చెవిలో కాలీ ఫ్లవర్

చచ్చి ఏ లోకాన వున్నాడో కానీ ఆత్రేయ చెప్పనే చెప్పాడు. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి సుమా..అని. కానీ మన కామన్ జనాలున్నారు చూడండి..అదే సామాన్య జనం వున్నారు చూడండి..పాపం ఏం చెప్పినా…

చచ్చి ఏ లోకాన వున్నాడో కానీ ఆత్రేయ చెప్పనే చెప్పాడు. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి సుమా..అని. కానీ మన కామన్ జనాలున్నారు చూడండి..అదే సామాన్య జనం వున్నారు చూడండి..పాపం ఏం చెప్పినా నిజం అనుకుంటారు..ఏం చూసినా అబ్బో అనుకుంటారు. వారు అలా నమ్ముతుంటారు కాబట్టే చెప్పేవాళ్లు చెప్పేస్తుంటారు.. జనాల చెవుల్లో క్యాబేజీలేం ఖర్మ, ఏకంగా కాలీ ఫ్లవర్ లే పెట్టేస్తుంటారు. 

అల్లుఅర్జున్ మాంచి హీరో. కోట్లు తీసుకుని మరీ జనానికి మాంచి వినోదం పంచే మెగా హీరో. అంతవరకు ఓకె. ఆపైన మరింత చొరవ తీసుకుని ఇటీవల ఓ బుల్లి సినిమాను అందించాడు. పెద్ద దర్శకుడు సుకుమార్ చేయి చేసుకుని మరీ రూపొందించాడు. చట్టాన్ని గౌరవించడం, మంచిని నేర్చుకోవడం మన నుంచే ప్రారంభించాలన్నది ఆ సినిమా ఇచ్చే సందేశం. 

ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా చూసే జనం భలే చిత్రంగా అనుకున్నారు. అమ్మకు ఇల్లు కట్డడం, ఆలికి కోక కొనడం ఊరికి ఉపకారం అవుతుందా..అల్లు అర్జున్ చెకింగ్ లైన్ లో కాకుండా పక్క నుంచి వెళ్లడం అతని తప్పిదం ఎంత అవుతుందో, హీరో కదా అని చెక్ చేయకుండా వదిలేయడం అక్కడున్న గార్డు తప్పు కూడా అవుతుంది. అల్లు అర్జున్ వెళ్లిపోతుంటే, గార్డు నిలదీసినట్లు తీసి వుంటే, అప్పుడు సామాన్యుడి చైతన్యం తెలుస్తుంది. అంతే కానీ గార్డు డ్యూటీ నిర్లక్ష్యం చేస్తే, అల్లు అర్జున్ గుర్తు చేస్తే అది హీరోయిజం అనిపించుకుంటుంది. జనాల్ని చైతన్యం చేసినట్లు కాదు. 

సరే పోనీ ఇలా రాస్తే కోడి గుడ్డకు వెంట్రకలు పీకారంటూ అభిమానులు బాధపడతారు. దాన్ని వదిలేద్దాం. మరి అలా గార్డు డ్యూటీని సినిమాలో గుర్తు చేసిన అల్లు అర్జున్ నిజ జీవితంలో ఏం చేసారు. అర్ధరాత్రి పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తామంటే, చాటుగా చేయండి పబ్లిక్ లో చేస్తే నాకు సిగ్గు అని సాకు చెప్పుకొచ్చారు. తెల్లారి లేస్తే, పబ్లిక్ గా షూటింగ్ లు చేస్తారు. విదేశీ లోకేషన్ లలో చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకుని, అంతకన్నా చిత్రాతి చిత్రమైన గెంతులు గెంతుతారు. అప్పుడు లేని సిగ్గు, పోలీసులు మూతి ముందు గొట్టాం పెడతాం అన్నపుడు ఎందుకు రావాలి? అల్లు భయ్యా తాగారా లేదా..తాగితే ఆయన నడిచి వెళతారా, డ్రయివర్ ను పెట్టకుంటారా అన్నది వేరే సంగతి..చట్టాన్ని అయితే ముందు గౌరవించాలి కదా? 

అల్లు అర్జున్ కాకుండా ఇదే మాట మరే కామన్ మాన్ అయినా అంటే పోలీసులు ఊరుకుంటారా..లాగి గూబమీద ఒకటి ఇచ్చుకోరూ..ఇలా ప్రతి ఒక్కడికీ ప్రయివేటు తనిఖీలు చేస్తారా? 

మన నుంచే మార్పుప్రారంభించడం అంటే ఇదేనా? జనాలకు ఇచ్చే సందేశం కూడా ఇదేనా?

దీన్నే అంటారు మరి పెట్టించుకునే చెవులుంటే, కాలీ ఫ్లవర్ లయినా పెట్టేస్తాం అని

'చిత్ర'గుప్త