మంచి.. చెడు.. అన్న విషయం పక్కన పెడితే, పాశ్చాత్య దేశాల్లోని పైత్యాలన్నీ చాలా తేలిగ్గా మనోళ్ళకి పట్టేస్తున్నాయి. అలా పట్టిందే ఐస్ బక్కెట్ ఛాలెంజ్. ఓ సదుద్దేశ్యంతో ఇది రూపొందినా, దీన్ని పబ్లిసిటీ కోసం భలేగా ఉపయోగించేసుకుంటున్నారు మనోళ్ళు. అలా ఐస్ బక్కెట్ మన దేశంలో ఓ ఊపు ఊపేస్తోంది.
అయితే, ఈ వెస్ట్రన్ పైత్యానికి విరుగుడుగా రైస్ బక్కెట్ ఛాలెంజ్ తెరపైకొచ్చింది. పేదలకీ, అభాగ్యులకీ ఒక్కపూట అన్నం పెట్టేందుకు సహకరించాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రైస్ బక్కెట్ చాలెంజ్‌ని రూపొందించారు. ఇంకేముంది.. ఈ రైస్ బక్కెట్ ఛాలెంజ్‌కి మంచి స్పందన లభిస్తోందట కూడా.
నెత్తి మీద నుంచి ఐస్ క్యూబ్స్ కలిసిన నీటిని పారబోయడం కన్నా.. ఓ బక్కెట్ రైస్ (బియ్యం) దానం చేస్తే ఆ కిక్కే వేరప్పా.. అని సామాన్యులూ స్పందిస్తున్నారు. తమంతట తాముగా కొందరు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడ్తున్నారు. అనాధ శరణాలయాలకీ, వృద్ధాశ్రమాలకీ బియ్యం సహా నిత్యావసర వస్తువుల్ని దానం చేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మంచిదే కదా.!
మొత్తమ్మీద, ఐస్ బక్కెట్ ఛాలెంజ్‌ని ప్రారంభించినోళ్ళకీ హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఎందుకంటే దాన్ని చూసే కదా ఈ రైస్ బక్కెట్ ఛాలెంజ్ కూడా పుట్టుకొచ్చింది.