విశాఖ రాజధాని కాదుట.. బాబు గారి ఉవాచ

విశాఖను రాజధాని చేయాలన్న ఆలోచన టీడీపీకి ఏ కోశానా లేదు. ఇది కొత్తగా చెప్పేది కూడా కాదు, ఆ ఆలోచన ఉంటే 2014లో విభజన ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా అయినపుడే చంద్రబాబు చేసేవారు. కానీ…

విశాఖను రాజధాని చేయాలన్న ఆలోచన టీడీపీకి ఏ కోశానా లేదు. ఇది కొత్తగా చెప్పేది కూడా కాదు, ఆ ఆలోచన ఉంటే 2014లో విభజన ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా అయినపుడే చంద్రబాబు చేసేవారు. కానీ నాడు విశాఖలో తొలి మంత్రి వర్గ సమావేశం పెట్టుకుని ఆనక్ అయిదేళ్ళ పాటు విశాఖను పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులకు వేదికగా వాడుకుని చివరికి అమరావతి మన రాజధాని అన్నారు.

అలా అన్ని విధాలుగా విశాఖను వాడేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇక వైసీపీ వచ్చాక విశాఖను పాలనా రాజధాని చేస్తామని చెప్పి చట్టం కూడా తీసుకువచ్చారు. అయితే దాని మీద టీడీపీ వారే కోర్టుకు వెళ్ళి రాజధాని రాకుండా చేశారు అని ఇటీవల జగన్ విశాఖ టూర్ లో ఆరోపించారు.

మరి దీనికి జవాబు అన్నట్లుగా చంద్రబాబు విశాఖ టూర్ లో ఏకంగా విశాఖ రాజధాని మీద తన మనసులో మాటను బయటపెట్టారు. విశాఖకు రాజధాని అవసరం లేదు అని చెబుతూనే అభివృద్ధి మాత్రమే కావాలని చంద్రబాబు తనదైన శైలిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

అంటే రాజధానిగా విశాఖను చేయబోమని సుస్పష్టంగా చెప్పేశారు అన్న మాట. ఇక విశాఖను ఆర్ధిక, పర్యాటక, ఫార్మా రాజధాని చేస్తామని పాత పడికట్టు మాటలనే వల్లించారు. గతంలో కూడా విశాఖను ఇలాంటి ఎన్నో బిరుదులు, కితాబులతో టీడీపీ నేతలు ఉప్పొగించారు. కానీ అసలైన రాజధాని మాత్రం ఊసు లేకుండా పోయింది.

మొత్తానికి విశాఖ రాజధాని అన్నదానికి టీడీపీ వ్యతిరేకం అని కూడా బాబు మాటల ద్వారా తేలిపోయిన వేళ విశాఖ జనులే దీని మీద ఆలోచన చేయాలని వైసీపీ నేతలు అంటున్నారు. మరి విశాఖ వాసులకు రాజధాని కావాలా. రాజధాని అంటేనే అభివృద్ధి. మరి అది కాకుండా వేరే అభివృద్ధి అని టీడీపీ అంటోంది. మరి ఆ బ్రహ్మ పదార్ధం ఏంటో కూడా విశాఖ వాసులే ఆలోచించుకోవాలి అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.