అక్టోబర్ అంటేనే టాలీవుడ్ కు కలిసిరాని నెలగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నెలలో ఊహించే హిట్స్ కంటే, ఊహించని ఫ్లాపులే ఎక్కువ. గడిచిన మూడేళ్లుగా ఇదే ఆనవాయితీ నడుస్తోంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో మాత్రం చెప్పుకోవడానికి ఒక సినిమా ఉంది. అదే భగవంత్ కేసరి.
అక్టోబర్ మొదటి వారంలో.. ఓ మోస్తరు అంచనాలతో సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో మ్యాడ్, మామా మశ్చీంద్ర, 800, రూల్స్ రంజన్ లాంటి సినిమాలున్నాయి. ఈ 4 సినిమాలపై ఓ మోస్తరు అంచనాలుండేవి. ఎందుకంటే, వీటికి ప్రచారం ఆ స్థాయిలో చేశారు మరి. అయితే వీటిలో నిలబడింది మ్యాడ్ మాత్రమే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నందుకుంది.
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన మామా మశ్చీంద్ర అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ కూడా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ఈ వారం అంచనాలతో వచ్చి చతికిలపడిన సినిమాలివి.
అక్టోబర్ రెండో వారంలో.. దాదాపు 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు, అన్నీ చిన్న సినిమాలే. ఆర్.నారాయణమూర్తి తీసిన యూనివర్సిటీ, సగిలేటి కథ, రాక్షస కావ్యం లాంటి సినిమాలు ప్రచారంతో ఆకట్టుకున్నప్పటికీ ఏవీ థియేటర్లలో నిలబడలేదు. వేటికవే ఫ్లాప్ అయ్యాయి. దసరాకు ముందు వారం కావడంతో ఆడియన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఇక సిసలైన అక్టోబర్ బాక్సాఫీర్ వార్ దసరా సీజన్ లో మొదలైంది. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరావు సినిమాలు ఒకేసారి పోటీపడ్డాయి. వీటిలో భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఫుల్ గా నిలబడింది. అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమా దసరా విన్నర్ గా నిలిచింది
భారీ అంచనాలతో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. సెకండాఫ్ నీరసంగా ఉండడం, భారీ రన్ టైమ్ రవితేజ సినిమాను దెబ్బతీసింది. ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ అండతో తెలుగ రాష్టాల్లో భారీగా విడుదలైన లియో సినిమా, యూత్ ను ఎట్రాక్ట్ చేసింది. విక్రమ్, కాంతార రేంజ్ లో ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరలేదు కానీ.. నిర్మాణ సంస్థకు బ్రేక్-ఈవెన్ సాధించి పెట్టింది.
దసరా తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. మార్టిన్ లూథర్ కింగ్, లింగోచ్చా లాంటి సినిమాలొచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ నెలలో వచ్చిన రీ-రిలీజ్ ఛత్రపతి కూడా ఫ్లాప్ అయింది.
ఓవరాల్ గా అక్టోబర్ నెలలో 27 సినిమాలొస్తే, 2 మాత్రమే హిట్టయ్యాయి. అంచనాలతో వచ్చిన భగవంత్ కేసరి హిట్టవ్వగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన మ్యాడ్ సినిమా సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది.