Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 1

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 1

నేను చాలా రోజులుగా కష్టపడి చేస్తూ తయారు చేస్తూ వచ్చిన ''కొసరు కొమ్మచ్చి'' పుస్తకం తయారై మార్కెట్లోకి వచ్చింది. ప్రింటు వెర్షన్‌ నవోదయా, హైదరాబాదు వారు పంపిణీ చేస్తూండగా, ఈ-బుక్స్‌, ఆన్‌లైన్‌ సేల్స్‌ కినిగె డాట్‌కామ్‌ వాళ్లు చూస్తున్నారు. ఈ పుస్తకం ఉద్దేశం ఏమిటో, దానికి నేను పడిన శ్రమ ఏమిటో పాఠకులతో పంచుకోవాలని, యీ క్రమంలో రమణగారి సాహిత్యం, వ్యక్తిత్వం గురించి తెలియనివారికి కాస్త పరిచయం చేద్దామని ఉద్దేశం. ముళ్లపూడి వెంకటరమణగారి ఆత్మకథ ''కోతి కొమ్మచ్చి'' స్వాతి వీక్లీలో సీరియల్‌గా వచ్చి సంచలనం సృష్టించింది. దాన్ని మేం ''హాసం'' బ్యానర్‌లో మూడు భాగాలుగా ప్రచురించాం. అంత రాసినా రమణగారు కొన్ని విషయాలు వదిలేశారు. (కారణాలేమిటో నా వ్యాసంలో రాశాను). వాటి గురించి రమణగారు పోయిన తర్వాత వాళ్లమ్మాయి అనూరాధ ''స్వాతి'' వీక్లీకై 'నాన్నా మామా మేము అను తోకకొమ్మచ్చి' అనే వ్యాసంలో సరదాగా ప్రస్తావించారు - 

''నేను... ముళ్లపూడిగారి అమ్మాయిని. నాన్న ఒక పుస్తకం రాశారు. ''కోతికొమ్మచ్చి''. 

దానికి రెండు తోక కొమ్మచ్చిలు కూడా రాశారు. దాంట్లో నాన్న, మామ - అదే బాపుగారు- తీసిన సినిమాలు, కలిసిన నేస్తాలు, చేసిన అల్లర్లు, పాడిన రాగాలు... వీటి గురించి చాలానే రాశారు.

ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, సంజీవరెడ్డి, పి.వి.ఎన్‌.లాంటి పెద్దవారి దగ్గర్నించి, రోడ్‌సైడ్‌ బుక్‌సెల్లర్స్‌, లైట్‌బాయ్స్‌, వంటాళ్లు... అందరికీ స్పాట్‌లైట్‌ ఇచ్చారు. 

''మరి మాకో?'' అని మేము అడిగితే ''... అబ్బే, మన ఫ్యామిలీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సింది యేముందమ్మా... అందరి ఫ్యామిలీ లాగానే మనం కూడా..''

కావొచ్చు, కాని... మాలాంటి గ్రేట్‌ ఫెల్లోస్‌ గురించి కూడా చెప్తే ఇంకా బాగుంటుందేమో? అని అడిగాను...

రాస్తానమ్మా... ఇదిగో రాస్తున్నా... రాయాలా..! అని అడుగుతూనే వెళ్లిపోయారు... చెప్పకుండా మాయమైపోయారు... 

రాముడి పనిపూర్తిచేశారుకాని... మరి నా పనో?

లోగడికి విష్ణుమూర్తి కల్లో కనిపించి, ఏం వరం కావాలో కోరుకోమంటే, మా నాన్నని ఓ రచయితని చేసెయ్‌, మిగతాది నేను చూస్కుంటా అన్నాను.

.... మరి, యేం చూస్కున్నా?? ఆయనని ఎంత వేడుకున్నా, మా ఫ్యామిలీ గురించి ఒక్క ముక్క రాయలేదు కదా... అందుకనే, తెగించేసి, నేను తెలుగూస్‌ అయినా కూడా, తెలుగులో కొన్ని నిజాలే రాసేయాలని సాహసించాను...'' యిలా మొదలుపెట్టి బాపురమణల కుటుంబ విషయాలు కొన్ని రాశారు. 

xxxxxx

మా హైదరాబాదు హాసం క్లబ్‌ 100 వ సమావేశం 2012 జూన్‌ 28 న జరిగింది. ఆ రోజు రమణగారి జయంతి. ఆ సందర్భంగా శ్రీ బివియస్‌ రామారావుగార్ని ('సీతారాముడు') గారిని సన్మానించాం. ఆయన రమణగారికి హైస్కూలు రోజుల్నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోను పాలుపంచుకున్నారు. మంచి రచయిత, సినిమా కళపై అవగాహన కలిగినవారు. ఆ సభలో మా వరప్రసాద్‌ (శాంతా బయోటెక్నిక్స్‌, 'హాసం')  ప్రసంగం యిలా సాగింది - 

''........కోతికొమ్మచ్చి'' సీరియల్‌ అర్ధాంతరంగా ముగిసిపోయిందని బాధపడిన పాఠకుల్లో నేనూ ఒకణ్ని. కంటిన్యూ చేయమని ఆయన్ని బతిమాలి, బామాలి, కోప్పడి, బుంగమూతి పెట్టి.. నానా రకాలుగా ఒత్తిడి చేశాం. ఆయన పోవడానికి మూడు రోజుల క్రితమే ఫోన్‌ చేసి అడిగాను - ''చెప్పాల్సినదెంతో వుంది కదా, చెప్పరేం..?, మీ ఆత్మకథలో మా గురించి కూడా చెప్తారని ఎదురుచూస్తున్నాం'' అని కూడా అని చూశాను.  

''మీ మీద ప్రేమ గుండెల్లో దాచుకున్నాను. దాన్ని కాగితంపై కక్కడానికి ఓపిక లేదు'' అన్నారు.

బద్ధకిస్తున్నారేమో అనుకున్నాను. కానీ నిష్క్రమించాక నిజమే అని తెలిసింది... అలసిపోయారు. ఇక చాలనుకున్నారు. 

కానీ అది మనకు చాలలేదు. నా సంగతి వదిలేయండి, ఆయన సంగతులే ఆయన చాలా చెప్పలేదు. సినిమాలు తగ్గిన థలో ''సాహితీసర్వస్వం'' మార్కెట్‌లోకి వచ్చి అదరగొట్టింది. ''భాగవతం'' టీవీ సీరియల్‌ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన క్రియేటివిటీ తగ్గలేదు. ప్రజాదరణ కోల్పోలేదు. ఇవన్నీ చెప్పాలి కదా అని మన ఘోష. అప్పుడే కథానాయకుడికి న్యాయం చేసినట్టవుతుంది.

అందుకే ''కోతికొమ్మచ్చి''లో ఆయన వదిలేసిన విషయాలతో ''కొసరు కొమ్మచ్చి'' తయారుచేయాలన్న ఊహ వచ్చింది. ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి, కుమారుడు వరా ముళ్లపూడి, కుమార్తె అనూరాధ రాయాలని...ఆయన సాహిత్యం గురించి ఎమ్బీయస్‌ ప్రసాద్‌ రాయాలని... ఇక ఆయన సినిమాల గురించి, టీవీ సీరియల్స్‌ గురించి రాయమని సీతారాముడుగారిని కోరాం. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాక రమణ రచన చేసిన సినిమాలన్నిటినీ చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు - అన్నిటితోనూ రచన చేస్తూ వాటిని తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించమని కోరాం. ఆ పుస్తకం త్వరలోనే విడుదల అవుతుంది.....'' 

xxxxxxx

''కొసరు కొమ్మచ్చి''కి బీజం అలా పడింది. రమణగారి భార్య శ్రీదేవి గారు నండూరి రామమోహనరావుగారి సోదరి. విచక్షణ గల పాఠకురాలు. ఆవిడ తన జ్ఞాపకాలను బ్లాగ్‌లో రాస్తున్నారు. వరా ముళ్లపూడి సినీదర్శకుడు. అనూరాధ కాపీ రైటర్‌. భర్తతో కలిసి అమెరికాలో యాడ్‌ ఏజన్సీ నడుపుతారు. సీతారాముడు గారు ఎంత మంచి రచయిత అంటే రమణగారు ఆయన పుస్తకానికి ముందుమాట రాస్తూ 'వాణ్ని చూస్తే నాకు కుళ్లు' అని రాశారు. వీరందరితో బాటు నేనూ ఓ వ్యాసం రాశాను. సమాచారం సేకరించడం కంటె ఫోటోలు సేకరణ, అమరిక పెద్ద యజ్ఞమే అయింది. కోతికొమ్మచ్చిలో వచ్చిన ఫోటోలు రిపీట్‌ చేయకూడదన్న పట్టుదలతో నేను బాపురమణల ఫ్యామిలీ ఫోటోలు వాళ్లను సతాయించి, సతాయించి సంపాదించాను. మన గురించి వద్దండి అంటారుగా వాళ్లు. అందుకని సతాయింపు అన్నమాట. అవి చూస్తే వాళ్ల కుటుంబాలు ఎలా పెనవేసుకుని పోయాయో వేరే ఎవరూ చెప్పనక్కరలేదన్నమాట. 

ఇక పాత విజయచిత్రలు, సినిమారంగంలు సంపాదించి, వాటిలోని సినిమా స్టిల్స్‌ సేకరించి వేశాను. ''బంగారు పిచిక'' సినిమాకు మొదట్లో ''స్వయంవరం'' అనే పేరు పెట్టారన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. ఇప్పటిదాకా ఎవరూ ప్రస్తావించలేదు. అలాగే ''ఇంటి గౌరవం'' సినిమా ఒరిజినల్‌ సినిమా పేరు.. యిలా చాలా, చాలా తెలిసి వచ్చాయి.  అంతా చూసి బాపుగారు మెచ్చుకుని 'మేమూ మా సినిమాలూ' అని ముందుమాట చేర్చారు. అన్ని ఆర్టికల్స్‌కు డ్రాయింగ్స్‌ వేసిచ్చారు. నాబోటి అభిమానుల కడుపు నిండేలా పుస్తకాన్ని చాలా శ్రమ కోర్చి తయారుచేశాను. సీతారాముడు గారు రమణ స్కూలు రోజుల నుండి రాసుకుని వచ్చారు. అప్పట్లోనే ఆయన నిర్వహణాదక్షత ఎలా వుండేదో మనకు తెలుస్తుంది. అంతటితో ఆగలేదు, రమణగారి సినిమాల్లో వున్న లోపాలు, అవి ఎత్తి చూపితే రమణగారికి కోపం రావడాలు.. అన్నీ రాశారాయన. ఇంతకంటె ఎక్కువ చెపితే పుస్తకం అమ్మకాలు దెబ్బ తింటాయి కాబట్టి చెప్పను. 

అయితే రమణగారి సాహిత్యం గురించి, నాతో ఆయన పరిచయం గురించి రాసినది మాత్రం పాఠకులతో పంచుకుంటాను. ఎందుకంటే యీ పుస్తకం చదివినా చదవకపోయినా రమణగారి సాహిత్యం మాత్రం చదివి తీరాల్సిందే. ఎందుకు చదివి తీరాలో, వాటిలో ఏముందో యీ వ్యాసం చెపుతుంది. 2011 ఫిబ్రవరిలో రమణగారు పోయినప్పుడు 'ఒక అభిమాని ప్రస్థానం' పేర నేను నివాళి రాశాను. అది చదివిన పాఠకులు 5 వ భాగం వరకు వదిలేయవచ్చు. అలాగే సినిమా డైలాగుల రచనలో రమణ శైలి గురించి నేను రాసిన వ్యాసం చదివినవారు మధ్యలో 13 వ భాగం వదిలేయవచ్చు. మొత్తం 16 భాగాలు చదివితే మాత్రం రమణగారి సాహిత్యం, వ్యక్తిత్వం రెండూ అర్థమవుతాయి. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?