సుభాష్ చంద్రబోస్.. స్వాతంత్ర పోరాటంలో కనుమరుగైపోయిన ‘వీరుడు’. ఆయన పేరు చుట్టూ అనేక రాజకీయాలు. అసలాయన జాడ ఇప్పుడెవరికీ తెలియదు. విమాన ప్రమాదంలో బోస్ మరణించారన్నది ఓ కథనం. కానీ, అది నిజం కాదని బోస్ బంధువులు ఇప్పటికీ చెబుతున్నారు. బోస్ ఇప్పటికీ జీవించే వుండి వుంటారన్నది వారి వాదన.
స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరల్ని ముప్పుతిప్పలు పెట్టిన బోస్, భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి వుంటాడన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ బోస్ చనిపోయాడా? బతికే వున్నాడా.? అన్నదానిపై ఇప్పటిదాకా కేంద్రంలో వున్న ఏ ప్రభుత్వమూ ఓ స్పష్టత ఇవ్వలేకపోయింది. కానీ, నరేంద్ర మోడీ సర్కార్, నేతాజీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించాలనుకుంటోంది. ఇదే విషయమై బోస్ కుటుంబీకులు స్పందిస్తూ, ‘భారతరత్న సంగతి తర్వాత.. దేశ ప్రజల గుండెల్లో ఆయన వున్నారు.. ఆయనకు ప్రత్యేకంగా పురస్కారాలు అవసరం లేదు.. కానీ ఆయన జాడ చెప్పండి చేతనైతే..’ అంటున్నారు.
నిజమే.. దేశానికి కావాల్సింది, బోస్ ఏమయ్యారన్న ప్రశ్నకు సమాధానం. విమాన ప్రమాదంలో చనిపోయారా.? లేదంటే చంపేశారా.? అదీ కాదంటే, ఆయన ఇంకా అజ్ఞాతంలో వున్నారా.? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత, భారతరత్న ఇస్తే ఇవ్వొచ్చు.. లేదంటే లేదు. బోస్ జాడ చెప్పడం కన్నా బోస్‌కీ ఆయన కుటుంబానికీ దేశం ఇచ్చే గౌరవం ఇంకేమీ వుండదేమో.!