ఆ హీరోలు మెరిస్తే… సినిమాకు కొత్త కళ!

చాలా సంవత్సరాల క్రితం దర్శక రచయిత జేకే భారవి ఒక వైవిధ్యభరితమైన స్క్రిప్ట్‌తో కొందరు ప్రముఖ హీరోల తలుపులను కొట్టాడు. విశ్వనాయకుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వంటి వాళ్ల ఇళ్లున్నాయి…

చాలా సంవత్సరాల క్రితం దర్శక రచయిత జేకే భారవి ఒక వైవిధ్యభరితమైన స్క్రిప్ట్‌తో కొందరు ప్రముఖ హీరోల తలుపులను కొట్టాడు. విశ్వనాయకుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వంటి వాళ్ల ఇళ్లున్నాయి వాటిలో. అప్పటికి ఇప్పుడున్నంత మాత్రపు పేరు ప్రఖ్యాతులు కూడా లేని భారవి కథను విని అప్పటికే స్టార్ హీరోలయిన కమల్, మమ్ముట్టిలు వేరు వేరుగా తలలూపేశారట. మొదట మమ్ముట్టీకి ఆ కథ వినిపిస్తే సూపరన్నడట. చేద్దాం.. బడ్జెట్ ఎంతనుకొంటున్నారు? అనే ప్రశ్న వేశాడట. భారవి తనకున్న పరిమితుల మేరకు ఒక నంబర్ చెబితే మమ్ముట్టి ఒక వెర్రి నవ్వు నవ్వి భారవిని ఇంటికెళ్లమన్నాడట. 

ఇక అదే కథను కమల్‌కు చెప్పి మెప్పించి బడ్జెట్ చెబితే..’’ఆ డబ్బు నా ఫ్టైట్ చార్జీలకు కూడా చాలదే..’’ అన్నాడట కమల్. మరి ఒక కథను ఎంత మొత్తంలో తెరెకక్కించే విషయమై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండి.. తన పరిమితుల్లో తీస్తానంటే.. అది అతడి తప్పా? మమ్ముట్టీ, కమల్ లాంటి వాళ్లకు అలాంటి అభ్యంతరాలు ఉంటాయా? అనేవి ఎవరికైనా తలెత్తే ధర్మ సందేహాలు. వాటి సంగతలా ఉంటే.. ఇద్దరు జాతీయ ఉత్తమ నటులకు  నచ్చిన ఆ కథ బడ్జెట్ తక్కువ స్థాయిలో ఉందనే కారణం చేత అటెకక్కింది. 

ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న ఏ విశ్వనాథ్ లాంటి దర్శకుడో అలాంటి కథను చెప్పి ఉంటే కమల్ అయినా మమ్ముట్టీ అయినా ఎగిరి గంతేసి ఆ సినిమాకు ఓకే చెప్పే వారని అనడానికి కూడా ఇక్కడ సందేహించనక్కర్లేదు. ఏదేమైనా.. పరాయి భాషల టాప్ హీరోలను తెలుగు సినిమాల్లో నటింపజేయడం అంటే అదంతా సులభసాధ్యమైన వ్యవహారం ఏమీ కాదు. మోహన్ లాల్- గౌతమిలను ప్రధాన పాత్రల్లో నటింపజేస్తూ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక తెలుగు సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. అత్యంత ఆసక్తికరమైనది ఈ కాంబినేషన్. వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించిన యేలేటి చంద్రశేఖర్‌కు లాల్ కుట్టి లాంటి నటుడు దొరకడమంటే.. చేయి తిరిగిన చిత్రకారుడికి చక్కటి కాన్వాస్ లభించినట్టే. 

ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి సినిమా రూపొందితే.. మోహన్ లాల్  మెరిసిన రెండో తెలుగు సినిమా అదవుతుంది. ఇంతకు ముందు లాల్ ‘‘గాంఢీవం’’ సినిమాలోని ఒక పాటలో మెరిశాడు. దానికొక ప్రత్యేక రీజన్ ఉంది. ఆ సినిమాకు దర్శకుడు ప్రియదర్శన్. అతడు లాల్‌కు అత్యంత ఆప్తుడు. ఆ స్నేహంతోనే ప్రియన్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలో లాల్ మెరిశాడు. మధ్యలో అనేకసార్లు ఈ మలయాళ స్టార్ తెలుగు సినిమాల్లో నటించనున్నాడనే వార్తలు వచ్చాయి కానీ.. ఆ సినిమాలేవీ విజయవంతంగా పట్టాలెక్కలేదు. 

ఇక మోహన్ లాల్ సమానిక మలయాళీ మమ్ముట్టి కూడా ఒకే ఒక తెలుగు స్ర్టైట్ సినిమాలో నటించాడు. అదే ‘‘స్వాతి కిరణం’’ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సంగీత ప్రధానమైన ఆ సినిమాలో సంగీత సమ్రాట్‌గా మమ్మూకా జీవించేశాడు. ఆ పాత్రకు ప్రాణం పోశాడు. తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత పైన చెప్పినట్టుగా బారవి లాంటి వాళ్లు ప్రయత్నాలు చేసినా.. మమ్ముట్టీ చేత తెలుగు సినిమాను చేయించలేకపోయారు. అయితే మమ్ముట్టీలోని గొప్పదనం ఆయన డెడికేషన్. స్వాతి కిరణం సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని ఆయన తన ప్రత్యేకతను చాటాడు. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ మమ్ముట్టీ వాయిస్ తెలుగులో వినిపించలేదు. ఇక భవిష్యత్తుల్లో కూడా అది సాధ్యం కాకపోవచ్చు. 

మరో మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి మాత్రం కొన్నిసార్లు స్ర్టైట్ తెలుగు సినిమాల్లో నటించాడు. ‘‘అసిస్టెంట్  కమిషనర్’’ వంటి సినిమాతో తెలుగు వాళ్లలో మంచి గుర్తింపును సంపాదిచుకున్న సురేష్ గోపి ‘‘అంతిమ తీర్పు’’ అనే సినిమాలో నటించాడు. కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాలో సురేష్ గోపిది కొంత ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఆ తర్వాత ఈ మధ్యనే ఒకటీ అర సినిమాల్లో ఆయన కనిపించాడు. అయితే ఈ సినిమాలు అంతగా చెప్పుకోదగినవి కాలేకపోయాయి. మరి అడపాడదడపా మాత్రమే డబ్బింగ్ సినిమాలతో పలకరించే హీరోలు వీళ్లు. ఇలాంటి హీరోలు అడపదడపా తెలుగు సినిమాలు చేస్తేనే ముచ్చట. ఆ డోస్ మించితే అంత బాగుండదు కూడా. కానీ దశాబ్దాలుకు దశాబ్దాలు గడిచినా.. వీళ్లు తెలుగువైపు అంతగా రాలేదు. జాతీయ అవార్డులతో గుర్తింపు ఉన్న వీళ్లు తెలుగులో నటిస్తే మాత్రం ఆ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు రావడం సహజం.