పవన్‌కళ్యాణ్‌.. ఎవరికీ అర్థం కాడు.!

పవర్‌ ట్విట్టర్‌ పిట్ట ఎట్టకేలకు పెదవి విప్పింది. అదేనండీ, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ ‘ట్విట్టర్‌ పిట్ట’ ఎట్టకేలకు స్పందించింది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకొచ్చానంటూ ఘాటైన ప్రసంగాలతో, ఆవేశపూరితమైన డైలాగులతో హల్‌చల్‌ చేసిన…

పవర్‌ ట్విట్టర్‌ పిట్ట ఎట్టకేలకు పెదవి విప్పింది. అదేనండీ, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ ‘ట్విట్టర్‌ పిట్ట’ ఎట్టకేలకు స్పందించింది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకొచ్చానంటూ ఘాటైన ప్రసంగాలతో, ఆవేశపూరితమైన డైలాగులతో హల్‌చల్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌, తెలుగు రాష్ట్రాల్లో ఓటకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్‌ 8 అంశాలపై భగ్గుమంటోంటే ఇన్నాళ్ళుగా సైలెంట్‌గా వుండి, ఇప్పుడు తీరిగ్గా ట్విట్టర్‌ ద్వారా ఏవేవో కామెంట్లు పోస్ట్‌ చేశాడు.

ఇంతకీ పవన్‌ ట్విట్టర్‌ కామెంట్స్‌ అర్థమేంటి.? అని వెతక్కండి.. మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. నెల్సన్‌ మండేలా, తెగేదాకా లాగొద్దు.. ఇలాంటివి ఏవేవో పదాలు ఉపయోగించారంతే. ఎక్కడా ఓటుకు నోటు గురించి మాట్లాడలేదు, సెక్షన్‌ 8 ఊసెత్తలేదు, ఫోన్‌ ట్యాపింగ్‌ మీదా స్పందించలేదు. రాజధాని రైతుల ఆవేదన ఆయనకు అక్కర్లేదేమో. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నారేమో.!

ఈ మాత్రందానికి పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టాలా? అనడక్కండి.. అక్కౌంట్‌ యాక్టివ్‌గానే వుందన్పించుకోడానికి ఆ మాత్రం కామెంట్లు పెట్టకపోతే ఎలా.? ఇంత దారుణంగా తయారయ్యింది పవన్‌కళ్యాణ్‌ వ్యవహారం. రాజకీయాల్లోకి రావడమంటే,  ప్రజలకు అండగా నిలబడటం. నాయకుడనేవాడు ప్రజల ముందు నిలబడి, వారిని ముందుకు నడిపించగలగాలి.

పవన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్న నెల్సన్‌ మండేలా అయినా, పవన్‌ తన ఆరాధ్య దైవంగా భావించే చేగువేరా అయినా.. జనంలో నిలబడ్డ మనుషులు. పవన్‌లా ఆవేశమొచ్చినప్పుడు డైలాగులు చెప్పి, ఆ తర్వాత సైలెంటయిపోలేదు. పవన్‌ సారూ.. ఇప్పటికైనా జనంలోకి వస్తారా.? జనం తరఫున మాట్లాడతారా.? తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న వివాదాలపై పెదవి విప్పుతారా.?