కార్యక్రమం రూపు దాలచటానికి ముఖ్య కారణం. ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలతో సతమతము అవుతున్న రైతు సోదరులకు ఉపయోగకరమైన చర్చలు ముఖ్యంగా విత్తనాలు, భూసార పరీక్షలు, యంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు మరియు ఆదునిక వ్యవసాయం వగైరాల పై అర్ధవంతమైన మరియు ఫలవంతమైన సూచనలు, సలహాలు వస్తాయని ఆశిస్తున్నాము. అంతేకాక రైతు సోదరులకు ప్రవాసభారతీయుల నించి కొన్ని విషయాలలో శాశ్వత మరియు తాత్కాలిక ఉపశమనానికి సంబందిచిన సహాయానికై విధానపర నిర్ణయాలకు కూడా అవకాశం ఉంది.
తానా అమెరికా లో ఒక జాతీయ సంస్థ. అంటే వివిధ రాష్ట్రాల్లోని వివిధ కమిటీలతోనూ, వ్యక్తులతోనూ నిరంతరం సంభాషణలు, సంప్రదింపులూ జరుపుతూ ఉండాలి. మీరు దీన్ని ఎలా నిర్వహించారో కొంచం చెప్పండి.?
తానా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతంగా నిర్వహించబడుతున్న ఏకైక తెలుగు సంస్థ గా గత 40 సంవత్సరాలుగా ప్రసిద్ధిచెందింది. ఇప్పటికే ఇది అన్నిరాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కలిగివుండి తెలుగువారి ప్రతిసమస్యకు, అభివ్రిద్ధికి ఒక పర్యాపదం గా వున్నా విషయమే వివిధ రాష్ట్రాల్లోని వివిధ కమిటీలతోనూ, వ్యక్తులతోనూ నిరంతరం సంభాషణలు, సంప్రదింపులూ జరుపుతూ ఉన్నమనటానికి నిదర్శనం
ఈ తానా మహా సభల కార్యదర్శి పదవి తో పాటు గత రెండు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్స్తాత్మకమైన తానా ఫౌండేషన్ కార్యదర్శిగా కూడా పదవి నిర్వహిస్తున్నారు, మరి ఈ రెండు భాద్యతాయుతమైన పదవులను ఒకేసారి నిర్వహించవలసిన అవసరం మరియు అందలి అనుభవాలను చెప్పగలరా?
తానా ఫౌండేషన్ పదవులు ద్వారా తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలుగురాస్ష్ట్రాల్లోని ప్రజలకు సేవచేయటం నాకు అత్యంత ఇష్టమైన మరియు సంత్రుప్తకరమైన విషయం. ఆయితే ఈసారి ప్రతిష్టాత్మకమైన తానా ద్వైవార్షిక మహా సభలు అనుకోకుండా డెట్రాయిట్లో నిర్వహించవలసిన అవుసరం రావడం , డెట్రాయిట్ లోని ప్రత్యెక స్థానిక పరిస్థుతులు కారణం గా తానా ముఖ్య నాయకత్వం ఈ కార్యదర్శి పదవికి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు నేను కోఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్ గారికి, అధ్యక్షులు నన్నపనేని మోహన్ గారికి మరియు తానా డైరెక్టర్ కోమటి జయరాం గారికి ప్రత్యెక కృతఙ్ఞతలు తెలపవలసిన అవుసరం ఉంది. ఇంకా నిబద్దతతో పనిచేసేవారికి తానా సంస్థలో తగిన గుర్తింపు , పదవులు అందుబాటులోనే ఉంటాయనేదానికి నిదర్శనగా భావించ వచ్చును. ఈ పదవీ నిర్వహణలో అనేకమంది నిపుణులతోను, పెద్దలతోను, సన్నిహితులు మరియు మిత్రులతో పాటు భాద్యతలు నిరవహించటమేగాగాక చాలావిషయాలను నేర్చుకున్నాను
తానా తో పాటు ఇంకా అనేక ఇతర తెలుగు జాతీయ సంస్థలుఉన్నాయి మరియు అవి కూడా ఇంచుమించు ఇవే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ సందర్భం లో తానా ప్రత్యేకత ను , ఈ సమావేసాలకే ప్రమిఖ్యత ఇవ్వాలనే మీ ఆలోచనకు ప్రాతపదిక ఏమిటి?
భారతదేశం ఆవల ఉన్న వాటిలోని అతిపెద్దదై మహోన్నత చరిత్ర కలిగిన తానా సంస్థ గత 40 సంవత్సరాలుగా తెలుగు భాషకు, సంస్కృతికి మరియు తెలుగు ప్రజల సంక్షేమానికి చేస్తున్న ఆవిరళ కృషి నభూతో, నభవిష్యత్ అన్నది అక్షర సత్యం. ఈ కార్యక్రమలో లబ్దిదారులను ఎటువంటి వివక్ష (ప్రాంతం, కులం లేదా మతం ) లేకుండా టీం స్క్వేర్ ద్వారా గాని, తానా ఫౌండేషన్ ద్వారా గాని గుర్తించి సహాయపడంలోను , అనేక ఇతర సాంస్కృతిక, సేవాకార్యక్రమాలలోనూ ముందున్న విషయం జగద్వితం.
ఈ సారి జరగబోతున్న తానా సభలకు ఎంత మంది హాజరవబోతున్నారని మీ అంచనా?
పదివేలమందికి తక్కువగాకుండా హజారవుతారని మేమందరం భావిస్తున్నాము. ఇప్పటికే రికార్డు స్థాయిలో దాతల విరాళాలు, 7 వేలమందికి పైగా ముందే చేసుకున్న రిజిస్ట్రేషన్లు ఈ నెంబర్ ఇంకా బాగా పెరిగినా పెద్దగా ఆశ్చర్యం లేదు. కాన్ఫరెన్స్ కమిటీ అందరికీ ఏర్పాట్లు కై సంసిద్దంగా ఉంది
తానా సభలకు ఎందుకు హాజరవ్వాలి అనే విషయం ఒక్క మాటలో చెప్పగలరా ?
పై చెప్పిన అనేక విషయాలతో పాటు ఈ సభల సందర్భంగా మీ కుటుంబసభ్యులు అందరితో కలసి వేసవి విడిదిగా ఇతర బంధుమిత్రుల కలయికతోనూ, మహత్తరమైన ప్రపంచస్థాయి వినోద, వైజ్ఞానిక, సంస్క్ర్తుతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య కార్యక్రమాలతోనూ, తెలుగు రుచుల విందులతోనూ పండుగ వాతావరణంతో చిరస్మరణీయంగా ఉండేవిధంగా కృషి చేస్తున్నాము కనుక తానా సభలకు తప్పక హజారవ్వాలని చెప్పగలను. అంతేకాక అవకాశం ఉండీ హజారుకలేకపోయిన వారు గొప్ప అవకాశం పోగొట్టుకున్నందుకు విచార పడతారనికూడా భావిస్తున్నాను.