దిలీప్‌ కుమార్‌ ఆత్మకథ

దిలీప్‌ కుమార్‌ జీవితంపై గతంలోనే పుస్తకాలు వచ్చాయి. అయితే యిటీవల వెలువడినది అతనే రాసుకున్న ఆత్మకథ. పేరు ''ద సబ్‌స్టన్స్‌ అండ్‌ ద షాడో''. 92 ఏళ్ల వయసులో ఉదయతారా నాయర్‌ అనే ఫిలిం…

దిలీప్‌ కుమార్‌ జీవితంపై గతంలోనే పుస్తకాలు వచ్చాయి. అయితే యిటీవల వెలువడినది అతనే రాసుకున్న ఆత్మకథ. పేరు ''ద సబ్‌స్టన్స్‌ అండ్‌ ద షాడో''. 92 ఏళ్ల వయసులో ఉదయతారా నాయర్‌ అనే ఫిలిం జర్నలిస్టుకు అతను చెప్తూ పోగా, ఆమె గ్రంథస్తం చేసింది. పుస్తకం మొత్తం చదివినవారికి దానిపై సైరా బాను ప్రభావం బాగా కనబడుతోందట. ఎందుకంటే ఉదయతార సైరాకు స్నేహితురాలు. సైరా దిలీప్‌ను అంటిపెట్టుకుని వుండి, ఆ పుస్తకంలో తన గురించి కూడా చాలా రాయించేసింది – తను వేరే జీవిత గాథ రాయనక్కరలేదన్నంతగా! దిలీప్‌ చాలాకాలం పెళ్లాడలేదు. అతనికి 11 మంది అప్పచెల్లెళ్లు, అన్నదమ్ములు వున్నారు. వారందరినీ దిలీప్‌ సాకాడు. సైరాను పెళ్లాడి యింటికి తీసుకుని వచ్చిన తర్వాత అవివాహితురాలైన దిలీప్‌ పెద్దక్కగారు సకీనా పెద్ద గోల చేసి సతాయిస్తూ వుంటే బయటకు వచ్చేసి సైరా యింట్లో యిల్లరికం వున్నాడు. 

''మొఘల్‌ ఏ ఆజమ్‌''లో దిలీప్‌, మధుబాలల పెదాల మధ్య పక్షి యీక వుండే ప్రణయసన్నివేశాన్ని ఎవరూ మరవలేరు. ''ఆ సీను తీసేనాటికి మా యిద్దరి మధ్య గొడవలు ఏ స్థాయికి చేరాయంటే మేం పలకరించుకోవడం కూడా మానేశాం'' అన్నాడు దిలీప్‌. ఇలాటి విషయాలన్నీ గ్రంథస్తమయ్యాయి కానీ సైరాను పెళ్లాడక కూడా దిలీప్‌ ఆస్మా అనే హైదరాబాదీ యువతిని పెళ్లాడిన సంగతి, సైరా పట్టుదలపై విడాకులు యిచ్చిన సంగతీ మాత్రం కాలేదు.

దిలీప్‌ చిన్నప్పుడు యీ కుర్రవాడు చాలా గొప్పవాడవుతాడు, దిష్టి కొట్టకుండా భద్రంగా చూసుకోవాలి అని ఒక ఫకీరు వాళ్ల నాయనమ్మకు చెప్పాడట. దాంతో ఆమె యితనికి గుండు కొట్టించి మొహమంతా కాటుక పూసి బడికి పంపేదట. పిల్లలంతా గేలి చేసేవారట. ఇంట్లో వాళ్లను కాదనలేక, స్నేహితులను వారించలేక ఆ బాధను మౌనంగా భరించేవాడట. తర్వాతి రోజుల్లో ''దేవదాసు'', ''మేలా'', ''జుగ్నూ'',''దాగ్‌'' వంటి సినిమాలలో విషాదనాయక పాత్రల్లో జీవించడానికి యీ అనుభవం పనికి వచ్చిందట. 'ఎంతైనా నేను కావాలని తెచ్చిపెట్టుకున్న నటన కాదది. ఆ పాత్ర గురించి ఆలోచించి దానిలో లీనమయ్యి అభినయించాను.' అన్నాడు దిలీప్‌.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]