మరింత అభిమాని నయ్యాను : నిజానికి ఆంధ్రపత్రికలో పని చేస్తూండగా 7, 8 ఏళ్లల్లో రమణగారు చేపట్టినన్ని ప్రక్రియలు వేరెవరూ చేపట్టలేరు. ఎన్నో అంశాలపై అద్భుతంగా రాశారు. అప్పటిదాకా కథలూ, లెక్చర్లు మాత్రమే చదివి వున్న నేను యీయన విస్తృతి చూసి తెల్లబోయాను. ఒకే వారంలో రకరకాల రచనలు చేసేవారు. నిజానికి 1953 నుండి ఒక 8 ఏళ్ల కాలం ఆయన జీవితంలో స్వర్ణయుగం. ఆయన రచనలకు సరైన యిలస్ట్రేషన్స్ లేకుండా వేసేరేమిటి? అని ఒకసారి నండూరి రామమోహనరావుగార్ని అడిగాను. ''ఏం చేయమంటారండీ, ఆఖరి నిమిషందాకా యిచ్చేవాడు కాదు. చిన్న చిన్న కాగితాలపై రాసుకుని జేబులో పెట్టుకుని తిరిగేవాడు. ఇస్యూ క్లోజ్ చేసేస్తున్నామనగా అప్పుడు కూర్చుని రాసి యిచ్చేవాడు. బొమ్మలు వేయించడానికి టైము వుండేది కాదు.'' అని వాపోయారాయన.
మణగారిలో అలాటి అరాచకత్వం వుంది. ఓ పట్టాన చేయకపోవడం, చేసినపుడు ఉధృతంగా చేయడం! క్రమపద్ధతిలో చేయడం ఆయనకు గిట్టదు. మళ్లీ క్రమశిక్షణ లేనివారా? అబ్బే, గొప్ప ఆర్గనైజర్. రకరకాల వ్యక్తులతో తగినవిధంగా మాట్లాడి, అన్నీ పెర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగల దిట్ట. ఆయనలోనే పాలకుడున్నాడు, తిరుగుబాటుదారుడూ వున్నాడు.
రమణగారి ఆనాటి ఆ వ్యాసాలు చదివి (కదంబరమణీయం, సినీరమణీయంలో చదవవచ్చు) యిన్ని విషయాలు ఎలా సేకరించారని అబ్బురపడుతూ అడిగేవాణ్ని. తర్వాతి కాలంలో పుస్తకాలు, లైబ్రరీలు, మ్యాగజైన్లూ విస్తృతంగా వచ్చాయి. ఇప్పుడైతే గూగుల్ వచ్చేసింది. ఇంట్లో కూర్చుని కీ బోర్డ్ నొక్కితే సమస్తం తెలుస్తాయి. కానీ ఆ రోజుల్లో అమెరికన్ జాజ్ సంగీతం గురించి, జడలూ – వాటి తీరులూ గురించి.. యిలాటి విభిన్న విషయాలపై ఎలా రాసేవారని అడిగితే.. ఫలానా వారిని వెళ్లి అడిగి రాసుకున్నాను. సినిమాలకు పుస్తకం పట్టుకెళ్లి చీకట్లోనే పెన్సిల్‌తో నోట్ చేసుకునేవాణ్ని, అమెరికన్ లైబ్రరీకి వెళ్లేవాణ్ని.. అంటూ చెప్పేవారు. రమణగారుగాని, బాపు గారుగాని యింతటి వాళ్లయ్యారంటే కారణం – వాళ్ల జ్ఞానతృష్ణ, పఠనాసక్తి, నగరవాసం, అనుకూలించిన పరిస్థితులు. తినడానికి తిండి లేని రోజుల్లో కూడా రమణగారు ''లైఫ్'', ''టైమ్'' పత్రికలకు చందా కట్టి తెప్పించుకునేవారిని సీతారాముడు గారు రాశారు. రెండో ప్రపంచయుద్ధం గురించి కక్షుణ్ణంగా చెప్పగలిగేవారన్నారు. దేనికోసం ఆయన తెలుసుకున్నట్టు? ఆయన కథల్లో గాని, సినిమాల్లో కానీ థీమ్‌గా వుపయోగించలేదే! చివరిదాకా ఆయన చదువుతూనే వున్నారు. పెద్ద పెద్ద రచయితల ఇంగ్లీషు పుస్తకాలే కాదు, సాధారణ మ్యాగజైన్లలో కొత్త రచయితలు రాసిన కథలు కూడా చదివేవారు. బాగుంటే పదిమందికీ చెప్పేవారు. సీరియస్, ఆధ్యాత్మిక పుస్తకాల నుండి డర్టీ జోక్స్ పుస్తకాల వరకూ అన్నీ చదివేవారు. ఇది ఆయనను నిత్యనూతనంగా వుంచింది.
మద్రాసులో వుండడం వలన మంచి ప్రపంచ స్థాయి సాహిత్యానికి, సినిమాలకు బాపు, రమణలు ఎక్స్‌పోజ్ అయ్యారు. అది వాళ్లను యితరులకంటె ఎక్కువ స్థాయిలో నిలిపింది. వాళ్ల సమకాలీకులు చాలామంది పల్లెటూళ్లల్లో, మహా అయితే చిన్న పట్టణాల్లో వుండే రోజుల్లో వీళ్లకు జాతీయ, అంతర్జాతీయ సినిమాలు యితర కళారూపాలు చూసే అవకాశం లభించింది. రమణ రాసిన ''ఆకలీ ఆనందరావు'' కథ నగర జీవితం గురించి వెలువడిన తొలి కథ కాబోలు. ఉదాత్తమైన నేపథ్యం గల బాపుతో స్నేహం, ఆయన టేస్టు రమణకు ఎంతో లాభించింది. ఇద్దరూ కలిసి కళను ఆస్వాదించారు, ఆరాధించారు. బాపుకి చిత్రకళ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన వ్యక్తులతో పరిచయం కలిగింది. ఆయన వాళ్లందరినీ రమణకు పరిచయం చేశారు. నగరవాసం వలన రమణకు తెగింపు, చొరవ చిన్నప్పటినుండే అలవడ్డాయి. వాళ్ల అమ్మగారి స్థయిర్యం చూసి కూడా ప్రేరణ పొందారు. ఇవన్నీ కలిపి రమణను ఒక ప్రత్యేక వ్యక్తిగా రూపు దిద్దాయి. ఒక స్థిరమైన కుటుంబనేపథ్యంనుండి వచ్చిన బాపుకి రమణ, ద రెబెల్ ఒక అద్భుతవ్యక్తిగా తోచి, వీరాభిమానిగా మారిపోయారు. బాపు తండ్రిగారి మరణం తర్వాత వారి కుటుంబానికి రమణ అనుకోకుండా 'పెద్దన్నయ్య' అయిపోయారు. అది ఆయనకు ఒక రకమైన పెద్దమనిషి తరహాని, స్థిరత్వాన్ని తెచ్చిపెట్టింది.
కథానువాదాల పేరుతో రమణగారిని తరచు కలిసే అవకాశం కలగడంతో యివన్నీ నాకు బోధపడసాగాయి. రచయితగానే కాక, వ్యక్తిగా కూడా ఆయన ఔన్నత్యం బోధపడసాగింది.
అనువాదాల జోరు :ఈ లోపున ఆయన కథల అనువాదం కొనసాగుతూ పోయింది. అప్పట్లో ''ఇండియన్ ఎక్స్‌ప్రెస్'' తమిళనాడు ఎడిషన్‌వారు ప్రతీ శనివారం ఇంగ్లీషు కథలు వేసేవారు. కొన్ని స్వతంత్ర కథలు, కొన్ని తమిళ కథల అనువాదాలు. నేను స్వతంత్రంగా రాసిన కథలు కొన్ని పడ్డాయి. దానితో నాకు ధైర్యం వచ్చింది. కొన్ని రోజులకు తెలుగులో సైకో-ఎనలిటికల్ కథలు ఇంగ్లీషులోకి అనువాదం ఎందుకు చేయకూడదు? అనిపించి వరసగా చేసుకుంటూ పోయాను. రచయితల అనుమతి దొరక్క అవేమీ అచ్చు కాలేదు. వాకాటి పాండురంగారావు గారి ఛాలెంజ్ తర్వాత రమణగారి రచనలు అనువాదం ఎందుకు చేయకూడదు? అనుకుని మొదలుపెట్టాను. మొదటగా చేసినది ''ఛాయలు''. అది ఆయనకు నచ్చి నో-అబ్జక్షన్ సర్టిఫికెట్టు యివ్వడంతో నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే రమణగారికి ఇంగ్లీషు భాషపై మంచి పట్టు వుంది. పైగా అనువాదంలోని మెళకువలు, పరిమితులు అన్నీ బాగా తెలుసు. స్వయంగా మంచి అనువాదకుడాయన.
తెలుగు చదవడం రానివారి కోసం రమణను పరిచయం చేయాలనే కోరికతో ఒక శీర్షికగా నడపడానికి కొన్ని రచనలను తీసుకుని అనువాదం చేశాను. కథల్లో – ''ఆకలీ – ఆనందరావూ'', గిరీశం లెక్చర్లలో ''బైయింగ్ బుక్స్?'', పెద్ద పుస్తకాల్లోంచి కొన్ని పోర్షన్లు చేశాను. ''ఇద్దరమ్మాయిలు- ముగ్గురబ్బాయిలు''లో సూర్యోదయ సన్నివేశాన్ని, ''ఋణానందలహరి''లో తెల్లవారే ఘట్టాన్ని, ''విక్రమార్కుడి మార్కు సింహాసనం''లో వరహాలరాజు సినిమాల్లో చేరదామని మద్రాసుకి రైలెక్కే ఘట్టాన్ని, ''రాధాగోపాలం''లో 'రాధమ్మ బాకీ' కథ, ''రాజకీయ బేతాళ పంచవింశతిక''లో 'దాచింపాడు రోడ్డు కథ'… యిలా. సినిమా వ్యాసాల్లో మార్క్స్ బ్రదర్స్ గురించి, ''నౌషాద్'' గురించి రాసినవి అనువదించాను. ''నౌషాద్''ది చేసేటప్పుడు ఒక వాక్యం చాలా యిబ్బంది పెట్టేసింది. 'ఫ్లూటూ క్లారినెట్ కలిపీ, సితార్ మాండలిన్‌లు కలిపీ అందమైన బహువ్రీహి సమాసాలు సృష్టించారు.' అని రాశారు. బహువ్రీహి సమాసాన్ని ఇంగ్లీషులో ఎలా చెప్తాం? బాగా ఆలోచించి 'రెండు కలిసి పూర్తిగా భిన్నమైనదానిగా తయారవడమే బహువ్రీహి సమాస లక్షణం' అనే అంశంతో కెమికల్ కాంపౌండ్‌తో పోలుస్తూ అనువదించి రమణగారికి పోస్టులో పంపాను.
విఎకె రంగారావుగారు 'అమెరికన్ మ్యూజికల్స్' గురించి సోదాహరణ ప్రసంగ కార్యక్రమంలో రమణగారు కలిశారు. ''మీరు కెమికల్ కాంపౌండ్ అని రాశారు. వాటర్ కెమికల్ కాంపౌండే కదా, హైడ్రోజన్, ఆక్సిజన్ రెండూ కలిస్తే నీరు తయారవుతుంది. కానీ నీటిలో రెండింటి లక్షణాలూ వుండవు. అంతేగా!'' అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత వయసు వచ్చినా ఎప్పుడో చిన్నపుడు చదువుకున్న సైన్సు విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నారే అని. 'పోలిక బాగుంది, వ్యాసంలో ఉపమానాలు చాలా వున్నాయి, ఇంగ్లీషులోకి బాగా తెచ్చారు' అని మెచ్చుకున్నారు. ఇక పొంగిపోయి ఆ వ్యాసాన్ని బొంబాయిలో నౌషాద్‌గారికి పంపేశాను. ఆయన కక్షుణ్ణంగా చదివి, చిన్నచిన్న తప్పులు సవరించి లేఖ రాశారు. అది చూసి రమణగారూ సంతోషించారు. ఇన్ని చేశాం కదాని ''బుడుగు''లో 'అల్లావుద్దీన్ ఖద' కూడా అనువాదం చేసి చూపించాను. బుడుగు అవసరంగా వత్తులు యిచ్చినట్టు సూచించడానికి కాపిటల్స్ వాడి అవస్థ పడ్డాను. ఏం చేసినా రమణగారికి నచ్చలేదు. ''మీరు ట్రాన్స్‌లేట్ చేస్తే ఢోకా వుండదు కానీ బుడుగు కష్టం. వదిలేయండి. పెద్దవాళ్లతో పోల్చుకుంటున్నానని కాదు కానీ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి రచనల్లాగే బుడుగు కూడా అనువాదానికి కొరుకుడు పడదు.'' అన్నారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)