తాత్కాలిక రాజధాని అవసరం ఏమిటి?

హక్కును వదులుకుంటే త్యాగం అనరు..పారిపోయాడు అంటారు..పిరికోడు అంటారు.. Advertisement ఇలాంటి అర్థం వచ్చేలా ఇటీవల ఓ సినిమా డైలాగు వినిపించింది. ఇప్పుడు ఆంద్ర కొత్తగా తాత్కాలిక రాజధాని వ్యవహారం తెరపైకి తెస్తుంటే ఇదే డైలాగు…

హక్కును వదులుకుంటే త్యాగం అనరు..పారిపోయాడు అంటారు..పిరికోడు అంటారు..

ఇలాంటి అర్థం వచ్చేలా ఇటీవల ఓ సినిమా డైలాగు వినిపించింది. ఇప్పుడు ఆంద్ర కొత్తగా తాత్కాలిక రాజధాని వ్యవహారం తెరపైకి తెస్తుంటే ఇదే డైలాగు గుర్తుకు వస్తోంది. సమైక్య ఉద్యమ సమయంలో రాష్ట్రాన్ని విడదీయక తప్పదు అన్న పరిస్థితులు వచ్చినపుడు, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని అన్నారు. అయిదేళ్లకు మించి వద్దు అని తెలంగాణ వాదులు నినదిస్తే, కనీసం 15 ఏళ్లు కావాలని, కొత్త రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం సమయం పడుతుందని సీమాంధ్ర నేతలు వాదించారు. ఆఖరికి 10ఏళ్లు ఉమ్మడి రాజధాని అన్నది ఖాయం అయింది. ఎన్నికలు ఓ పక్క జరుగుతుండగానే గవర్నర్ స్వయంగా పూనుకుని, ఆంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నడిచేందుకు వీలుగా కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల వసతి, ఇతరత్రా ఏర్పాట్లు అన్నీ చేసారు. చిన్న చిన్న తగాయిదాలు వచ్చినా, వసతి సదుపాయాలు కుదిరాయి. వాటిలో అరకొర సమస్యలు, ఫర్నిచర్ వంటి ఏర్పాటు అవసరమైతే వుంది. అంతకు మించి ఇప్పటికి కిప్పుడు కొన్ని కార్యాలయాలు విజయవాడకు తరలించాల్సి అత్యయవసర పరిస్థితి అయితే ఏమీ లేదు. 

పాలనా సౌలభ్యం సాకు మాత్రమే

పాలనా సౌలభ్యం అన్నది సాకు మాత్రమే అని ఎవరైనా చెప్పొచ్చు. ఇదే రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు, ఈ పదమూడు జిల్లాలకు హైదరాబాద్ కేంద్రంగా పాలన అందించలేదా? మరి ఇప్పుడేమొచ్చె? మానసికంగా హైదరాబాద్ ఇక్కడ…పాలించే ఆంధ్ర అక్కడ అన్న ఫీలింగ్ ఏర్పడితే చెప్పలేం కానీ, లేకుంటే అది సమస్య కాదు. పైగా సమాచార సాంకేతిక విప్లవం అద్భుతంగా పరిఢవిల్లుతున్న కాలం ఇది. ఎక్కడి నుంచైనా పాలించవచ్చు. చెన్నారెడ్డి,  ఎన్టీఆర్ తమ ఆరోగ్య అవసరాలపై అమెరికా వెళ్లినపుడు అక్కడి నుంచే పాలించిన దాఖలాలున్నాయి. అప్పడు ఇప్పుడున్నంత సాంకేతిక సౌలభ్యం కూడా లేదు. 

బాస్ లు అక్కడ? స్టాఫ్ ఇక్కడ?

ఇప్పుడు విజయవాడను తాత్కాలిక రాజధాని చేసి, కీలక అధికారుల కార్యాలయాలు అక్కడకు తరలిస్తామన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అంటే డిపార్ట్ మెంట్ సెక్రటరీ, డైరక్టర్ వంటి వారి కార్యాలయాలు కావచ్చు. సాధారణంగా మంత్రి, ముఖ్యమంత్రి ఏ శాఖ తరపును సమాచారం తెలుసుకోవాలన్నా లేదా డిస్కషన్ వంటి నిర్వహించాలన్నా ఈ స్థాయి అధికారులే అవసరం అవుతారు. ఆపైన వారు డిప్యూటీ డైరక్టర్, ఇంకా ఆ కింది స్థాయి అధికారుల ద్వారా పనులు చక్కబెడతారు. ఇప్పుడు ఈ పై స్థాయి అధికారుల కార్యాలయాలు అక్కడ ఏర్పాటుచేయడం అంటే, మంత్రులకు, ముఖ్యమంత్రి కి అందుబాటులో వుండాల్సిన అధికారులను మాత్రం విజయవాడ తరలిస్తారన్నమాట. అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు విజయవాడలో వుందామన్నది అసలు ప్లాన్ అన్నట్లు కనిపిస్తోంది. 

సైకలాజికల్ గేమ్?

విజయవాడను రాజధాని చేయాలన్నది చంద్రబాబు మదిలో ఆలోచన అని ఇప్పటికే అర్థమైపోయింది. అయితే ఇది ఇప్పటిలో తేలేలా లేదు. ఈనెలాఖరుకు కానీ రాజధానికి సంబంధించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాదు. ఆ నివేదిక ఒకసారి కేంద్రం దగ్గరకు వెళ్లిపోయాక, కేంద్రం ఏ సంగతీ చెప్పేవరకు రాష్ట్రం చేసేదేమీ వుండదు. మోడీపై వత్తిడి తెచ్చేంత, తేగలిగినంత సీన్ ఏమీ వుండదు. పైగా కేంద్రం ఏం చెబుతుందన్నది ఇదమిద్దంగా తెలియదు. ప్రభుత్వం భూములు అపారంగా వున్న ప్రకాశం జిల్లా దోనకొండ ను కేంద్రం సజెస్ట్ చేసినా, లేదే మరే విధమైన సూచనలు చేసినా పరిస్థితి అడ్డం తిరిగే ప్రమాదం వుంది. 

మరోపక్క కర్నూలు రాజధాని చేయాలంటూ ఆందోళన ప్రారంభమైంది. ఇది సాధ్యం కాదని అందరికీ తెలుసు. కానీ ఆందోళనలు జరపడం నాయకులకు, ఆందోళన పడడం ప్రజలకు అలవాటే. ఇలాంటి ఆందోళనలు జరగకూడదు అంటే, రాజధాని నిర్ణయం జరిగిపోయిందన్న బిల్డప్ కావాలి. అందులో భాగమే ఈ తరలింపు. ఇక డిసైడ్ అయిపోయింది..మనం ఏం చేసి ఏం లాభం అన్న ఫీలింగ్ ఇలాంటి ఆందోళనలు చేసేవారిలో రావాలి. అదీ బాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. 

బాబు ఎక్కడుంటారు?

కీలక అధికారులు విజయవాడ తరలిపోతే ఇక్కడ బాబుకు సమాచారం ఇచ్చేదెవరు. సాధారణంగా ఈ స్థాయి అధికారులు ఐఎఎస్ లై వుంటారు. మరి వారు కాకుంటే ముఖ్యమంత్రిని నిత్యం కలిసేదెవరు? మరి వీరంతా విజయవాడకు వెళ్తే చీఫ్ సెక్రటరీ పరిస్థితి ఏమిటి? క్యాంప్ ఆఫీసు మాదిరిగా మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు అక్కడ అన్నట్లు కార్యాలయం నిర్వహిస్తారా? అంటే నిర్ణయాలు, సమాచారం, డిస్కషన్ అంతా విజయవాడలో, కిందిస్థాయి క్లరికల్ సెక్రటేరియట్ మాత్రం హైదరాబాద్ లో. ఏదైనా సమాచారం కావాలంటే నెట్ లో లేదా అంటే నాలుగు గంటల ప్రయాణం అదీ అసలు ప్లాన్ గా భావించాల్సి వస్తోంది. 

కానీ ఇదంతా ఎందుకు, పదేళ్ల పాటు హాయిగా వాడుకునే అవకాశం, అధికారం వుండి. ఇప్పుడెందుకీ తుగ్లక్ పాలన మాదిరిగా ఇక్కడ కొంత, అక్కడ కొంత అన్న గజిబిజి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పాలించడానికి ఇదీ సమస్య అని ఒక్కటి చెప్పండి..తగిన కారణం. పౌరుషానికి పోయి, పరాయి గడ్డ మనకెందుకు..మన ప్రాంతం పోయి గుడారాలైనా వేసుకుని పాలించుకుందాం అన్న పంతం తప్పితే?

చాణక్య

[email protected]