మొనగాడు కావలెను

చంద్రబాబు తన రెండు కళ్ల సిద్దాంతం వీడరు..వైఎస్ జగన్ కెసిఆర్ తో లోపాయికారీ స్నేహం వదులుకోరు…లోక్ సత్తా సత్తా అంతంతమాత్రం..సీమాంధ్రుల కోసం తెలంగాణ లో పోరాడే నాయకులు వామపక్షాలలో లేరు..మజ్లిస్ కు అంతటి విశాల…

చంద్రబాబు తన రెండు కళ్ల సిద్దాంతం వీడరు..వైఎస్ జగన్ కెసిఆర్ తో లోపాయికారీ స్నేహం వదులుకోరు…లోక్ సత్తా సత్తా అంతంతమాత్రం..సీమాంధ్రుల కోసం తెలంగాణ లో పోరాడే నాయకులు వామపక్షాలలో లేరు..మజ్లిస్ కు అంతటి విశాల హృదయం లేదు..ఇంకెవరున్నారు..రాజధానిలో సీమాంధ్రుల, వారి హక్కుల కోసం పోరాడగలిగే యోధుడు..ఎవరున్నారు.. నిన్నటి వరకు మనదనుకున్న నేల, మనది కాకుండా పోయిన నాడు, కనీసం అక్కడ సజావుగా, సగౌరవంగా బతికే హక్కు కూడా జారిపోతున్న వేళ….ఏం జరుగుతోందో..ఏం జరుగుతుందో తెలియన జంక్షన్లో నిల్చున్న హైదరాబాదీ సీమాంధ్రుడిని ఆదుకోవడానికి ఓ మొనగాడు కావలెను.

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలించే ప్రజాస్వామ్యం మనది అని గర్వంగా చెప్పుకుంటాం.. కానీ ప్రజలు ఎన్నుకున్న నేతలు తమ చేతిలో అధికారం వున్నంత కాలం, తమ చిత్తానికి చెలాయిస్తూ, తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ, తమ ఆలోచనలను ప్రజలపై రుద్దడం అన్నది ఈ దేశంలో స్వాతంత్య్రం వచ్చినది ఆదిగా జరుగుతున్న సంగతి. ప్రజల కోసమే ఆలోచిస్తే, ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత మూర్ఘంగా ముక్కలు చేయదు. కాస్త ముందు వెనక ఆలోచించేది. ఇలా విభజన చేయడం వల్ల వచ్చే సమస్యలను కాస్త ఊహించేది. వాటన్నింటికీ పరిష్కార మార్గాలు ముందుగానే సిద్ధం చేసేది. యాభై ఏళ్లకు పైబటి నడిపిన ఉమ్మడి వ్యవహారాలు ఒక్కసారి రెండు ముక్కలు కావడం అంటే సవాలక్ష సమస్యలు ఉత్పన్నం కాక తప్పదని మెడమీద తలకాయ వున్నవాడు ఎవడైనా చెప్పగలడు. కానీ మహా మహా మేధావులం అనుకునే జనాలతో కూడిన ప్రభుత్వాలు, అవి ఏర్పాటు చేసే కమిటీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవు. 

జవాబు చేసి లెక్క కిట్టించినట్లు, విభజన తప్పదు, తమను నియమించిన వారి చిత్తం అదే చెబుతోంది కాబట్టి, బైరాగి చిట్కాల్లాంటి సలహాలు, సూచనలు చేస్తూ అడ్డగోలుగా విభజించి పారేసారు. ఇప్పుడు ఆ పని తాలూకా అసలు సైడ్‌ ఎఫెక్ట్‌లు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం మ్యాప్‌పై మార్కు చేయడం లాంటిది.రాష్ట్రం రెండు ముక్కలైంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైంది. అంతవరకు బాగానేవుంది. కానీ నిన్నటి వరకు ఇదీ మన రాష్ట్రమే.. ఇదీ మన హక్కున్న చోటే.. ఇదీ మనం బతికేందుకు అనువైనదే అనుకుని కాళ్లూనుకున్న జనం ఇప్పుడు కాళ్ల కింద నేల ఎక్కడ కదులుతుందో అని భయపడుతున్నారు. తమ పిల్లలకు ఇక్కడ ఏ హక్కులుంటాయో, ఏ హక్కులు వుండవో తెలియక తికమకపడుతున్నారు. ఉన్నట్లుండి ఏ నిర్ణయం విరుచుకుపడుతుందో, తెలియక తల్లడిల్లుతున్నారు. కేంద్రం, ఫెడరల్‌ రాజ్యాంగం నిర్వచించిన వాటిని కాదని తమకుంటూ కొత్త నిబంధనలు రాసుకోవడం ప్రారంభించింది తెలంగాణలో అధికార పీఠం అధిరోహించిన కొత్త ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాల నుంచి తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రులను కాపాడేందుకు ఓ మొనగాడు కావాలి.. అవును.. మొనగాడు కావాలి..

అసలు తకరారు ఏమిటి?

అంటే అన్నామంటారు కానీ. అసలు తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఏమిటి? వెనుకబడిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం. అభివృద్ధికి దూరమైన కారణంగా తగిన ఉపాధి అవకాశాలు పెంచడం.. మన రాష్ట్రం, మన పార్టీ.. మన పాలన అన్నదే కదా తెరాస లక్ష్యం. అది సాధ్యమైంది. ఇంక ఇప్పుడేం చేయాలి. ముందుగా అనుకున్నట్లు తెలంగాణలో ఎక్కడైతే అభివృద్ధి దూరమైందో అక్కడ దృష్టి సారించాలి. అక్కడ అభివృద్ధికి బాటలు వేయాలి. 

నిజానికి తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఎక్కువగా ఉత్తర తెలంగాణలో,.. బాగా ఎక్కువ అభివృద్ధి ఎక్కడ జరిగింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో. మరి ఇప్పుడు కేసీఆర్‌ తాను మఖ్యమంత్రి కాగానే చేస్తున్నదేమిటి? త్వరలో ఎన్నికలు జరగబోయే హైదరాబాద్‌పై దృష్టి పెట్టడం. భవిష్యత్‌లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ మళ్లీ తనపై పోటీకిదిగి, ఇబ్బంది పెడుతుందో అని తెలంగాణ ఉద్యమ విజయ సూత్రమైన సీమాంధ్ర వైరం అనేదాన్ని రావణ కాష్టం చేసి, అలా మండుతూనే వుండేలా చూడడం. 

ఒక కొత్త రాష్ట్రం అంటూ ఏర్పడిన తరువాత, ఆ రాష్ట్రానికి ఓ ప్రభుత్వం అంటూ వచ్చాక చేయాల్సింది పాలన మాత్రమే. అంతే కానీ ఎవరు ఈ రాష్ట్రం వారు.. ఎవరు కాని వారు. ఎవరిని తాము లాలించి పాలించాలి.. ఎవరిని పక్కన పెట్టాలి అన్నది కాదు. ప్రభుత్వం ప్రయోజనాలకు కొలబద్దలు రెండే ఒకటి మెరిట్‌. రెండు వెనుకబడినతనం. ఈ వెనుక బడిన తనం అన్నది కులం రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా. వీటిని మాత్రమే చూసుకుని ప్రభుత్వం ముందుకు సాగిపోవాలి. అంతే కానీ, వీళ్లకు డబ్బులిస్తాం.. వీళ్లను మాత్రమే ఆదుకుంటాం.. అని అనడం ఏ మేరకు సబబు? 

సీమాంధ్రులెవరన్నది ఇప్పుడెందుకు?

అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే ఇక్కడున్న జనం అంతా తెలంగాణ రాష్ట్రవాసులైపోయారు. వారి చిరునామాలో తెలంగాణ అన్నది ఓ భాగంగా చేరిపోయింది. ఇప్పుడు వారు తెలంగాణ ఓట్లర్లు.. తెలంగాణ ప్రజలు. అయితే చిక్కల్లా వచ్చి పడిరది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాలకపక్షం అయినటీఆర్‌ఎస్‌కు పోటీగా బరిలో వుండడం. సీమాంధ్రులంతా ఆ పార్టీకి మద్దతుగా వుంటారన్న భయం. వైసీపీ పార్టీ కూడా బరిలో వుండీ వుండకుండా వున్నా, అది తెరాసకు తెర వెనుక మద్దతుదారు అన్న అభిప్రాయం జనంలో బలపడిపోయింది. వామపక్షాలు అంతంత మాత్రం. లోక్‌సత్తాకు జనం ఇదీ మీ సత్తా అని ఎప్పుడో చెప్పేసారు. అందువల్ల సీమాంద్ర జనానికి మిగిలిన ప్రత్యామ్నాయం టీడీపీ. ఏదో చేయలేక మరేదో చేసినట్లు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తేదేపాను ఏరిపారేసేందుకు మరేదారి లేక, దానికి మద్దతు దారులైన సీమాంధ్రులను టార్గెట్‌ చేయడం ప్రారంభించింది. 

ఇందకోసం రకరకాల అస్త్రాలను ఒకేసారి సంధించడం ప్రారంభించింది. మా పిల్లలకే మేం ఫీజులు కట్టుకుంటాం.. మీ సీమాంధ్రులను మీరు చూసుకోండి అని అంటున్నారు కేసీఆర్‌. ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనేసుకుంటే రాజ్యాంగ స్ఫూర్తి అన్నది ఏమి కావాలి? పరాయి రాష్ట్రం వారికి రేషన్‌ ఇవ్వం… పరాయి రాష్ట్రం వారికి ప్రభుత్వ వైద్యం అదివ్వం అనడం లాగేవుంటుంది ఇదీనూ. మన దేశం నుంచి పరాయి దేశానికి వెళ్లిన వాళ్లను కాస్త గట్టిగా చెక్‌ చేస్తేనే మనం బుస్సుమంటామే. అలాంటిది మన దేశంలో మనకు మనమే చెక్‌ పెట్టుకోవడం అంటే ఏమనుకొవాలి. 

సీమాంధ్రులు రెండు రకాలుగా తెలంగాణలో స్థిరపడ్డారు ఒకటి ఉద్యోగ రీత్యా, రెండు వ్యాపార రీత్యా. 

ఉద్యోగ రీత్యా స్థిర పడినవారు ఇలాంటి ప్రభుత్వ సదుపాయాల కోసం చూస్తారు. అందువల్ల వారిని స్థానికత అనే అంశంతో కట్టడి చేస్తున్నారు. వారికి వ్యాపారం చేసేవారిలో కొందరికి కొన్ని సర్దుబాట్లు తప్పవు. ఆ మాత్రం ఈ మాత్రం అటు ఇటు జరగకుండా వ్యాపారం చేయడం అన్నది అసాధ్యం అందువల్ల వాళ్లని అక్కడ టార్గెట్‌ చేస్తున్నారు. 
తెలంగాణ అభివృద్ధి అన్న అసలు లక్ష్యం పక్కదారి పట్టేసింది. ఓ సైనిక ప్రభుత్వం ఏర్పాటై, ఇన్నాళ్లు తమకు కిట్టని వాళ్లని బాధ పెట్టే పని పెట్టుకున్నట్లు తెరాస ప్రభుత్వం వ్యహరిస్తున్నట్లు కనిపిస్తోంది. 

కింకర్తవ్యం?

చెబితే వినడు.. చెప్పేవాడు లేడు.. అన్నట్లుంది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి. ఎవరు చెప్పినా కెేసీఆర్‌ వినడు. అలా అని అసలు చెప్పేవాళ్లు కూడా లేకపోవడం అన్నది దారుణం. ఇక్కడ సమస్య సీమాంధ్రులది. తెలంగాణ లోని పార్టీలు ఏవైనా వాటికి ఇది అనవసరం. అది తెలుగుదేశం పార్టీ అయినా కూడా. తెలంగాణలో వున్న ఏ పార్టీకైనా నాయకులు అక్కడి వారే కాబట్టి వారు సీమాంధ్రులను వెనకేసుకు రావడం అన్నది జరగనిపని. అది కాంగ్రెస్‌ లేదా వైకాపా కూడా కావచ్చు. 

మరి ఇంకేం చేయాలి. 

కేంద్రం మార్గదర్శక సూత్రాలు ఇవ్వాలి. అవసరమైతే, విధివిధానాలు ఇవీ అని కచ్చితంగా సూచించాలి. కానీ ఇప్పట్లో ఆ విధమైన వ్యవహారానికి పూనుకునేలా కనిపించడం లేదు. అలాంటి ఉద్దేశమే వుంటే విద్యార్ధుల అవస్థలపై కోర్టు తన ఆదేశాలిచ్చేవరకు కేంద్రం చూస్తూ ఊరుకునేది కాదు. కాగల కార్యం కోర్టు తీరుస్తుందిలే అని వదిలేసినట్లు కనిపిస్తోంది. 

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయాలి. సీమాంధ్రులు తమ సమస్యలపై తామే పోరాటానికి దిగాలి. తప్పుదు అందుకు నాయకత్వం వహించడానికి టీడీపీ, వైసీపీ, లోక్‌ సత్తాలు లాభం లేదు. వాటికి తెలంగాణ విభాగాలు ముఖ్యం కానీ, సీమాంధ్రుల సమస్యలు కాదు. 

అందుకే సీమాంధ్రుల సమస్యలపై పోరాడేందుకు ఓ మొనగాడు కావాలి. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ ఉద్యమించినట్లు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల కోసం, వారి రక్షణ కోసం.. వారి హక్కుల కోసం.. అవసరమైతే కేంద్రాన్ని కదిలించడం కోసం ఓ మొనగాడు కావాలి. రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం సాగించగలగాలి. దీనివల్ల సాధించడం సాధ్యం అనికాదు.. కానీ సమస్య అన్నది జాతీయ స్థాయికి చేరుకునేందుకు వీలవుతుంది. అప్పుడైనా కేంద్రం స్పందించక తప్పదు. ఒకసారి కేంద్రం స్పందించాల్సి వస్తే అది పక్షపాతరహితంగానే వుంటుంది తప్ప, తెలంగాణ ఓట్ల కోసం చూసుకుంటే, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమైనా, కేంద్రం సరైన దిశగా నిర్ణయాలు తీసుకుని, తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసే అవకాశం వుంది. 

అందుకే సీమాంధ్రులకు ఓ మొనగాడు కావాలి.. నాయకత్వం వహించి, వారిని ముందుకు నడిపించడానికి.

చాణక్య

[email protected]