ఎమ్బీయస్‌ : బుడగలమ్ముతున్నారు..1

ఇటు తెలంగాణ సర్కారు, అటు ఆంధ్ర సర్కారు రెండూ ఒకేలా వున్నాయి. అది చేస్తాం, యిది చేస్తాం, ఏడాదిలో మీ జీవితాలు మార్చేస్తాం అంటూ రంగుల కలలు చూపుతున్నారు. రంగురంగుల బుడగలు చేతికి వచ్చేవరకే…

ఇటు తెలంగాణ సర్కారు, అటు ఆంధ్ర సర్కారు రెండూ ఒకేలా వున్నాయి. అది చేస్తాం, యిది చేస్తాం, ఏడాదిలో మీ జీవితాలు మార్చేస్తాం అంటూ రంగుల కలలు చూపుతున్నారు. రంగురంగుల బుడగలు చేతికి వచ్చేవరకే అందంగా వుంటాయి. కొన్న కాస్సేపటికే ఢామ్మంటాయి. వీళ్లకు చూపించే సినిమాలన్నీ కేంద్రం నుంచి నిధులపై ఆధారపడి అల్లే కథలే. అవి వస్తాయని ప్రజలకు, పెట్టుబడిదారులకు ఆశ లేదు, తొందరపడి కమిట్‌ కావడానికి జంకుతున్నారు. ముఖ్యమంత్రులిద్దరూ మాత్రం ధైర్యంగా అన్నీ సాధ్యమే అని చెప్తున్నారు. బాబు కెసియార్‌ యిద్దరూ ఒక బళ్లో చదువుకున్నవారే. మీడియాను యింప్రెస్‌ చేస్తూ కాలం గడిపేయగలరు. బాబు కెసియార్‌ కంటె సీనియర్‌ కాబట్టి ఆ సీనియారిటీ దీనిలో కూడా కనబడుతోంది. ఉమ్మడి రాష్ట్రానికి వుండే బజెటంత లెవెల్లో 13 జిల్లాల రాష్ట్రానికి ప్లాన్‌ చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఎంతో ఖర్చు పెట్టాలి. కానీ ప్రణాళిక (ప్లాన్‌) ఖర్చు ప్రణాళికేతర (నాన్‌-ప్లాన్‌) ఖర్చులో 30% వుంది. ఇంకేం డెవలప్‌మెంట్‌?

బజెట్‌ల గురించి విశేషంగా చర్చించడం అనవసరం. ఎందుకంటే వీటిలో ఏదీ ఏడాది చివరకు స్థిరంగా వుండదు.  అనుకున్నంత ఆదాయం రాదు, ఖర్చు మాత్రం ఎక్కువవుతుంది. దీనిలో పన్నులు ప్రస్తావించరు. తర్వాత వడ్డిస్తారు. సంక్షేమ పథకాలు కూడా పెంచుతూ వ్యయం పెంచుతారు. ఆదాయం పెరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. దానికి 2700 కోట్ల రూ.లనుకుంటా, అంతే యిచ్చారు. సరిపోతుందా? మళ్లీ నిన్న చంద్రబాబుగారి మ్యాప్‌లో చూస్తే 14 పోర్టులు, 14 ఎయిర్‌పోర్టులు చూపించారు. ఇలాటి బజెట్‌లతో అలాటివి ఎన్ని వస్తాయి? వచ్చినా నిలుస్తాయా? హైదరాబాదు ఎయిర్‌పోర్టుకే తగినంత రద్దీ లేదు. జిల్లాకో ఎయిర్‌పోర్టంటే అవి ఎక్కేవాళ్లు ఎవరు? 

ఇక రుణమాఫీ గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. వచ్చిన దగ్గర్నుంచి రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. మొన్న జీవో 174లో కూడా ఒక ఎనామలీ వుంది. 2013 డిసెంబరు 31 వరకు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయట. 2014 జనవరి 1 నుండి మార్చి 31 లోగా రుణాలు చెల్లించినా బుక్‌ ఎడ్జస్ట్‌మెంట్‌ చేయించుకున్నా (పాత లోను చెల్లించినట్లు, వెంటనే మళ్లీ తీసుకున్నట్లు బాంకు పుస్తకాల్లో చూపిస్తారు) ఆ రైతులకు మాత్రం రుణమాఫీ వర్తించదట. మార్చి 31 కూడా బాకీ వుంటేనే రుణమాఫీట. అంటే నిజాయితీగా తిరిగి కట్టేసినవాడికి శిక్ష అన్నమాట. ఇది సహజన్యాయానికి విరుద్ధం. మళ్లీ మారుస్తారేమో. ఇలా ఎన్నెన్ని మలుపులు తిరిగి ఫైనల్‌గా ఏది అమలు చేశారో అప్పుడు చూసి మాట్లాడుకోవచ్చు. ఈ లోపుగా చెప్పదగిన దేమిటంటే బజెట్‌లో ఎలాట్‌ చేసిన 5 వేల కోట్లు మాత్రం ఏ మూలకూ చాలవు. మళ్లీ నాలుగు రోజులకు ఏ కహానీ చెప్తారో చూదాం. 
ఇక రాజధాని గురించి కాబినెట్‌లో ప్రతీ వ్యక్తీ రోజూ మాట్లాడుతూనే వుంటాడు. కానీ దానికోసం బజెట్‌లో ఒక్క రూపాయి కూడా ఎలాట్‌ చేయలేదు. అదేమంటే కేంద్రం నిధులు యిస్తుంది కదా అంటున్నారు. కేంద్ర నిధులపై అంత ఆశ పెట్టుకుంటే ఎలా స్వామీ? విభజన సమయంలో హామీ యిచ్చిన ప్రత్యేక హోదా యిప్పటిదాకా రాలేదు. పైగా కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ ధోరణి చూస్తే రాజధానికై ప్రయివేటు స్థలం కొనడానికి మేం సుముఖం కాదు. ప్రభుత్వస్థలం వున్నచోటే రాజధాని కట్టాలంటున్నారు. అంటే దొనకొండే కదా అని ఓ విలేకరి బాబు నడిగితే 'దొనకొండలో అయితే నీ భార్య కూడా నీ వెంట రాదు, నువ్వొక్కడివే అక్కడ కాపురం పెట్టాలి. రాజధాని అంటే రాష్ట్రం మధ్యలో వుండాలి' అని సుద్దులు చెప్పారు. ఈయన వరస చూస్తే నౌకాశ్రయాలు కూడా రాష్ట్రం మధ్యలో కట్టేటట్టు వున్నాడు. ఈ రోజు దొనకొండ మూలప్రాంతం కావచ్చు, రేపు రాజధాని అంటూ వస్తే అన్ని సౌకర్యాలు కలగవా? విలేకరి భార్య పరిగెట్టుకుంటూ రాదా? 

బాబుగారు అమ్మే అన్ని బుడగల్లో అత్యంత కలర్‌ఫుల్‌ బుడగ రాజధాని బుడగ! దాన్ని చూడడానికి ప్రపంచం నుండి టూరిస్టులు వస్తారట. ఆ స్థాయిలో యీయన కడతారట. ఎత్తయిన బిల్డింగులు చూడడానికి పల్లెటూరి వాళ్లు రావాలి తప్ప ప్రపంచ పర్యాటకులు రారు. వాళ్లకు కావలసినది ప్రకృతి సౌందర్యాలు లేదా చారిత్రాత్మక ప్రదేశాలు. రాజధాని గురించి ఎవరూ మాట్లాడవద్దు అంటూనే బాబు విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని అని పదేపదే చెప్తున్నారు. నారాయణ చేతా చెప్పిస్తున్నారు. ఆ నారాయణగారు ఆ చేత్తోనే జిల్లాకో విశ్వవిద్యాలయం బుడగ కూడా అమ్ముతున్నారు. పెట్రోలియం యూనివర్శిటీ రాజమండ్రిలో పెడతామని కాస్సేపు, కాకినాడలో పెడతామని కాస్సేపు, వైజాగ్‌లో పెడతామని యింకాస్సేపు చెప్తున్నారు. ఆ బుడగను ఏ వూరి కోటాలో వేయాలో తెలియదు. రియల్‌ ఎస్టేటు యాడ్స్‌లో తప్ప యిలాటి ప్రకటనలు ఏ రాష్ట్రమంత్రులూ చేయరు. 
ప్రస్తుతం బాబు, నారాయణ రియల్‌ ఎస్టేటు వాళ్లకు ఏజంట్లగా పని చేస్తున్నారు. 'మీ ప్రకటనల వలన రేట్లు పెరుగుతున్నాయి, ఎకరా కోటి అయింది. తక్కువ కడిగితే రైతులు భూమి యివ్వరేమో' అని ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే 'వారికి 60, 40 నిష్పత్తిలో డెవలప్‌ చేసి యిస్తామని చెప్తాం' అంటున్నారీయన. రుణమాఫీ హామీ అమలు తీరు చూశాక, యీ హామీని ఎవరైనా నమ్ముతారా? అసలు ఆ ప్రపోజల్‌ పెట్టగానే యిన్నాళ్లూ రకరకాల సెజ్‌ల కింద ప్రభుత్వానికి భూమి యిచ్చిన రైతులందరూ తిరగబడరా? 'కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు, భూయజమానులకు మాత్రమే యీ ప్రత్యేక సౌకర్యం ఏల? మా దగ్గర గతంలో తీసుకున్న భూమి కూడా డెవలప్‌ చేసి మా వాటా మాకు యివ్వండి' అని మొదలెడితే..? లాంకో భూమి వక్ఫ్‌ భూమిగా చెప్తాం అంటూ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వక్ఫ్‌ భూములని చెప్తే ఆ మేరకు వక్ఫ్‌ బోర్డుకి నష్టపరిహారం యివ్వడం తమ తరం కాదని గ్రహించి! వీళ్లూ అలాగే తగ్గాల్సి వస్తుంది. బాబు, నారాయణలకు తోడు వెంకయ్యనాయుడు తయారయ్యారు. అక్కడే మెట్రో వస్తోంది అంటూ. రైల్వే బజెట్‌లో ఆ ప్రస్తావనే లేదు, రాష్ట్రంలో కొత్త రైలు మార్గాల వూసే లేదు. ఈయన మాత్రం వారానికి ఓ సారైనా మెట్రో మ్యాపులు చూపిస్తున్నారు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]