అరెస్టైన మొదట్లో.. అసలు చంద్రబాబు నాయుడు బెయిల్ కు అప్లై చేయరు, నిజాయితీ నిరూపించుకుని బయటకు వస్తారన్నారు! అయితే ఆ నిజాయితీ నిరూపించుకోవడం అంటే ఏమిటంటే.. క్వాష్ పిటిషన్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం! సాంకేతిక కారణాలు చూపి.. క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసు కొట్టేయించుకునేసి చంద్రబాబు బయటకు వచ్చేస్తారని, తద్వారా ఆయన నిప్పుగా శాశ్వత కీర్తి పొందుతారనే లెక్కలేవో వేసింది పచ్చ బ్యాచ్!
ఆ క్వాష్ పిటిషన్ పై నమ్మకంతో, చంద్రబాబు నాయుడు బెయిల్ కే అప్లై చేయరు అంటూ మొదట్లో గప్ఫాలు కొట్టారు! చివరకు చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చారు. క్వాష్ పిటిషన్ కోర్టుల్లో ఇంకా గింగిరాలు కొట్టుకుంటూ ఉంటే.. చంద్రబాబు నాయుడు తన అనారోగ్యాన్ని చూపించుకుని బయటకు వచ్చారు!
కంటి ఆపరేషన్ నిమిత్తం నెల రోజుల పాటు చంద్రబాబుకు బెయిల్ దక్కింది. చంద్రబాబు నాయుడుకు బోలెడన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ పచ్చబ్యాచ్ గత వారం నుంచి వాపోతూవచ్చింది. ఆయన కూర్చోలేరని, నిల్చోలేరని, కంటికి ఆపరేషన్ జరగాల్సి ఉందని ఇలా రకరకాల అంశాలను ప్రస్తావించి, చంద్రబాబు నాయుడుకు లేని జబ్బు లేదన్నట్టుగా వాపోయారు.
మరి ఈ వాపోవడం ఏదో నెల కిందటే చేసి ఉంటే చంద్రబాబు అనారోగ్య కారణాల రీత్యా అప్పడే బయటకు వచ్చేవారేమో! చంద్రబాబు నాయుడు వీర ఆరోగ్యవంతుడు అన్నట్టుగా కొన్నాళ్లు పాటు మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది.
గత వారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట చెప్పారు. పీవీ నరసింహారావుపై ఏవో కేసులు నమోదు అయితే.. ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు ఒకే విషయాన్ని నివేదించారట, ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వమని కోరగా, మరో మాట లేకుండా కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఉండవల్లి వివరించారు.
చంద్రబాబు కూడా బయటకు రావాలంటే.. ఆయన వయసు, అనారోగ్య పరిస్థితులను నివేదిస్తే చాలని ఉండవల్లి చెప్పారు! అయితే ఇన్నాళ్లూ చంద్రబాబు చాలా ఆరోగ్యవంతుడు అని కలరింగ్ ఇచ్చుకోవాలనుకున్నారు. అయితే ఇప్పటికే చాలా లాగారు. ఇంకా లాగితే తెగిపోతుందనే భయంతో .. చివరకు ఆపరేషన్ మిష మీద చంద్రబాబుకు బెయిల్ సంపాదించుకున్నట్టుగా ఉన్నారు!