పాఠ్యపుస్తకాల్లో ‘కీకర కాయ’లు!!

వేమన చెప్పాడని కాదు కానీ, పోలికలే కాదు, తేడాలు తెలియాలి. కంచూ, కనకమే కాదు; గోల్డూ, రోల్డుగోల్డూ ఒకే లాగుంటాయి. ఇదిరూపం. కానీ సారం వేరు. పోలికలకు ఇచ్చిన విలువ, తేడాలకు ఇవ్వం. వార్తనీ,…

వేమన చెప్పాడని కాదు కానీ, పోలికలే కాదు, తేడాలు తెలియాలి. కంచూ, కనకమే కాదు; గోల్డూ, రోల్డుగోల్డూ ఒకే లాగుంటాయి. ఇదిరూపం. కానీ సారం వేరు. పోలికలకు ఇచ్చిన విలువ, తేడాలకు ఇవ్వం. వార్తనీ, కథనీ ఒకేలా చూస్తాం. రెండూ వేరు. ఒకటి వాస్తవం, మరొకటి కథ. 

అక్కడితో ఆగిపోతామా? చరిత్రనీ, పురాణాన్నీ కలిపి పారేస్తాం. గతంలో ఇలా జరిగిందీ అని నిరూపణలతో చెప్పేది చరిత్ర. ఇలా జరిగివుండివుంటుందనో, లేదా ఇలా జరిగివుంటే బాగుండేది అనో చెప్పుకునేది పురాణం. మతాన్నీ, సైన్సునీ కూడా కలగాపులగం చేసేస్తాం. మొదటిది విశ్వాసం; రెండవది హేతువు. మనిషి తాను పుట్టక ముందు ఎవరో, చనిపోయిన తర్వాత ఎవరో అన్న బెంగతో మతాన్ని ఆశ్రయించవచ్చు. ఉపశమనమూ పొందవచ్చు. ఒక జీవిని వేరు చేసి కాకుండా జీవరాశినీ మానవ పరిణామక్రమాన్నీ ఆధారాలతో ముందు వుంచుతుంది సైన్సు. అలాగని మతం వెంట వెళ్ళే వాళ్ళు ఆస్తికులనీ, సైన్సు వెంట వచ్చే వాళ్ళు నాస్తికులనీ సూత్రీకరణలు చెయ్యలేం. శాస్త్రజ్ఞుల్లో నూ, ఆస్తికులుండవచ్చు; సంశయవాదులూ వుండవచ్చు. కానీ వారు సాధారణంగా నమ్మకాన్ని నమ్మకంగానూ, హేతువునీ హేతువుగానూ చూడటం అలవాటు చేసుకుంటారు. అప్పుడే శాస్త్రరంగంలో వారు పురోగించగులుగుతారు.

ఇలా విడివిడిగా వుండే వాటిని కలపటమనేది రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి: అజ్ఞానం, రెండు: ప్రయోజనం. అజ్ఞానాన్ని తొలగించటం సులువే. కానీ ప్రయోజనాన్ని పక్కన పెట్టించటం అత్యంత కష్టమైన చర్య. 

ఎన్.సి.ఇ.ఆర్.టి(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) పాఠ్యపుస్తకాలలో చరిత్ర ను తిరగ రాయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శల వర్షం గుప్పిస్తున్నాయి. మార్గాన్ని సుగమం చేసుకోవటానికి  ఈ సంస్థకు డైరెక్టర్‌గా వున్న ప్రొ. పర్విన్ సింక్లెయర్ ను ‘విక్రయాల్లో అవకతవకలు జరిగాయన్న’ కారణాన్ని చూపి, ఎన్డీయే సర్కారు తొలగించింది. అయితే ఆమె మీద ఎలాంటి చార్జ్‌షీట్ నమోదు చెయ్యలేదు. ఆమె 2012లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమెను పక్కను పెట్టటానికి అసలు కారణం : ‘ఆమె పాఠ్యపుస్తకాలను కాషాయీకరించటాని’కి అడ్డుతగలటమే. 

ఎన్డీయే1 సర్కారు వున్నప్పుడు ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరిగితే, అప్పట్లో తీవ్రవ్యతిరేకతే వచ్చింది. అయితే అప్పట్లో బీజేపీ ఇతర భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఎన్డీయే2 విషయానికి వచ్చేసరికి అలాంటి భయాలేమీ లేవు కనుక, ఈ పనిని నిరాటంకంగా చేసుకుపోవాలని చూస్తోంది.  ఈ పని మూడు విషయాల్లో చేపడుతోంది. ఒకటి: చరిత్ర, రెండు: భాష, మూడు: సైన్సు. 

గత 1200 యేళ్ళ భారత చరిత్ర వక్రీకరణకు గురయిందని, దానిని సరిచెయ్యాలని ఎన్డీయే సర్కారు భావిస్తోంది. అయితే ఇలా చరిత్రను తిరగరాయించటంలో ఉద్దేశ్యాలు రెండు. ఒకటి: రామాయణ, భారత గాథలు కేవలం పురాణాలు కావు, జరగిన ఘటనలని నిరూపించటం. (ఇందుకు ఇప్పటికే ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్’ ను రంగంలోకి దించింది. ఈ సంస్థ సంచాలకుడిగా ఇప్పటికే ఇలా ఆలోచించగల యల్లాప్రగడ సుదర్శనరావు బాధ్యతలను స్వీకరించారు. ఆరెస్సెస్‌కు అనుసంధానంగా వుండే అఖిల భారతీయ ఇతిహాస్ యోజన సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగాధిపతిగా వుంటూ ఆయన ఇప్పటికే చరిత్ర మీద ఇలాంటి భాష్యాలు చెప్పారు. ఈయన ‘కుల వ్యవస్థ’ కూడా దేశానికి ఎంతో మేలు చేసిందంటూ తన బ్లాగులో రాసి, సంచలనం సృష్టించారు.) రెండు: చరిత్రలో ముస్లిం పాలకులు ఎక్కువ నష్టం చేశారని రాయించి, మెజారిటీ మత భావనను తమకనుకూలంగా పెంపొందించుకోవటం. మొగలాయిలు ఎలా ఇతర దేశాలనుంచి ఈ దేశానికి వచ్చారు, అంతకు ముందు వైదిక మతంతో ఆర్యులు కూడా ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారన్న వాదనలను తీసిపారెయ్యాలనే ప్రయత్నంలో వున్నారు. 

ఎమర్జన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వంలో ఎప్పుడూ ఛలోక్తులు వేసే ఆరోగ్యమంత్రి రాజ్ నారాయణ్  శస్త్ర చికిత్సల మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులు ఒక ముచ్చట చెప్పారు. భారత దేశంలో శివుడు చేసిన శస్త్ర చికిత్స ఎవరూ చెయ్యలేకపోయారనీ, ఆయన మనిషికి ఏనుగు తలను అమర్చగలిగారనీ చెప్పినప్పుడు ప్రపంచ పత్రికలన్నీ కార్టూన్లు వేశాయి. కానీ నేడు ఇలాంటి విషయాలను చాలా సీరియస్ గా చెప్పి సైన్సుగా చిత్రిస్తున్నారు. ‘స్టెమ్ సెల్స్’ కు మూలం భారతంలోని నూరుశకలాలగా మారిన  గాంధారి గర్భవిఛ్ఛిత్తి అని  చెపుతూ, దీనికి పేటెంట్ కావాలనేంత వరకూ వెళ్ళిపోతున్నారు. ఇవి ఇప్పటికే గుజరాత్ పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నాయి. రేపు దేశమంతటా రానున్నాయి. 

ఇక భారతీయ భాషలకన్నిటికీ మాతృక ‘సంసృ్కతం’ అని చెబుతూ, దానిని కూడా బలవంతాన  అన్ని ప్రాంతాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. (ద్రావిడ భాషలకి సంసృ్కతభాషకీ మూలంలో ఎలాంటి సంబంధంలేదని అనే పరిశోధనలు వచ్చాయి.)  ఈ పేరు మీద ‘వేదప్రామాణ్యాన్ని’ , మెజారిటీ మతతత్త్వాన్నీ రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. సెక్యులరిజాన్ని కూకటి వేళ్ళతో పెకలించే ఏ ప్రయత్నాన్నయినా ఈ దేశ ప్రజలు వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఎన్డీయే సర్కారు కూడా మరో మారు ఈ పాఠాన్ని నేర్చుకుంటుంది. 

సతీష్ చందర్