బాహుబలి పార్ట్ 3 ఉంటుందా ఉండదా అనే చర్చ ఇంకా జరుగుతూనే ఉన్నది. బాహుబలి 2 సంగతి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే బాహుబలి 3వ పార్ట్ సినిమా కూడా ఉంటుందని మీడియా మొత్తం హోరెత్తిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ విషయాన్ని తొలుత గ్రేటాంధ్ర డాట్ కాం పాఠకులకు అందించింది. ఆ వెంటనే మీడియా మొత్తం హోరెత్తిపోయింది. చివరికి బాహుబలికి సంబంధించిన వ్యవహారం మొత్తం తొలినుంచి ఎంతో గోప్యంగా నడిపిస్తూ ఉన్న దర్శకుడు రాజమౌళి స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఆయన సైతం కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా.. బాహుబలి పార్ట్ 3 సినిమా ఉంటుందా లేదా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే.. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. బాహుబలి పార్ట్3 తథ్యంగా ఉంటుందిట. కాకపోతే.. అందులో బాహుబలి సినిమాకు సంబంధించిన పాత్రలు మాత్రం కంటిన్యూ అవుతాయి. ఈనటులు అనగా ప్రభాస్, రానా తదితరులు అందులో ఉండరు. పూర్తిగా కొత్త తరం క్యాస్టింగ్ తో ఆ కథ సాగుతుందిట!
బాహుబలి పార్ట్ 3 అనేది తీవ్రమైన చర్చగా సినిమా పరిశ్రమలో ఒక రకంగా గగ్గోలు పుట్టించింది. తొలుత బాహుబలిచిత్రమే ఒక సంచలనం అయితే.. దాన్ని రెండు భాగాలుగా చేస్తున్నా అంటూ రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటెజీని ప్రదర్శించారు. ఒక భాగం మాత్రం విడుదల చేసి.. రెండో భాగం కోసం జనం ఎదురుచూడడం తప్ప గత్యంతరం లేని స్థితిని ఆయన సృష్టించారు. ఈలోగా బాహుబలి 3 వ భాగం కూడా మరో సినిమాగా తయారయ్యే ఆలోచన ఆయనలో ఉన్నట్లుగా గ్రేటాంధ్ర బ్రేక్ చేసింది. ఆ అంశం పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
విధిగా ఈ విషయంలో వివరణ ఇచ్చిన రాజమౌళి… చాలా నర్మగర్భంగా దీనికి సంబంధించిన వివరాల్ని సెలవిచ్చారు. 'బాహుబలి- ది బిగినింగ్‌తో మొదలైన కథను, బాహుబలి- ది కంక్లూజన్' తో ముగిస్తా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. మూడో భాగం విషయంలో పుకార్లు వస్తున్నాయని. కానీ కథను సాగదీయకుండ.. రెండో భాగంతో ముగిస్తానని చెప్పారు. అంతే తప్ప మూడో భాగం ఉండదు అని మాత్రం అనలేదు. రాజమౌళి సన్నిహితులనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. మూడో భాగం తప్పకుండా ఉంటుంది. కాకపోతే.. ప్రభాస్, రానా వంటి క్యారెక్టర్లు ఉండవు. పూర్తిగా కొత్త క్యారెక్టర్లతో కథ ఉంటుంది. ప్రభాస్‌కు మాత్రం రెండో పార్ట్ పూర్తి కావడంతో విముక్తి దొరుకుతుందన్నమాట. 'బాహుబలి ప్రయాణం మాత్రం కొనసాగుతుంది.. అది మీరు ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో ఉంటుంది' అని రాజమౌళి స్వయంగా చెప్పడం చూస్తే.. అదే అర్థమవుతోంది. 'త్వరలోనే వివరాలు వెల్లడిస్తా ' అని ఆయన అంటున్నారు.
మొత్తానికి బాహబలి అనే పేరు చుట్టూ క్రియేట్ అయిన క్రేజ్‌ను మార్కెట్ వేల్యూను అంత ఈజీగా వదులుకోవడం రాజమౌళికి ఇష్టం లేదని అర్థమవుతోంది. ఆ మార్కెట్ వేల్యూ నుంచి మాగ్జిమం ఎంత పిండుకోవడం వీలైతే అంతవరకు పిండేయడానికే ఆయన ప్రిపేర్ అవుతున్నారన్నమాట.