చైనా టీవీ స్టార్‌ యాంకర్‌ పతనం

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ ఛానెల్‌ – సిసిటివి (చైనా సెంట్రల్‌ టెలివిజన్‌). దానిలో బిజినెస్‌ వ్యవహారాల ప్రోగ్రాంకు యాంకరింగ్‌ చేసే రూయీ చెన్‌గాంగ్‌ దేశప్రజలకు, ముఖ్యంగా యువతకు హీరోలాటి వాడు. 27…

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ ఛానెల్‌ – సిసిటివి (చైనా సెంట్రల్‌ టెలివిజన్‌). దానిలో బిజినెస్‌ వ్యవహారాల ప్రోగ్రాంకు యాంకరింగ్‌ చేసే రూయీ చెన్‌గాంగ్‌ దేశప్రజలకు, ముఖ్యంగా యువతకు హీరోలాటి వాడు. 27 ఏళ్ల వయసులో అతను బుల్లితెరపైకి వచ్చి పదేళ్లగా దాన్ని ఏలుతున్నాడు. ఎప్పుడూ సూటులో కనబడుతూ, అచ్చమైన ఇంగ్లీషు ఉచ్చారణతో హెన్రీ కిసింజర్‌, టోనో బ్లయిర్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖులను కూడా తన వాగ్ధాటితో, తికమక ప్రశ్నలతో గడగడలాడించే రూయీ అంటే యువతకు ఒక రకమైన వ్యామోహం. ఇంగ్లీషువాడిలా కనబడినా తనకు దేశభక్తి మెండని అనేకసార్లు అతను చాటుకున్నాడు, చూపించాడు. చైనా చక్రవర్తి ప్రాసాదం వున్న 'ఫర్‌బిడెన్‌ సిటీ'లో ఓ విదేశీ కంపెనీ తన షోరూము పెట్టినపుడు 'జాతీయ ప్రాధాన్యత కలిగిన అటువంటి చారిత్రక ప్రదేశంలో ఒక విదేశీ కంపెనీని అనుమతించడం జాతిని అవమానించడమే' అన్న నినాదంతో 2007లో ఉద్యమం లేవదీసి అందరి దృష్టీ ఆకర్షించాడు. 

2010లో జి20 సమావేశం జరిగినపుడు ఒబామా విలేకరులతో యిష్టాగోష్టిలో తమకు సన్నిహిత దేశమైన దక్షిణ కొరియా నుంచి వచ్చిన పాత్రికేయుణ్ని ప్రశ్న అడగమన్నాడు. అతను లేచే లోపున యితను లేచి నిలబడి ''నేను చైనావాణ్ని. అయినా యావత్తు ఆసియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను.'' అంటూ ప్రశ్నలు సంధించాడు. దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో చైనాకు తగిన గౌరవం యివ్వనందుకు విదేశీ అతిథులను టీవీల సాక్షిగా ఝాడించేశాడు. జాతీయభావం, విదేశీయులను నిలదీయగల సత్తా రెండూ వున్న యువకుడిని యువత మాత్రమే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా ఆరాధించడంలో ఆశ్చర్యం ఏముంది? సాయంత్రం అతని షో అనగానే అందరూ టీవీలముందు గుమిగూడతారు. ఇదంతా జులై 11 ముందు కథ. ఆ రోజు సాయంత్రం షో ఆరంభమయింది. కానీ రూయీ లేడు. అతని కుర్చీ ఖాళీగా వుంది. అతనితో పాటు యాంకరింగ్‌ చేసే అతను మాత్రమే కనబడి షో నిర్వహించాడు. అంతకు కొన్ని గంటల ముందే పోలీసులు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన అవినీతి వ్యతిరేక పరిశోధకులు వచ్చి అతన్ని టీవీ ఆఫీసు నుండి యీడ్చుకుని వెళ్లారు! 

చైనాకు ప్రధానిగా హ్యూ జింటావో దిగిపోయిన తర్వాత అతని కాలంలో ప్రముఖులుగా చెలామణీ అయిన అనేకమందిపై కొత్త ప్రధాని జీ జిన్‌పింగ్‌ అవినీతి ఆరోపణలు మోపి, విచారణ చేయిస్తున్నాడు. జింటావోకు అతి సన్నిహితుడిగా, పార్టీ పాలిట్‌ బ్యూరో మెంబరుగా గతంలో ఒక వెలుగు వెలిగిన ఝౌ యాంగ్‌కాంగ్‌ కొన్ని నెలలుగా పబ్లిక్‌గా కనబడటం లేదు. అవినీతికి పాల్పడ్డారంటూ అతని అనుచరులు అనేకమందిని అరెస్టు చేయడం జరిగింది. వారిలో యిద్దరు చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పోరేషన్‌లో సీనియర్‌ అధికారులు. మరొకరు – లీ డాంగ్‌షెంగ్‌. అతన్ని ఫిబ్రవరి నెలలోనే పబ్లిక్‌ సెక్యూరిటీ శాఖ (హోం శాఖ వంటింది) కు వైస్‌ మినిస్టర్‌గా చేశారు. ఇప్పుడు అరెస్టయ్యాడు. ఫిబ్రవరిలో మంత్రి కావడానికి ముందు లీ సిసిటివికి అధినేతగా పనిచేశాడు. సిసిటివిలో అనేక అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గమనించడంతో దాని డైరక్టరు, బిజినెస్‌ ఛానెల్‌కు యిన్‌చార్జి అయిన గువో ఝెంక్సీను కూడా అరెస్టు చేశారు. వాళ్లతో బాటే రూయీను కూడా! వీళ్లందరూ పదవులలో వున్నారు కానీ ఒక యాంకర్‌కు అవినీతితో సంబంధం ఏముంటుంది అనుకోవచ్చు. 

రూయీ మామూలు యాంకర్‌ కాదు. అతనికి ఒక పబ్లిక్‌ రిలేషన్స్‌ కంపెనీ వుంది. ఆ వ్యాపారంలో దిట్ట అయిన అంతర్జాతీయ సంస్థ 'ఎడెల్‌మన్‌'కు చెందిన చైనా శాఖలో పని చేసే అతన్ని భాగస్వామిగా చేసుకుని యీ కంపెనీ పెట్టాడు. తను యాంకరింగ్‌ చేసే బిజినెస్‌ ప్రోగ్రాం మధ్యలో వచ్చే యాడ్‌ స్లాట్స్‌ కాంట్రాక్టు సిసిటివి ద్వారా ఆ కంపెనీకి చౌకగా యిప్పించాడు. ఇతని కార్యక్రమం చాలా పాప్యులర్‌ కాబట్టి, యితను చెప్పేది దాదాపు వేదంగా పరిగణింపబడుతోంది కాబట్టి దానిలో యితను చేసే వ్యాఖ్యలు తమ కంపెనీకి అనుకూలంగా వుండాలని భారీ వాణిజ్యసంస్థలు అనేకం తహతహలాడతాయి. వారి వద్ద నుండి యాడ్స్‌ తన కంపెనీ ద్వారా సంపాదించేవాడు. అంతేకాదు, ఆ యా కంపెనీల అధికారులతో యింటర్వ్యూలు నిర్వహించి వాళ్లకి ప్రచారం కల్పించేవాడు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాలకు పదేళ్లగా ప్రతీ ఏడాదీ యితన్నే సిసిటివి పంపిస్తోంది. 

2009లో దావోస్‌లో సమావేశం జరిగినపుడు, అనేక కార్యక్రమాలకు యితన్నే హోస్ట్‌గా సెలక్టు చేసేలా ఎడెల్‌మన్‌ సంస్థ ఏర్పాటు చేసింది. దాన్ని చూపించి యితను సిసిటివికి, తన కంపెనీకి కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఇలా తన పాప్యులారిటీని, పదవిని దుర్వినియోగం చేసినందుకు గాను ప్రభుత్వం యిప్పుడు అతనిపై విరుచుకు పడుతోంది. 

సిసిటివి యిటీవలే ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి విస్తారంగా ఖర్చుపెడుతోంది. ఇలాటి సమయంలో చైనీస్‌ బిజినెస్‌ వర్గాలతో కుమ్మక్కయి, తప్పుడు వార్తలందించిందన్న విషయం వెలుగులోకి రావడంతో దాని యిమేజికి దెబ్బ తగిలినట్లే. రూయీ విషయంలోనైతే చెప్పనక్కరలేదు. చైనీస్‌ యువత హతాశులయ్యారు. ఇప్పుడు అతన్ని మరో కోణంలో చూపుతూ వార్తలు వెలువడుతున్నాయి. ఒకసారి అతన్ని అడిగారట – ''నువ్వు చైనా జాతీయవాదం గురించి యింత చెప్తావు, మరి చైనాలో తయారయిన కారు కాకుండా జాగ్వార్‌లో ఎందుకు తిరుగుతావు?'' అని. ''జాగ్వార్‌ను కొన్నదెవరు? టాటావాళ్లు. వాళ్లు ఇండియాకు చెందిన వ్యాపారస్తులు. ఇండియా ఒక అభివృద్ధి చెందుతున్న పొరుగు దేశం. జాగ్వార్‌ కొనడం ద్వారా ఒక డెవలపింగ్‌ నేషన్‌కు సాయపడుతున్నాను.'' అని సమాధానమిచ్చాడట మన గడుగ్గాయి! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]