దసరా వేడుకలకు హాజరయిన తులసీ గబ్బార్డ్

హవాయి రాష్ట్రంలోని రెండవ డిస్ట్రిక్ట్ నుండి డెమొక్రాటిక్ పార్టీ తరుపున ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య రాజకీయవేత్త తులసీ గబ్బార్డ్ డాలస్ నగరంలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డాక్టర్. తోటకూర ప్రసాద్…

హవాయి రాష్ట్రంలోని రెండవ డిస్ట్రిక్ట్ నుండి డెమొక్రాటిక్ పార్టీ తరుపున ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య రాజకీయవేత్త తులసీ గబ్బార్డ్ డాలస్ నగరంలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డాక్టర్. తోటకూర ప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకలకు ఆత్మీయ అతిధిగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ తాను తొలిసారిగా US Congressకు పోటీ చేసినప్పుడు డాక్టర్. తోటకూర తనను మొట్టమొదటి సారి డల్లాస్ ఆహ్వానించి, టెక్సాస్‌లోని ప్రవాస భారతీయులకు పరిచయం చేసి, తన ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం విరాళాలు సేకరించి తనను బలపరచడం ఎన్నటికి మరచిపోలేనని అన్నారు.  ప్రవాస భారతీయ సమస్యల పరిష్కారం లోను, ముఖ్యంగా ఇటీవల అమెరికా దేశం లోనే అతిపెద్ద మహత్మాగాంధీ విగ్రహాన్ని డల్లాస్ లో ఏర్పాటు చేయడం లో ప్రసాద్ చూపిన చొరవ, నాయకత్వం ఎంతో కొనియాడతగినదని అన్నారు.    
 
ఆలోచనల్లో స్వచ్ఛత, సరళత, అన్ని వేళలా అందుబాటులో ఉండటం తులసీలో తనకు నచ్చిన లక్షణాలని ప్రసాద్ వెల్లడించారు. చాలా మంది ప్రవాస భారతీయులు అమెరికా రాజకీయాల్లో రాణించేందుకు వీలుగా మత మార్పిడులకు పాల్పడతారని, కానీ వారందరికీ విభిన్నంగా తులసీ మాత్రం తన మతాన్ని విశ్వసించి, అదే నినాదంతో బరిలో నిలిచి, అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి హిందు మహిళా రాజకీయవేత్తగా చరిత్ర సృష్టించి, నమ్మినదానికి కట్టుబడి ఉండే హిందూ మనోభావాలను ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. ఆమె భవిష్యత్తులో అమెరికా ఉపాధ్యక్షురాలి పదవికి బరిలో ఉన్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయని, అదే గనుక వాస్తవం అయితే ఆవిడకు తమ సహకారం మరింత రెట్టింపు చేసి ఆమెను అధ్యక్ష పీఠం వరకు నడిపించేందుకు కృషి చేస్తామని ప్రసాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
 
ప్రముఖ గాయకుడు గంగాధర శాస్త్రి భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను గానం చేసి, తెలుగులో వివరించి, అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానంతో రికార్డు చేసిన దానిని ఇప్పుడు ఆంగ్ల భాష లో అనువదించే ప్రయత్నం లో ఉన్నారని, దాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా చేతుల మీదు గా ప్రపంచానికి అందించేందుకు ప్రసాద్ తోటకూర తులసి సహకారాన్ని కోరగా,  ఈ పవిత్ర కార్యక్రమంలో తప్పని సరి గా తన సహాయం ఉంటుందని సానుకూలం గా స్పందించారు.  
 
సాంప్రదాయబద్ధంగా హిందూ ఆచారం ప్రకారం నుదుట కుంకుమ ధరించి, ఈ వేడుకలకు హాజరైన తులసీ తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ హవాయి రాష్ట్రాన్ని, అమెరికా దేశాన్ని, హిందుత్వాన్ని తాను ఎక్కడికెళ్లినా ప్రతిబింబిస్తానని, భగవద్గీత తన స్పూర్తి అని, కర్మయోగ తన నమ్మకం అని తెలిపారు. తాను భగవత్గీత ఫై ప్రమాణం చేసి యు. ఎస్. కాంగ్రెస్ మెంబర్ గా పదవీ స్వీకారం చేయడం ఎంతో అనందాన్ని ఇచ్చిందని తెల్పారు. భారత ప్రధాని మోడీ ఉన్నత లక్ష్యాలు కలిగిన నాయకుడని, ఆయన్ను భారత్‌లోను, న్యూ యార్క్, కాలి ఫోర్నియాలో ను ఇప్పటికి మూడు సార్లు ప్రత్యక్షంగా కలుకుని మాట్లాడటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రవాస భారతీయుల ఉనికికి అమెరికా దేశం లో ఎలాంటి ప్రమాదం లేదని, వారి ప్రతిభే వారికి శ్రీరామరక్ష అని ఓ ప్రశ్నకు బదులుగా ఆమె సమాధానమిచ్చారు.
 
ఈ సందర్భంగా తులసీ పలువురుతో ముఖాముఖి మాట్లాడిన అనంతరం తన మనోభావాలను అతిధులతో పంచుకున్నారు. 21ఏళ్ల పిన్నవయస్సులో హవాయి రాష్ట్ర కాంగ్రెస్ కు ఎన్నికయి చరిత్ర సృష్టించిన తనకు తాను పర్యావరణ సంరక్షణపై ఏర్పాటు చేసిన ఓ సామాజిక సేవా సంస్ధే తనను రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రోత్సహించిందని పేర్కొన్నారు. అమెరికా సైనిక దళాలు, విదేశీ వ్యవహారాల కమిటీల్లో సభ్యత్వంతో పాటు డెమొక్రాటిక్ పార్టీ కేంద్ర కమిటీకి ఉపాధ్యక్షురాలిగా తులసీ వ్యవహరిస్తున్నారు. సైన్యంలో సేవలందించిన తనకు యుద్ధాలు, వాటి ఖర్చులు, ఆ సమయంలో ఏర్పడే హింస, దారుణాలు, మరణాలు వంటివి తనకు సుపరిచితమని వీటిని నిరోధించేందుకు, అమెరికా దేశానికి స్నేహహస్తాలను అందించేవారి సంఖ్యను పెంపొందించేందుకు తాను కృషి చేస్తున్నట్లు వివరించారు. మధ్య ప్రాచ్య దేశాల్లో మత కల్లోలాలు, ఇరాక్, ఇరాన్ వంటి దేశాల్లో నియంతృత్వ పోకడలు అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్ధ బలహీనంగా ఉండటం వలనే ఏర్పడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రజాస్వామ్య పరిరక్షణను తన మొదటి లక్ష్యంగా భావిస్తానని తులసీ వెల్లడించారు.
 
అనంతరం తులసీని డాక్టర్ తోటకూర ప్రసాద్ కుటుంబ సభ్యులు, వేడుకలకు హాజరయిన ప్రవాస భారతీయులు ఆత్మీయంగా సన్మానించారు. వేడుకలు ముగిశాక మహాత్మా గాంధీ స్మారకస్ధలి వద్దకు చేరుకుని తులసీ గాంధీజికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయ ప్రముఖులు రావు కల్వల, మురళీ వెన్నం, చలపతి కొండృకుంట, వెంకట్ పొత్తూరు, రమేష్,  కల్పనా భాటియా, అరుణ్ అగర్వాల్, పంకజ్, రిటూ ఖండూరి, ఉమా యలమంచి, తారాకుమార్ రెడ్డి, రామసుర్యారెడ్డి, సత్ గుప్త, సి.ర్. రావు, రమేష్ గాదిరాజు, గ్రేస్, సురేష్ వులువల, సాయి సతీష్, ప్రశాంతి, స్వరూప, అమృత్, బాలు తదితరులు పాల్గొన్నారు