తొలి సినిమాలలో యింత క్లుప్తంగా, లాఘవంగా రాసే అవకాశం రాలేదు రమణకు. ఎందుకంటే ''రక్తసంబంధం'', ''గుడిగంటలు'' తమిళం నుండి రీమేక్ చేయబడిన హెవీ డ్రామాలు. వాటికి తగ్గట్టుగా ఫ్యాక్టరీ యజమాని కార్మిక నాయకుడిని నిందించేటప్పుడు ''నువ్వు నీ జీవితానికి పునాదులూ వాళ్ల పతనానికి గోతులూ తవ్వుతున్నావు'' (రక్తసంబంధం), హీరోకి సేవ చేసే హీరోయిన్ ''పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికి, సంతోషానికి పుడుతుంది. ఇట్టె చెరిగిపోతుంది. ఈనాడు మనసారా మీకు సేవ చేయటం వల్ల కలిగే ఆనందం గాఢమైనది. అది హృదయంలో పుడుతుంది. అక్కడే వుంటుంది. పెదవులదాకా రాదు.'' (గుడిగంటలు) వంటి డైలాగులూ రాశారు. ఆయన స్వతంత్ర రచనలు ''మూగమనసులు'', ''దాగుడు మూతలు'' లో కొన్ని ఎమోషనల్ సీన్లు వున్నా, డైలాగులు యిలా హెవీగా వుండక పోగా, అచ్చమైన తెలుగు పలుకుబడులున్నాయి.
ఇంకో మూడేళ్లకే ఆయన నిర్మాత అయిపోయి సినిమాలు తీయనారంభించారు. ఆ తర్వాత రీమేక్స్ తీసినా, వాటిని తెలుగు వాతావరణానికి అనువుగా మలచుకున్నారు. సినిమా అంటే యిలా వుండాలి, యిన్ని కామెడీ సీన్లుండాలి, యిన్ని హెవీ డైలాగులుండాలి, యిన్ని పాటలుండాలి అనే ఫార్ములాను ఆయన అనుసరించి రాయలేదు. ''మంచి స్క్రిప్టు అంటే..?'' అనే వ్యాసంలో ఆయన ''కథ, సినిమా, నవల – ఏ మంచి రచనకైనా గ్రామర్ అవసరం లేదు. ఆ మంచి రచనని గ్రామర్ అనుసరిస్తుంది. నేనేదీ కొలబద్దలు పెట్టుకుని రాయను. 'ఇది యిలా రాయాలి' అనుకుంటే అలాగే రాశాను. అది రైటో, తప్పో అన్నది ఆలోచించలేదు. తప్పయినవి ఫెయిలవుతూంటాయి.'' అన్నారు.
హీరో హీరోయిన్లకు మంచి గంభీరమైన డైలాగులు వుండాలి, విలన్ గట్టిగా నవ్వితే చాలు, కమెడియన్‌కు ఊతపదం తప్పక వుండాలి వంటి ఫార్ములాలో వుండేవారు, ఆ నాటి రచయితలు. అసలు కామెడీ ట్రాక్ రాయడం నామోషీగా ఫీలయ్యేవారు అగ్రశ్రేణి రచయితలు. రమణకు సహాయకులు ఎవరూ లేరు, సహరచయితలూ లేరు. (''మూగమనసులు''లో ఆత్రేయ, ''సంపూర్ణ రామాయణం''లో ఆరుద్ర తప్ప) సినిమాలో ఘట్టాలన్నీ ఆయనే రాసేవారు. అందువలన సినిమా అంతా ఒకే 'ఫ్లో'లో సాగేది. అవసరాన్ని బట్టే పాత్రలకు సంభాషణలు అమిరేవి. ''ముత్యాలముగ్గు''లో హీరోహీరోయిన్లకు సంభాషణలు తక్కువ. వాళ్ల ప్రేమఘట్టాలన్నీ వెనక్కాల మేండలిన్ వాయిద్యంతో కానిచ్చేశారు. డైలాగుల పరంగా హీరో – విలనే. అతను చాలా మాట్లాడాడు. ఆ మాట్లాడినవి తెలుగునాట నాటుకుపోయాయి.
కాంట్రాక్టర్ పాత్రతో ఓ క్లయింటు వచ్చి – కాలు తీసేయడానికౖౖెతే ఎంత? చేతికైతే ఎంత? దానికీ దీనికీ కలిపి ఎంత? దీనిలో నా కమిషన్ ఎంత?- అంటూ ఆడిన బేరం యిప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇవన్నీ రికార్డుల రూపంలో బయటకు వచ్చి రికార్డు సేల్సు రిజిస్టర్ చేశాయి. తమాషా ఏమిటంటే యిన్ని మాటలాడిన కంట్రాక్టరు పాత్ర కూడా ''ఆకాశంలో మర్డరు జరిగినట్టు లేదూ'' అనే ఓ విజువల్‌తో ప్రారంభమవుతుంది. అదీ రమణ సన్నివేశాన్ని వూహించి, కల్పించి, సంభాషణలు కూర్చే తీరు.
నిజానికి ముళ్లపూడి తెలుగునాట చిరంజీవులుగా నిలిచే అనేక పాత్రలను సృష్టించారు. అప్పులు చేసే అప్పారావు, ఆబాల'గోపాలా'న్ని అలరించే అల్లరి పిడుగు బుడుగు, నూతన దంపతులు రాధాగోపాళం, అందమైన తెలుగమ్మాయి రెండుజెళ్ల సీత, సినిమాపిచ్చి వున్న వరహాలరాజు – వీళ్లందరినీ సాహిత్యంలో ప్రయోగించి చూసి, తర్వాత సినిమారంగానికి లాక్కుని వచ్చేశారు. వాళ్లెంత పాప్యులరై పోయారంటే ఆ పేర్లతో సినిమాలు కూడా వచ్చేశాయి. వీళ్లందరితో బాటు సినిమాలకి వచ్చాక సృష్టించిన కొత్తపాత్రలున్నాయి – తీ.తా.(తీసేసిన తాసిల్దారు), కనక్షన్ కన్నప్ప, కాంట్రాక్టరు, 'తుత్తి' గోపాలకృష్ణ, నైతాస్ (రాజాధిరాజు), 'పెట్టుగొప్ప' జెబి (అందాలరాముడు) వీళ్లందరికీ తమదైన వ్యక్తిత్వం వుంది, తమకంటూ 'పలుకు'బడి వుంది. ఒక్క డైలాగు వినగానే అది ఏ పాత్ర పరంగా చెప్పారో చెప్పేయగల విధంగా సంభాషణలు రాశారు ముళ్లపూడి. ''మిస్టర్ పెళ్లాం''లో బాస్‌ను ఉబ్బేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగులతో నవ్విస్తే, ''ముత్యాలముగ్గు''లో భజంత్రీలు డైలాగులు లేకుండా కూడా నవ్వించారు. అందుకే రమణ 'రాయని భాస్కరుడి'గా కూడా రాణించారు.
ముళ్లపూడి డైలాగులలో మేలిముత్యాలంటూ రాయడం మొదలుపెడితే పది పేజీలు పడతాయి. నాకు విపరీతంగా నచ్చిన డైలాగులు నాలుగైదు మాత్రం చెప్పి సరిపెడతాను –
''కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదని సంతోషించు'' (గోరంతదీపం)
''సిఫార్సులతో కాపురాలు చక్కబడవు, బతుకులు బాగుపడవు.'' (ముత్యాలముగ్గు)
''డబ్బు చేసి 'పైకి' వెళ్లిపోయాడు'' (మంత్రిగారి వియ్యంకుడు)
''చేత్తో చిన్న బెడ్డ ఏస్తే ఆ బెడ్డ సెరువు చివరకంటా పోద్ది. సూడూ మావా, మనద్దరం సెర్లో నీరంటాళ్ళం ఒక్క బొట్టు కదిలితే నీరంతా కదులుద్ది. మంచి మడిసిని కొడితే ఊరంతా తగులుద్ది. నిన్నుకాదని ఊరు బతకలేదు. ఊరుని కాదని నువ్వు పోలేవు. ఎంత దూరం పోయిన సెర్లో సాపల్లే సెర్లోనే… యాడికి పోయిన నువ్వు మడిసివే. మంచోళ్ళు సెడ్డోళ్ళు అంటూ విడిగా వుండరు మావాఁ, మంచి సెడ్డ కలిస్తేనే మడిసి.'' (సాక్షి)
''శివుడి మూడోకంట భగ్గుమనే మంటా వుంది, ఓదార్చే వెన్నెలా వుంది. మనం తెలుసుకోవాలి. అసలూ మూడోకన్ను శివుడికే కాదు, జీవులందరికీ వుంది. మూడో కన్నంటే లోవెలుగు. మన లోపలి చీకట్లో వెలిగే చిన్నదీపం. నీ తప్పుని నువ్వు తెలుసుకో – ఎదుటివాడి గొప్పని ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే – మూడోకన్ను. ఆ కంటిసిరి నీ కండసిరి కన్న గొప్పది'.'' (భక్తకన్నప్ప)
రమణగారు వెళ్లిపోయారు. కానీ ఆయన సంభాషణలు మాత్రం జనంలో నిల్చిపోయాయి. కథారచనలో ఆయనను అనుకరించిన వారు కనబడతారు. కానీ సినీసంభాషణా రచనలో ఆయన వారసులు కనబడటం లేదు. ఆయన సంభాషణల్లో కనబడే ఆ చమత్కారం, లయ, సొగసు, నేటివిటీ, మెలోడ్రామా అనిపించని గాంభీర్యం – యితరులెవరూ యింకా పట్టుకోలేక పోయారు.
మూడోవంతు తీసేశా : మళ్లీ సాహితీసర్వస్వానికి వస్తాను. ''అనువాద రమణీయం'' చేసేనాటికి నాకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ''80 రోజుల్లో భూ ప్రదక్షిణం'' పుస్తకానికి మ్యాప్‌లు, చిత్రాలు జోడించాను. బాపుగారు కొన్ని బొమ్మలు వేసి పెట్టారు. ''పిటి 109'' పుస్తకం రెండో ప్రపంచ యుద్ధకాలంలో కెన్నెడీ సాహసం గురించిన కథ. ఈనాటి పాఠకులకు యుద్ధపుస్తకాలు చదివే అలవాటూ లేదు, కెనెడీ అంటే ఎవరో తెలియనూ తెలియదు. అందువలన ఆ పుస్తకంలో మూడోవంతు తీసేశాను. ఓడతో కెనెడీ బోటు గుద్దుకునే ఘట్టాన్ని ముందుకు తెచ్చి, కెనెడీ నావీలో చేరినప్పటి సంగతులను ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పినట్టు చేశాను. రమణగారు దీన్ని పూర్తిగా ఆమోదించారు. అదీ ఆయన ఔన్నత్యం. దీనిలో కూడా ఫోటోలు, మ్యాప్‌లు ఎన్నో పెట్టాను. పుస్తకం అందంగా తయారైంది. అదీ పునర్ముద్రణకు వచ్చింది.
ఈ పుస్తకాలు తయారవుతున్నప్పుడల్లా రమణగారు ఎప్పటికప్పుడు యింత శ్రమ అవసరమా? అంటూండేవారు. ''వచ్చే శతాబ్దికి మీరు వుండరు, నేనూ వుండను. కానీ యీ పుస్తకాలుంటాయి. మీ సాహితీసేవను తెలుగువాళ్లు యిప్పట్లో మరువజాలరు. అన్నీ ఒకచోట లభ్యం చేస్తే వారికి ఎంతో మేలు చేసినవాళ్లవుతాం. వాళ్లకోసమే యీ శ్రమంతా..'' అనేవాణ్ని.
సినీరమణీయం రెండవ భాగం 2004 సెప్టెంబరులో నాగేశ్వరరావుగారి పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. అప్పుడు రమణగారు, బాపుగారు మా కొత్త యిల్లు చూడడానికి వచ్చారు. రమణగారు పూజామందిరంలో దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ చటుక్కున ఒక తులం బంగారం కాయిన్, ఒక తులం వెండి కాయిన్ మందిరంలో పెట్టేశారు. ''అదేమిటండీ'' అంటూ వుంటే ''శ్రీదేవి యిమ్మంది.'' అనేశారు. ఇలాటివి రమణగారి టచ్ అని అనాలి. ఎవరైనా సద్విమర్శ చేస్తే బొకే పంపండం.. యిలాటివి. తెలుగు యూనివర్శిటీవారు 2010 అక్టోబరులో 'హాస్యరచన'కై కీర్తి పురస్కారం యిచ్చారు. అదే వేదికపై రమణగారు గురువుగారిగా భావించే ఎమ్‌ఎస్ శర్మగారికి 'పత్రికా రచన'కై కీర్తి పురస్కారం యిచ్చారు. ఇద్దరికీ వాళ్లబ్బాయి వరా చేత బట్టలు పంపించారు. ఈ జెస్చర్స్ ఎల్లకాలం మనసులో వుండిపోతాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)