చంద్రబాబు విషయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల కంటే ఎల్లో మీడియా అతి మామూలుగా లేదు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన మరుక్షణం నుంచి ఎల్లో మీడియా పైత్యం భరించలేకుండా వుందనే అభిప్రాయాన్ని కలిగించింది. చంద్రబాబు విడుదల అనంతరం ఆయన షెడ్యూల్ను టీడీపీ ప్రకటించాల్సి వుంది. అయితే టీడీపీ కంటే ఎల్లో మీడియానే బాబు షెడ్యూల్ ఇదీ అంటూ నానా హడావుడి చేయడం గమనార్హం. పోనీ ఆ షెడ్యూల్లో నిజం వుందా? అంటే… అబ్బే లేనే లేదు.
మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబు రాత్రికి విజయవాడ చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బాబు బయటికి రాకుండానే ఆయన్ను ఎల్లో మీడియా ఆంధ్రా నుంచి అమెరికా వరకూ తిప్పింది. అనారోగ్య కారణాలతో ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందన్న స్పృహ కూడా ఎల్లో మీడియాకు లేకపోయింది. ఇదేదో రెగ్యులర్ బెయిల్ ఇచ్చినట్టు టీడీపీ శ్రేణుల కంటే ఎల్లో మీడియా సంబరాలు మొదలెట్టింది.
ఈ క్రమంలో చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ ఇదే అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టింది. బుధవారం తిరుమలకు వెళ్తారని, రాత్రికి అక్కడే బస చేస్తారని టీడీపీ అనుకూల మీడియా ప్రకటించింది. గురువారం ఉదయం మొదట వరాహస్వామిని, అనంతరం కలియుగ దైవాన్ని దర్శించుకుంటారని ప్రచారం చేసింది. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు వెళ్తారని షెడ్యూల్ ప్రకటించింది. దీంతో టీడీపీ శ్రేణులు చంద్రబాబు కోసం ఎదురు చూసే పరిస్థితి.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ప్రకటన టీడీపీ శ్రేణులకు నిరాశను మిగిల్చింది. ఎందుకంటే…ఎల్లో మీడియా ప్రచారంలో నిజం లేకపోవడమే. తిరుమల పర్యటన లేదని అచ్చెన్న తేల్చి చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు హైదరాబాద్కు వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు, బుధవారం ఎవరినీ చంద్రబాబు కలవరని ఆయన స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు పదేపదే తన ప్రకటనలో కోర్టు ఆదేశాలను నొక్కి చెప్పడాన్ని గమనించొచ్చు. ఎల్లో మీడియా విపరీత ధోరణి చంద్రబాబు షెడ్యూల్ను పక్కదారి పట్టించిందని టీడీపీ శ్రేణులు విమర్శించే పరిస్థితి.