రాజేశ్ ఖన్నా నివసించిన బంగళా ''ఆశీర్వాద్'' విల్లు ద్వారా అతని కూతుళ్లకు సంక్రమిస్తే వాళ్లు గతవారంలో రూ. 90-95 కోట్లకు అమ్మేశారు. ఆ బంగళాలో తనకూ వాటా వుందని అనితా ఆడ్వాణీ అనే ఆమె కోర్టుకి వెళుతోంది. బాండ్రాలో సముద్రానికి ఎదురుగా వున్న 603 చ.మీ.ల ఆ బంగళాను 1960లలో హిందీ నటుడు రాజేంద్ర కుమార్ నుండి రాజేశ్ రూ. 3.50 లక్షలకు కొన్నాడు. 'డింపుల్' అనే పేరు మార్చి 'ఆశీర్వాద్' అని పెట్టుకున్నాడు. అప్పటినుండి అతను తారాపథంలో దూసుకుపోవడంతో అతని అభిమానులు అతన్ని చూడడానికి యీ బంగళా వద్ద పడిగాపులు కాచేవారు. ఆ విధంగా ఆ బంగళా అందరి నోళ్లలో నానింది.
ఆ యింట్లో వుండగానే రాజేశ్, డింపుల్ కపాడియాను పెళ్లాడడం, యిద్దరు కూతుళ్లకు తండ్రి కావడం, భార్యతో విడిపోవడం, వేషాలు తగ్గడం – అన్నీ జరిగాయి. 2012లో మరణించాడు కూడా. అప్పటికి అతనితో పాటు సహచరిగా (లివ్-యిన్ పార్ట్‌నర్)గా అనితా ఆడ్వాణీ అనే యింటీరియర్ డిజైనర్ వుండేది. రాజేశ్ మరణించడానికి ముందు అతని భార్య, పిల్లలు చేరువైతే యీమె అడ్డు చెప్పింది. అతను పోయాక ఆస్తిలో వాటా కావాలంటూ కోర్టుకి వెళ్లింది. ఆ యింటిని మ్యూజియంగా మార్చాలని రాజేశ్ కోరుకున్నాడని ప్రకటించింది కూడా.
అయితే రాజేశ్ తన విల్లులో తన తదనంతరం ఆ యింటి పేరు 'వరదాన్ ఆశీర్వాద్'గా మార్చాలని, తన ఆస్తి యావత్తు కూతుళ్లిద్దరకూ చెందాలని రాశాడు. దాని ప్రకారం వాళ్లకు యిల్లు దక్కింది. వాళ్లు యిప్పుడు అమ్మేశారు. దాని ఏరియా తక్కువ కాబట్టి అక్కడ ఎత్తయిన ఆపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కట్టడానికి రూల్సు ఒప్పవు. లేకపోతే యింకా ఎక్కువ ధర పలికేది. 'అది లిటిగేషన్‌లో వున్న ఆస్తి, కొన్నవాళ్లు నేను తీసుకోబోయే క్రిమినల్ చర్యలకు గురవుతారు జాగ్రత్త' అంటోంది అనిత. చరమాంకంలో సహచరిణిని ఏర్పాటు చేసుకున్న వాళ్లందరి ఆస్తిపాస్తులూ యిలాటి వివాదాల్లో చిక్కుకున్నాయి. రాజేశ్ కథా అంతేనేమో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)