రుణమాఫీ అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తీరని సమస్యగా మారింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఆ హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కిందా మీదా అవుతోంది. ఈ సమస్య ఇంత జటిలం అవుతుందని తెలుగుదేశం పార్టీ భావించలేదు. కేంద్రంలో బొటాబొటీ ప్రభుత్వం వచ్చి, తమ మద్దతు కీలకమైతే, తమ చిత్తానికి దాని మెడలు వంచి, రుణ మాఫీ భారాన్ని కేంద్రం మెడకు తగిలించేయవచ్చు అని ఆ పార్టీ భావించినట్లు కనిపిస్తోంది. కానీ పరిస్థితి రివర్స్ అయింది. దీంతో రుణ మాఫీ ని కాస్తా రీషెడ్యూలు గా మార్చారు. అక్కడే హామీ కాస్త డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రీ షెడ్యూలు కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
అప్పటికీ కోటయ్య కమిటీ పేరుతో సవాలక్ష నిబంధనలు తయారుచేసారు. లక్ష రూపాయిలకు పరిమితం చేసారు. యాభై వేలు బంగారం పంట రుణాలను జోడించుకోవచ్చన్నారు. పోనీ అవన్నీ కూడా ఇప్పుడు అమలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఆర్బీఐ ఇదంతా వీలు కాదంది. ఇంకేం చేయాలి. ప్రభుత్వం భారీ హామీ ఇచ్చి ఒప్పించాలి. లేదా మొత్తం డబ్బు తెచ్చి చెల్లుబాటు చేసి హామీ నిలబెట్టుకోవాలి. ఇందులో మొదటి దాని వైపే మొగ్గు చూపుతోంది. ఏదో విధంగా రీ షెడ్యూలు కోసం బ్యాంకులను ఒప్పించాలని చూస్తోంది. అందుకు ముందు అసలు ఎంత మొత్తానికి హామీ ఇవ్వాల్సి వుంటుందో తెలియదు. అందుకే బ్యాంకుల నుంచి వివరాల కోసం ఇప్పుడు సమాచార సేకరణకు దిగింది.
ఇక్కడ కూడా ప్రభుత్వం చాలా చిత్రంగా వ్యవహరిస్తోంది.లక్ష రూపాయిల పంట రుణం, 50 వేల బంగారం రుణం, ఫలానా తేదీ నుంచి ఫలనా తేదీ లోపల ఏమేరకు వున్నాయో చెప్పండి అంటే బ్యాంకులు చెబుతాయి. కానీ అలా అడగడం లేదు. ఓ కంప్యూటర్ స్ప్రెడ్ షీట్ తయారు చేసి, రుణాలు, రైతుల వివరాలు అందచేయమని కోరుతోంది. బ్యాంకులేమో విధివిధానాలు చెప్పండి, వాటిలోకి వచ్చేవారి వివరాలు అందిస్తాం అంటే, అలా కాదు, ఇలాగే ఇవ్వండని ప్రభుత్వం పట్టుపడుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వం కోరిన సమాచారం అందించడానికి బ్యాంకులకు చాలా కాలం పడుతుంది. ఎంత కంప్యూటర్లలో వివరాలైనా తీసి అందించాలి కదా. పైగా చిన్న బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ బ్యాంకులు ఇంతలా కంప్యూటరీకరణ చేసుకోలేదు. అవన్నీ రికార్డులు ముందేసుకుని, క్రోడీకరించి తయారుచేయాల్సిందే. అంటే ఎంత సమయం పడుతుందో అర్థమైపోతుంది.
కనీసం లో కనీసం రెండు నెలల సమయం పడుతుంది. అంటే అక్టోబరు నెలాఖరుకు కానీ వివరాలు అందవు. అప్పుడు ప్రభుత్వం తమ తరపు ప్రతిపాదనలు, హామీలతో బ్యాంకుల ముందుకు వెళ్లాలి. దానికి కూడా బ్యాంకుల తరపున ఎవరు ఒప్పుదలుకు ముందుకు వస్తారు. అన్నింటికీ కలిపి ఆర్బీఐ ముందుకు రావాలి. లేదా ఏ బ్యాంకుకు ఆ బ్యాంకు యాజమాన్యం డీల్ చేయాలి. ఇదంతా జరగాలి అంటే మరో నెల రెండు నెలలు అంటే డిసెంబర్.
మొత్తం మీద 2014 దిగ్విజయంగా పూర్తవుతుంది. బహుశా ఫ్రభుత్వం ఆలోచన కూడా ఇదే అయి వుండొచ్చు. కాస్త టైమ్ తీసుకుంటే ప్రభుత్వం ఆదాయం కూడదీసుకోవచ్చు. మరోపక్క బ్యాంకులనే సమాచారం అడగడం వెనుక మరో ఆలోచన కూడా వుండి వుండొచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బ్యాంకులు బంగారం వేలం నోటీసులు పంపిస్తున్నాయి. ప్రభుత్వం సమాచారం కోరుతోంది..అంటే రీ షెడ్యూలు లేదా మాఫీ చేద్దామనేగా, అందుకు కాస్త ఆగండి అని బ్యాంకులను పరోక్షంగా కోరినట్లు అవుతుంది. అదే విధంగా రైతులు కూడా బ్యాంకుల్ని తొందరెందుకు అని నిలదీస్తాయి.
మొత్తానికి సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్న సామెతలా, రైతుల రుణాల వ్యవహారం బ్యాంకుల లాభాలను గూబల్లోకి తీసుకు వచ్చేస్తున్నాయి. ఇలా అయితే భవిష్యత్ లో బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ముందు వెనుక ఆడతాయేమో?