తరుణ్ భాస్కర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా కీడా కోలా. ఈ సినిమా ఈవారం థియేటర్లలోకి వస్తోంది. నిజానికి చిన్న సినిమా అయినా, కాస్త ఎక్కువ కాలం సెట్ మీద వుండిపోవడం వల్ల టోటల్ గా 10 కోట్లకు దగ్గరగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
వడ్డీలు.. పబ్లిసిటీ అన్నీ కలుపుకుని. అదృష్టం ఏమిటంటే నాన్ థియేటర్ మీద ఎనిమిది కోట్ల వరకు సంపాదించేసారు. మిగిలిన రెండు కోట్లు థియేటర్ నుంచి రావాల్సి వుంది. సురేష్ సంస్థ తన బ్యానర్ యాడ్ చేసి, సినిమాకు నాలుగు కోట్లు ఇచ్చి, విడుదల చేస్తోంది. అందువల్ల తరుణ్ భాస్కర్ విడుదల నాటికే రెండు కోట్ల లాభంలో వున్నారు. కానీ సురేష్ సంస్థ మాత్రం థియేటర్ నుంచి నాలుగు కోట్లు తెచ్చుకోవాల్సి వుంటుంది. ఆంధ్రలో లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నైజాంలో బాగా నడుస్తుందని నమ్ముతున్నారు.
సినిమాను ఇప్పటికే యూనిట్ జనాలకు, సన్నిహితులకు ప్రదర్శించడం మొదలు పెట్టేసారు. బుధవారం నుంచే పెయిడ్ ప్రీమియర్లు మొదలు పెట్టేయడం విశేషం. ఇప్పటికి ఓపెన్ చేసిన షో ల టికెట్ లు ఫిల్ కావడంతో మొల్లగా ఒక్కో షో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఫుల్ లాజిక్ లెస్ మాస్ కామెడీ జానర్ లో తయారయిన ఈ సినిమా కనుక హిట్ అయితే సురేష్ సంస్థకు, తరుణ్ భాస్కర్ కు జాక్ పాట్ నే.