ఇప్పుడేదో జైలు నుంచి బయటకు వచ్చిన స్వతంత్ర సమరయోధుడిలా ఊరేగొచ్చు కానీ, తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఇక నుంచి ఆరోగ్యం విషయంలో సూటి పోటి మాటలు తప్పవు! ఆయన అనారోగ్యం గ్రౌండ్స్ నుంచి బెయిల్ సంపాదించుకోవడం రాజకీయంగా చాలా మైనస్ కాబోతోంది.
చాలా దేశాల్లో దేశాధ్యక్షుల, రాజకీయ నేతల ఆరోగ్యం కూడా నిత్యం చర్చలో ఉంటుంది. మరి దీనికి చంద్రబాబు కూడా మినహాయింపు కాబోరు ఇక! గట్టిగా నెల రోజుల పాటు జైల్లో ఉండే సరికే చంద్రబాబు శరీరం రోగాల పుట్ట అన్నట్టుగా సొంత మీడియా, సొంత వాళ్లే వాపోతున్నారు. చంద్రబాబు నాయుడుకు లేని సమస్య లేదన్నట్టుగా పచ్చ మంద హడావుడి చేస్తోంది.
చివరకు బెయిల్ కోరడానికి కూడా చంద్రబాబు అనారోగ్యమే ఆయుధం అయ్యింది. మరి ఇప్పుడు ఆ అనారోగ్యం, జరగాల్సిన సర్జరీ, ఇతర అనారోగ్య సమస్యల గురించి చెప్పుకోకపోతే బెయిల్ దక్కేది కాదని స్పష్టం అవుతోంది. ఇక క్వాష్ పిటిషన్ పై నమ్మకం లేక అనారోగ్యం అంటూ బెయిల్ తెచ్చుకున్నారు. బయటకు అయితే వచ్చారు.
ఇక ఇతర కేసుల్లో కావొచ్చు, స్కిల్ కేసులో కావొచ్చు.. సీఐడీ విచారణ అనగానే చంద్రబాబు నాయుడు తన అనారోగ్యం అంశాన్ని ప్రస్తావించవచ్చు. ఇక అరెస్టులకు, జైలుకు అవకాశం ఇవ్వకుండా.. తన అనారోగ్య సమస్యలను న్యాయస్థానాల్లో ఏకరువు పెట్టుకోవచ్చు. ఇక నుంచి చంద్రబాబు నాయుడు ను ఏ కేసు లో అయినా జైలుకు వెళ్లకుండా కాపాడేది ఆయన అనారోగ్యమే! ఆయన నిప్పు అనో, పప్పు అనో .. ఆయనకు ఊరట లభించకపోయినా, వృద్ధుడు, అనారోగ్యవంతుడు అనే అంశాలే ఆయనకు అస్త్రాలు కాబోతున్నాయి.
చంద్రబాబు నాయుడు వృద్ధుడు కావడంతో.. ఆయనకు యువకుడి కలరింగ్ ఇవ్వడానికి పచ్చ ప్రగల్బాలు ఇన్నాళ్లూ వినిపించేవి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఏమిటో బయటపడింది. మరి ఈయన ఫిజికల్ ఫిట్ నెస్ ఆయన రాజకీయ జీవితం నుంచి రిటైర్డ్ హర్ట్ అయ్యేలా చేస్తున్నట్టుగా ఉంది.