తమిళనాడు గ్రామీణ ప్రాంతంలో కొలువైన అంటరానితనం, మూఢనమ్మకాలపై దర్శకుడు భారతిరాజ ఎన్నో అస్త్రాలను సంధించాడు. వాస్తవిక నేపథ్యం నుంచి నాటకీయమైన సినిమాలను తెరెకక్కించాడు. వస్తూ వస్తూనే దక్షిణాది చిత్రపరిశ్రమపై తనదైన శాశ్వతముద్ర వేసిన భారతిరాజ రూపొందించిన అలాంటి సినిమాల్లో ఒకటి ‘‘కిళకు పోగుం రైల్’’. ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది కానీ.. ఇది మరో రకంగా మనకు ప్రత్యేకమైనది. తెలుగులో వన్ఆఫ్ ది బెస్ట్ కమేడియన్ అయితే బేతా సుధాకర్ నటించిన తొలిసినిమా ఇది! అదికూడా హీరోగా! ఈసినిమాతో తమిళంలో స్టార్ అయ్యాడు సుధాకర్. ఎన్నో మలుపులు తిరిగిన సుధాకర్ కెరీర్‌లోని తొలిమెరుపు ఈ సినిమా. యాక్టింగ్ స్కూల్లో చిరంజీవికి బ్యాచ్‌మేట్, మద్రాస్‌లో ఇంకా మెగాస్టార్ కాని చిరంజీవికి రూమ్మేట్ అయిన సుధాకర్‌కు మొదటి అవకాశం ఇది. చిరంజీవి కన్నా మొదటే అవకాశం వచ్చింది! అది కూడా అప్పటికే సంచలన సినిమాలు కొన్ని తీసి ఉన్న భారతిరాజ దర్శకత్వంలో! దీంతో అతడి దశ తిరిగి పోతుందనుకొన్నారంతా. నిజంగానే తిరిగింది.
క్షురక వృత్తి చేసుకొనే కుటుంబానికి చెందిన చదువుకొన్న యువకుడు పరంజ్యోతి. తమిళ అభ్యుదయవాది భారతియార్‌ను ఆరాధిస్తూ… అవే భావాలుకలిగిన యువకుడితను. తమ వృత్తిచేసే వారిని ఊర్లో అంటరాని వాళ్లుగా చూస్తారు. ఎంతైనా యువకుడాయె. భారితీయార్ కవితలతో నిండిన ఆవేశం ఉంది ఒంటినిండా. దీంతో ఊర్లోని భూస్వాములు.. అగ్రకులపోళ్లకు ఇతండంటే మంట. తల్లి చనిపోవడంతో అదే ఊర్లోని దూరపుబంధువు అయిన అక్క ఇంటికి వస్తుంది పాంజలి( రాధిక). వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. తండ్రి చేస్తున్న వృత్తిపై కోపం కాదు.. ఆ వృత్తిపై అందరూ చూసే చిన్నచూపుతో పట్టణం వెళ్లిపోయి ఉద్యోగం చూసుకొందామనుకొంటాడు. పాంజలిని పెళ్లి చేసుకోవడానికి తను స్థిరపడాల్సిన అవసరాన్ని గుర్తించి పట్టణం వచ్చి ఉద్యోగం గురించి కష్టాలు పడుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఊర్లోని ఒక మూడనమ్మకానికి పాంజలిని బలిపెడతారు ఊరిపెద్దలు. ఊరికి పట్టిన అరిష్టంపోవాలంటే ఆమె నగ్నంగా ఊరిచుట్టూ తిరగాలని ఒత్తిడి తెస్తారు. దిక్కుమొక్కులేని ఆమె జీవితాన్ని ఆచారం పేరుతో అలా బలిపెడతారు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరిళ్లలో వాళ్లు తలుపులేసుకొని కూర్చోగా పాంజలిని నగ్నంగా మార్చి ఊరి వీధుల్లో తిప్పడం మొదలవుతుంది. సరిగా అదే దారుణం జరుగుతున్నప్పుడే ఊర్లోకి అడుగుపెట్టిన పరంజ్యోతి ఆమెకు బట్టలు ఇచ్చి తనవెంట తీసుకెళ్లిపోతాడు..ఇది గమనించి ఊరి పెద్దలు వారిని వెంటాడతారు… చిమ్మచీకటిలో ఊర్లో వాళ్లందరినీ తప్పించుకొని పారిపోతూ.. స్టేషన్‌ను చేరుకొని ‘‘తూర్పుకు వెళ్లే రైలు’’ను ఎక్కి ఊరివారి బారినుంచి ఆ ప్రేమికులు తప్పించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.
తమిళనాడులోని కొన్ని సెంటర్లలో 364 రోజుల పాటు ప్రదర్శితమైన సినిమా అది. తన నేపథ్య సంగీతంతో ఇళయారాజా.. చిత్రీకరణతో తమిళనాడు గ్రామీణ వాతావరణాన్ని తెరెకక్కించిన దృశ్యకావ్యం. సినిమా సీరియస్ కాన్సెప్టే అయినా.. చూస్తున్నంత సేపూ అహ్లాదకరంగా సాగుతుంది. ఈ సినిమాకు హీరోయిన్లను సెలెక్ట్ చేయడం చాలా చిత్రంగా జరిగింది. యాక్టింగ్ స్కూల్లో శిక్షణనుపూర్తి చేసుకొని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సుధాకర్‌ను ఒక హోటల్లో చూసి భారతిరాజ హీరోగా ఓకే చేశారట. ఈ విషయాన్ని సుధాకర్ ఒకసారి చెప్పారు. ఇది హిట్ కావడంతో సుధాకర్, రాధికలకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇదే ఊపులో సుధాకర్ దాదాపు 40 తమిళ సినిమాలు చేశారు. వాటిలో మెజారిటీ సినిమాలు హిట్స్, సూపర్ హిట్సే. అయితే ఒక రాజకీయ పార్టీ తనపై కక్షగట్టి కుట్ర చేయడంతో.. తమిళంలో తన కెరీర్ దెబ్బతింది అని.. దీంతో తెలుగులో సెటిలయిపోయానని ఈ స్టార్ కమేడియన్ ఒకసారి వివరించారు. ఇక హీరోయిన్ రాధిక తండ్రి ప్రసిద్ధ తమిళనటుడు ఎమ్ఆర్ రాధ. ఒకసారి వాళ్లింటికి వెళ్లిన భారతిరాజ ఆమెను హీరోయిన్గా నటించమని అడిగారట. అయితే తన చెల్లెలు నిరోషాకు సినిమాలపై చాలా ఆసక్తి ఉందని.. ఆమెను సెలెక్ట్ చేసుకోవాలని రాధిక సూచించింది. రాధిక, నిరోషాలు ఇద్దరూ అప్పటికి టీనేజర్లే. అయితే రాధికను ఒప్పించి నటింపజేశాడు భారతిరాజ. ఆమె నుంచి బెటర్ ఔట్పుట్ కోసం చాక్లెట్లను ఆశగా చూపే వారట దర్శకుడు. దర్శక, నటుడు భాగ్యరాజ ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేశాడు. కొన్నిసీన్లలో కూడా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం ఒక పాటను కూడా రచించాడతను.
ఇదే సినిమాను తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’ పేరుతో బాపు రీమేక్ చేశారు. మోహన్, జ్యోతిలు హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళంలో హీరోకు భారతియార్‌ను ఆదర్శంగా చూపితే.. తెలుగులో వేమన, శ్రీశ్రీ వంటి ప్రజాకవుల ఆదర్శాలను హీరో అనుసరిస్తూ ఉంటాడు. తెలుగులో ఈ సినిమాకు అంత గుర్తింపు లభించలేదు.
తమిళంలో మాత్రం ఇప్పటికీ క్లాసిక్ సినిమా జాబితాను తయారు చేస్తే ఆ జాబితాలో ఈ సినిమా తొలి స్థానాల్లో నిలుస్తుంది. మరి అలాంటి స్థాయి ఉన్న మూవీలో ఒక తెలుగువాడు హీరోగా నటించడం.. ఎప్పటికీ మనకు గర్వకారణమే!