మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ అజమాయిషీలో వున్న పాలస్తీనాను బ్రిటిషువారు ఓడించాలని చూసినపుడు యూదులు సహాయపడ్డారు. యుద్ధానంతరం టర్కీ పీడ వదిలినందుకు సంతోషించినా, వారి స్థానంలో బ్రిటిషు వారు అవతరించినందుకు, యూదులను తమ దేశానికి పంపిస్తున్నందుకు 1920లో పాలస్తీనా వారు తిరగబడ్డారు. యూదులపై దాడులు చేశారు. యూదులు హగన్నా (హీబ్రూ భాషలో ఆత్మరక్షణ అని అర్థం) అనే పేరుతో ఒక మిలటరీ దళం ఏర్పాటు చేసుకుని పాలస్తీనావారితో పోరాడారు. ఆ దళం నుండి కొందరు అతివాదులు విడిపోయారు. 1922లో నానారాజ్య సమితి (నానా జాతిసమితి అని కూడా అంటారు) బ్రిటన్‌కు పాలస్తీనాపై మేన్డేటరీ అధికారాలు యిచ్చింది. ఆ పాటికి ఆ ప్రాంతపు జనాభాలో యూదుల శాతం 11, క్రైస్తవుల శాతం 9.5, తక్కినవారు ముస్లిములు, అరబ్బులు. ఆ తర్వాత 1929లోగా లక్ష మంది యూదులు తరలి వచ్చారు.
వీరందరినీ చూసి స్వదేశంలోనే మైనారిటీలుగా మారిపోతామని భయపడిన పాలస్తీనా అరబ్బులు యూదుల వలస నిలిపివేయాలనీ, తమ దేశానికి వెంటనే స్వాతంత్య్రం యివ్వాలనీ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. వారిలో తీవ్రవాదులు హింసకు పాల్పడ్డారు కూడా. యూదులు ప్రతిహింస చేశారు. అరబ్, యూదుల మధ్య ఘర్షణలు పెరిగాయి. యూదులు తమ ధనబలంతో దేశంలో గల పంటభూమిలో అధికభాగం, వాణిజ్యం, పరిశ్రమలు చేజిక్కించుకున్నారు. అంతేకాకుండా వారి అధీనంలో వున్న భూమిలో నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేసి, పచ్చదనం తెచ్చారు. ఒకే భూమి అరబ్బుల చేతిలో వుంటే ఎడారిగా, యూదుల చేతిలో సస్యశ్యామలంగా మారడం యూదుల చాకచక్యానికి, అరబ్బుల అవివేకానికి నిదర్శనం. ఇలాటి అరబ్బులు యూదుల వద్ద వ్యవసాయ కూలీలుగా, పట్టణప్రాంతాలలో కార్మికులుగా మారారు. స్వదేశీ, విదేశీ ఘర్షణకు వర్గఘర్షణ తోడైంది.
అరబ్బులు అణచడానికి బ్రిటిషువారు తమకు బాగా వచ్చిన విద్య ప్రయోగించారు. భారతదేశానికి ఈస్టిండియా కంపెనీ ద్వారా వచ్చినపుడు ఏం చేశారో అక్కడా అదే చేశారు. ఇక్కడ అందరూ భారతీయులే అయినా, ఎవరి రాజ్యం వారిదే కదా. ఫ్రెంచ్‌వాళ్లు విజయనగరం వారిని బొబ్బిలివారిపై ఉసిగొల్పినట్టుగా, కడప నవాబును ఆర్కాట్ నవాబుపై బ్రిటిషు వాళ్లు ఉసిగొల్పినట్లు, మీర్జాఫర్ అనే కుట్రదారు సహాయంతో క్లయివ్ సిరాజుద్దౌలాను ఓడించినట్లు.. పాలస్తీనా వాళ్లను అణచడానికి పొరుగు రాజ్యం వారికి ఆశ చూపించి వాడుకున్నారు. గతంలో తమకు సాయపడిన మక్కా మసీదుకు షరీఫ్‌గా వున్న హుసేన్ రెండవ కుమారుడు అబ్దుల్లాతో 'జోర్డాన్‌లో కొంతభాగం నీకిస్తాం. పాలస్తీనాను అణచివేయ్.' అన్నారు. అతను సరే అన్నాడు. రాజకీయాల్లో సాటిమతస్తుడు, సాటిదేశస్తుడు అనే భావాలే వుండవు. సోదరుణ్నే కాదు, సొంత తండ్రినీ, అల్లుణ్నీ కూడా చంపేస్తారు. ప్రపంచమంతా యిది కానవస్తుంది. బ్రిటన్ జోర్డాన్ నదికి యిరుపక్కల నున్న ప్రాంతాలను వేరు చేసి 'ట్రాన్స్ జోర్డాన్'గా రూపొందించి అబ్దుల్లాను రాజుగా చేశారు. అరబ్బులు దీన్ని ఆమోదించలేదు. అతనికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ పోయారు.
ఇంతలో హిట్లర్ జర్మనీలో బలపడసాగాడు. 1933 నాటికి ఛాన్సలర్ అయ్యాడు. అతను మొదటినుండీ యూదులకు వ్యతిరేకి. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమికి యూదులే కారకులని ఆరోపించి ప్రచారం చేసి అనేకమందిని నమ్మించిన వ్యక్తి. అప్పట్లో జర్మనీలో ముఖ్యమైన పదవులన్నీ యూదుల చేతిలోనే వుండేవి. ఫ్యాక్టరీ యజమానులూ వాళ్లే, వారిని ఎదిరించే కార్మిక నాయకులూ వాళ్లే. పెట్టుబడిదారులూ వాళ్లే, మేధావి వర్గమూ వారే, సైంటిస్టులు, ఉన్నతోద్యోగులు ఏ రంగంలో చూసినా వారిదే పై చేయి. పైగా వారు తమ వేషభాషల ద్వారా తమ ప్రత్యేకత నిలుపుకునేవారు. ఇదంతా సాధారణ జర్మన్లలో వారి పట్ల అసూయ, ఏహ్యత కలిగించింది. హిట్లర్ దాన్ని సొమ్ము చేసుకున్నాడు. ప్రపంచంలో కల్లా ఆర్యజాతులు గొప్పవని, జర్మనులు ఆర్యులు కాబట్టి గొప్పవారని అందుచేతనే ఆర్యులకు గుర్తయిన స్వస్తికాను తన పార్టీ సంకేతంగా స్వీకరిస్తున్నానని చెప్పాడు. అదే నోటితో అధమజాతులైన యూదులు, స్లావ్లు, సంచార జాతుల వంటి వారికి యీ భూమిపై బతికే హక్కు లేదని ప్రచారం చేశాడు. యూదులను వేధించడం, ఆస్తి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టి, వారిని కాన్సన్ట్రేషన్ క్యాంపులకు తరలించి వారిని అన్ని విధాలా దోపిడీ చేసి చివరకు చంపేయ నారంభించాడు. పోనుపోను నాజీలు ఆక్రమించిన దేశాలన్నిటిలో యూదుల వేధింపు కొనసాగింది. హిట్లర్ పెట్టే బాధలు సహించలేని యూదులు ఇజ్రాయేలు బాట పట్టారు. అక్కడున్న యూదులు వీరిని ఆహ్వానించసాగారు. ఈ విధంగా యూదుల సంఖ్య యిబ్బడిముబ్బడిగా పెరిగింది.
ఇక అరబ్బులు సహించలేకపోయారు. 1936లో ఆరునెలలపాటు సార్వత్రిక సమ్మె నిర్వహించి ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభింపచేశారు. గత్యంతరం లేక బ్రిటిషు ప్రభుత్వం పాలస్తీనా సమస్యకు పరిష్కారం సూచించడానికి ఒక కమిషన్ వేసింది. ఈ కమిషన్ యిచ్చిన నివేదిక ఆధారంగా 1939లో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించింది. అదే సందర్భంలో మహాత్మా గాంధీ పాలస్తీనా వారి పోరాటాన్ని సమర్థిస్తూ ఒక మాట అన్నారు – ''ఇంగ్లండ్ ఇంగ్లీషు వారికి ఎలా చెందుతుందో, ఫ్రాన్స్ ఫ్రెంచ్‌వారికి ఎలా చెందుతుందో, పాలస్తీనా కూడా అరబ్బులకు అలాగే చెందుతుంది.'' అని. ఈ విధానానికే భారత స్వాతంత్రయోధులు, కాంగ్రెసు పార్టీ చాలాకాలం కట్టుబడి వున్నాయి. ఇజ్రాయేలు 1948లో ఏర్పడినా 1950 దాకా దాన్ని గుర్తించలేదు. గుర్తించినా అధికారికంగా దౌత్యసంబంధాలు పెట్టుకోలేదు. గ్లోబలైజేషన్ పేరుతో అమెరికాకు దాసోహమయ్యాక మాత్రమే 1992లో అప్పటి ప్రధాని పి వి నరసింహారావు ఇజ్రాయేలుతో దౌత్యసంబంధాలు ప్రకటించారు. 1939 నాటి శ్వేతపత్రంలో బ్రిటన్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత పాలస్తీనాకు స్వాతంత్య్రం యిస్తామనీ, యూదుల వలసను అరికడతామని, భూములు వారి చేతిలోకి తరలిపోకుండా తగు చర్యలు తీసుకుంటామనీ హామీలు గుప్పించింది. అరబ్బులు వాటిని నమ్మలేదు. కానీ అదే సంవత్సరం రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)