ఒక అభిమాని ప్రస్థానం
ఈ సంకలనంలో తక్కిన రచయితలందరూ రమణగారికి బంధువులు, అర్ధశతాబ్దికి మించి స్నేహం కలిగి నువ్వు-నువ్వు అనుకునేవారు. నేను ఆయన బంధువుని కాను, స్నేహితుణ్నీ కాను. (ఆయన 'మీలాటి ఫ్రెండ్..' అని అన్నా, నేను 'రమణగారు నా ఫ్రెండ్' అని ఎప్పుడూ అనలేదు, అనుకోలేదు. ఎప్పుడూ ఒక ఐడాల్‌గానే చూశాను. అభిమాని స్థానంలోనే పాతుకుపోయాను. అందువలన పాఠకులలో చాలామంది నాతో ఐడెంటిఫై కావడం సహజం. స్కూల్లో చదువుకునే రోజుల్లో ''ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు''లో డైలాగులు పదే పదే వల్లె వేసుకుంటూ 'తస్సదియ్యా, భలే రాసాడ్రా ముళ్లపూడోడు' అనుకునే రోజుల్నుంచి రెండు, మూడు రోజులకో సారి ఆయన దగ్గర్నుంచి ఫోన్ అందుకునే స్థాయికి ఎదగడం ఎవరెస్టు ఎక్కడం కంటె మిన్న అనుకునే ఒక అమాంబాపతు అభిమాని బొత్తిగా వినయం లేకుండా చెప్పుకుంటున్న స్వోత్కర్ష యిది. శ్రమ, శ్రద్ధ వున్న ఒక మామూలు సాహిత్యాభిమాని ఏ మేరకు సాధించగలడో, సాహిత్యాభిమానులందరితో పంచుకోవాలన్న తపనే నన్ను యిది రాయాలని పురికొల్పుతోంది.
నా పేరు చెప్పగానే సాహిత్యాభిమానులకు గుర్తుకు వచ్చేది 8 సంపుటాల 'ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం' సంపాదకుడిగా! ఆ ఒక్క బిరుదు చాలు – నన్ను సాహితీలోకంలో పదికాలాలపాటు గుర్తు పెట్టుకోవడానికి. రమణగారి లక్షలాది, కోట్లాది అభిమానులలో ఆఫ్టరాల్ ఒకడిగా వున్న నేను ఆ బిరుదు సంపాదించుకోవడం ఎలా జరిగిందో తెలుసుకుంటే అది అనేకమంది ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా వుంటుందని ఆశ.
పిలిచినా వెళ్లలేదు : ''సీతాకళ్యాణం'' ఫెయిలయినప్పుడు నాకు పట్టరాని దుఃఖం వచ్చింది. 'ఇది మామూలురకం పౌరాణిక సినిమా కాదు, బ్యాలే అని ముందే చెప్పవద్దా?' అని చివాట్లు వేస్తూ, (అభిమానులకు వాళ్ల ఐడాల్స్‌పై ఆ పాటి హక్కులుంటాయి) వాళ్ల పాత సినిమాలను పరామర్శిస్తూ ఓ ఐయిదారు పేజీల ఉత్తరం రాసేశాను. మా వరప్రసాద్ (దరిమిలా శాంతా బయోటెక్నిక్స్ మరియు హాసం ప్రచురణలు అధినేత) బంధువు రమణగారి అడ్రసు సంపాదించి యిస్తే పంపించేశాను. ఆశ్చర్యకరంగా ఆయన వద్దనుండి జవాబు వచ్చింది. అది పెట్టుకుని నేనే రమణనైనంత బిల్డప్ యిచ్చి చుట్టుపక్కల వారిని అడలగొట్టాను.
తర్వాత మద్రాసులో పనిచేసే రోజుల్లో కొవ్వలి వారి జయంతి సభకు ఆయన వచ్చారు. సభానంతరం అదే ''సీతాకల్యాణం'' షో వేస్తూంటే ఆయన బయలుదేరారు. ఫలానా అని పక్కవారిని అడిగి నిర్ధారించుకుని కారెక్కబోతున్న ఆయన్ని ఆపి పరిచయం చేసుకున్నాను. 'స్టేటుబ్యాంకులో ఆఫీసర్ని, మీ అభిమానిని, మీకోసారి ఉత్తరం కూడా రాసి జవాబు తెచ్చుకున్నవాణ్ని, మిమ్మల్ని యింటి దగ్గర కలవవచ్చా?' అని అడిగా. మా ఆఫీసుకి రండి అంటూ గుర్తులు చెప్పారు. సరే అన్నాను కానీ వెళ్లే ధైర్యం చేయలేకపోయాను.
వెళితే ఏం మాట్లాడాలో తెలియలేదు. 'నేను మీ అభిమానిని' అని చెప్తే 'ఆహా' అంటారు. ఇలా ఎన్ని లక్షలమంది చెప్పారో! 'మీరు బాగా రాస్తారండి' అంటే విష్ణుమూర్తికి 'నీకు నాలుగు చేతులున్నాయిస్మీ' అని భక్తుడు చెప్పినట్టు వుంటుందేమో (ఉపమానం ఆయనదే) ! అయినా అంత పెద్ద హాస్యరచయిత అంత సీరియస్‌గా మొహం పెట్టుకుని వుంటే వెళ్లి కాలక్షేపం కబుర్లు చెప్పడం ఎలా? వెళ్లి అడ్డదిడ్డంగా మాట్లాడితే మనని బేస్ చేసుకుని వచ్చే సినిమాలో ఓ హాస్యపాత్ర సృష్టిస్తే..? ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అనుకుని వెళ్లడం మానేశాను.
దారి చూపిన అనువాదం : ఓ సారి వాకాటి పాండురంగారావు గారన్నారు – రమణను ఇంగ్లీషులోకి అనువదించడం మాటలా? అని. మనం ఎందుకు ప్రయత్నించకూడదు? అనుకుని రమణగారి ''ఛాయలు'' కథను ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు పంపాను. ఆయన చదివి ఫోన్ చేశారు – ''చాలా బాగుందండి. ఓ సారి మా యింటికి రండి.'' అని. క్లౌడ్ నెంబర్ నైన్ ఎక్కి దానిమీద వాళ్లింటికి వెళ్లిపోయాను. అది 1993 జూన్ 12. దాదాపు మూడు గంటలపాటు మాట్లాడారు. నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నా అనువాదానికి కితాబు యిచ్చారు. నేను కూడా తెగించి ''మీరేం జోకులేసుకున్నా సరే, మీరంటే పడి చచ్చే వాళ్లలో నేనూ ఒకణ్ని'' అని చెప్పేశా.
మాటల్లో యీ ''ఛాయలు'' కథ ఎప్పుడు పడింది? దాని ఒరిజినల్ మీ దగ్గర వుందా? ఇంతటి సైకో ఎనలిటికల్ కథను పాఠకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అని అడిగా. అప్పుడు తెలిసింది – ఆయన దగ్గర ఆయన రచనల ఒరిజినల్స్ ఏవీ లేవు. ఆంధ్రపత్రికలో సంపాదకవర్గంలో ఏడేళ్లపాటు పనిచేసినపుడు ఆయన అనేక మారుపేర్లతో, అనేకసార్లు ఏ పేరూ లేకుండా రాశారని, వాటిల్లో కొన్ని మాత్రమే నవోదయావారు పుస్తకరూపంలో వేశారనీ. శ్రీరమణ 1990లో ''బాపూరమణీయం''గా కూర్చి వెలువరించిన పుస్తకంలో కాసిన్ని సినిమాసమీక్షలే వచ్చాయనీ!
'…మరి తక్కినవి రాకపోవడమేం? మీరు రాసిన ప్రతీ అక్షరం అమోఘంగా వుంటుంది కదా, అవన్నీ పుస్తకరూపంలో రాకపోవడం అన్యాయం. వచ్చినవి కూడా యింట నిలవవు. ఇంటికి వచ్చినవాళ్లు అరువడిగి తిరిగివ్వరు. పోనీ మళ్లీ కొందామంటే మీ పుస్తకాలన్నీ ఒకేసారి మార్కెట్లో ఎప్పుడూ దొరకవు. బుడుగు మొదటి పార్టు వుంటే రెండో పార్టు దొరకదు. విక్రమార్కుడు చిక్కితే గిరీశం చిక్కడు. ఏమిటీ అన్యాయం? ఇది పాఠకుల పట్ల ద్రోహం కాదా? మీకేం బాధ్యత లేదా?' అని నిలదీశాను. (చెప్పానుగా అభిమానులకు కొన్ని హక్కులు దఖలుపడి వుంటాయి).
ఆయన విశాలంగా నవ్వేసి, ''నేను వాటి గురించి పట్టించుకోవటం లేదు. భుక్తికి భగవంతుడు నాకు వేరే దారి చూపించాడు. సినిమాలలో పడి కొట్టుకుంటున్నాను. ఆ రచనలు అవీ యిప్పుడెవరూ పెద్దగా చదువుతారని అనుకోను. ఏవి వేయాలి, ఎన్ని వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది మా నవోదయా రామ్మోహనవారుగారే చూసుకుంటారు. ఆయన జడ్జిమెంటుపై నాకు నమ్మకం.'' అన్నారు.
మాట వినలేదు : అప్పటిదాకా అముద్రితమైనవి ''బాపురమణీయం''లో వేసినట్టే యింకొన్ని అముద్రితాలు సంపాదించి ''బాపూరమణీయం-2''గా వేయాలన్నది అవాళ్టినుంచి నా జీవితలక్ష్యం అయింది. మద్రాసులో లైబ్రరీలు తిరిగాను. హైదరాబాదులో లైబ్రరీలలో తిరిగే పని మా తమ్ముడు శ్రీధర్‌కు అప్పగించాను. వాడు జిరాక్స్‌లు తీసిపంపండం, అవి నేను రమణగారికి చూపించి 'మీదా? కాదా?' అని అడగడం. అవునన్నవి తేదీల వారీగా కంప్యూటర్ కెక్కించి క్లాసిఫై చేయడం, తేదీల వారీగా ఆయన రచనావ్యాసంగాన్ని విశ్లేషించడం. ఈ పని ఏడాదికి పైగా సాగింది.
ఆయనకు మొదట్లో యిది సరదాగా వుండేది. తను పని చేసిన పత్రిక నకళ్లు నలభై యేళ్ల తర్వాత చూసినప్పుడు ఎవరికైనా ఆనందం కలగడం సహజం. పోనుపోను ఆయనకు భయం పట్టుకుంది, ఆయన చుట్టూ తిరిగి నేను టైము వేస్టు చేసుకుంటున్నానని! అప్పట్లో ఆయన ''మిస్టర్ పెళ్లాం'', ''పెళ్లికొడుకు'' సినిమాల నిర్మాణంలో బిజీగా వుండేవారు. అయినా ప్రత్యేకంగా పిలిచి ఓ రకమైన వార్నింగ్ యిచ్చారు. ''మీరు నా కథలు అనువాదాలు చేస్తున్నారు. అవి నాకు నచ్చుతున్నాయి. అంతవరకూ బాగానే వుంది. కానీ యిదేమిటి? నా పాతరచనలు తవ్వడం దేనికి? దీనిమీద మీరూ మీ తమ్ముడూ యింత శ్రమ పడడం దేనికి? ఇది నాకు చాలా యిబ్బందిగా వుంది. పెద్ద సింహాసనం మీద పేదవాణ్ని కూర్చోబెడితే వాడు ఎంత ఉతుకుష్టంగా ఫీలవుతాడో అలా వుంది. దయచేసి యీ పని ఆపేయండి. మీ బాధ్యతలు మీకుంటాయి కదా, మీ పనులు మీరు చూసుకోండి.'' అని.
నేనూ మొండికేశాను. ''మీ దృష్టిలో యిది అనవసరం. నా దృష్టిలో చాలా అవసరం. నేను నా ఆఫీసు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు విస్మరించటం లేదు. ఇది ఒక హాబీగా చేస్తున్నాను. నా పనుల వలన మీకు చెడ్డపేరు రానంతవరకు నన్ను అడ్డుకునే హక్కు మీకు లేదు. నేను తవ్వి తీస్తున్న సమీక్షలు, రచనలు చదువుతూంటే తెలుస్తోంది – మీరు ఎంతటి వైవిధ్యభరితమైన రచనలు చేశారో! పి. దక్షిణామూర్తి పేర ''విమానం కథ'' అని పిల్లలకు ఏవియేషన్ గురించి ఎంత సులభంగా చెప్పారు! అది పుస్తకరూపంలో రాలేదు కదా! దేశ, విదేశ సినిమాల గురించి, సినిమాకారుల గురించి ఎంత సమాచారాన్ని యిచ్చారు! ఏదీ ఎక్కడ వేశారు? ఈనాటి సినీ జర్నలిస్టులకు వీటి గురించి తెలియవలసిన అవసరం లేదా? సి వి విజయలక్ష్మి పేర స్త్రీలకు సంబంధించిన అంశాలపై ఎన్నెన్ని రచనలు చేశారు! అవి వచ్చాయా? ఇవన్నీ చెదలపాలవ్వాల్సిందేనా? ఇంకో పదేళ్లు పోతే యివీ దొరకవ్. నా పని నన్ను చేయనీయండి.'' అన్నాను.
నా మాటలను ఖండించలేక ఆయనకు చికాకేసింది. ''నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన మీ యిష్టం.'' అన్నారు కుర్చీలోంచి లేచిపోతూ. నా పని నేను చేసుకుపోయాను.(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)