పేరు : హేమ మాలిని
దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇంకే ముంటుంది. ఒక మంత్రి పదవి వుంటే బాగుంటుంది కదా!
ముద్దు పేర్లు : డ్రీమ్ పాలిటిష్యన్ (డ్రీమ్ గాళ్ ఉద్యోగాన్ని సినిమాల్లో ఎప్పుడో చేసేశాను.) నన్ను ఎన్నుకున్న మధుర నియోజకవర్గ ప్రజలు నాకీ ఉద్యోగాన్ని ఇవ్వటానికి సిధ్ధంగా వున్నారు. ఎన్నికయిన తర్వాత చాలా రోజుల పాటు కలల్లోనే కనపడ్డాను కానీ, కనుల ముందుకు రాలేదు.
‘విద్యార్హతలు : పెద్ద చదువే. అంకెల్లో చదువు ఎక్కడి వరకూ వచ్చి ఆగుతుంది? పదివరకూ కదా! అక్కడితోనే నేనూ ఆగాను.
హోదాలు : సౌందర్యంలో నా హోదా నాకు వుంది. నాకు ముందు వైజయంతి మాల, నా తర్వాత ఐశ్వర్యారాయ్. కానీ అధికారంలోనే అలాంటి తిరుగులేని హోదా ఇంకా రాలేదు.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఒక్కసారి చూస్తే, జీవితాంతం గుర్తుంటాను. ఆ భరోసాతోనే నియోజకవర్గం విడిచి వెళ్ళాను. ఈ లోగానే తొందరపడి నా మీద పోస్టర్లు వేసేశారు` ‘కనపడుట లేదు’ అని
రెండు: కోపం రాకపోయినా, చిందులు తొక్కుతాను. (అపార్థం చేసుకోకండి. నేను డ్యాన్సు ప్రోగ్రామ్ లు ఇస్తుంటాను లెండి.)
సిధ్ధాంతం : రాజకీయాలంటే ఎన్నికలు… ఎన్నికలంటే ప్రచారం.. (ప్రచారంలో పార్టీ వారు ఏమిరాసిస్తే, అది చదవటం. అందుకే పార్టీ సిధ్ధాంతాలతో పెద్దగా పేచీ వుండదు.)
వృత్తి : పిల్లల్ని( ఇషా, అహనాలను) తారలుగా చేయటం. కానీ వారిప్పటికీ ‘పిల్ల తార’ లుగా నే మిగిలి పోయారు.
హాబీలు :1.తీరిక వేళలో పార్లమెంటుకు వెళ్ళటం.
2. పదవీ కాలం ముగిసే లోగా.., ఒకటి రెండు సార్లు, సొంత నియోజకవర్గంలో పర్యటించటం.
అనుభవం :అంత పెద్ద అందాల నటినయినా, అవార్డుల నటిని కాలేక పోవటం. ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు, పదకొండు సార్లు నామినేట్ చేయపడ్డాను. కానీ వచ్చింది ఒక్క సారే. ఒక రాజకీయాల్లో సరేసరి. ‘హేమా హేమీలు’ వున్నారు.(‘హేమ’ను నేనే లెండి.)
మిత్రులు : సొంత పార్టీలోనే వుంటారు.
శత్రువులు : ఇంకెవరు. నా తోపాటు ఎన్నికయిన సాటి తారలు.
మిత్రశత్రువులు : నాకు వోటేసి, నేను కనిపించటం లేదని గగ్గోలు పెట్టేవారు.
వేదాంతం : ప్రజలకు సేవచేయటానికి ప్రజల వద్దనే వుండాలా? దూరంగా వుండి సేవచేయటానికి వీలు పడదా! అమెరికాలో వున్నామా? ఇండియాలో వున్నామా` అన్నది కాదు. మధుర ఎంపీగా వున్నామా? లేదా? అన్నదే ప్రశ్న.
జీవిత ధ్యేయం : ఒక్క సారి ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, నృత్య ప్రదర్శన ఇవ్వాలని.
-సర్