మనిషి తత్త్వం గురించి రాసిన కథలు కొన్ని :
'కృతజ్ఞత' – డబ్బున్న స్నేహితుడి కుక్కను కాపాడబోయి అన్నిందాలా చెడి, కృతఘ్నుడన్న పేరు మూటగట్టుకున్న దీక్షితులు కథ. దీక్షితులు కథ చెప్పిన సుబ్రహ్మణ్యం కథ చివర్లో నీతి చెప్తాడు – ''ఈ భూప్రపంచంలో ఎదుటి వాడిలో కృతజ్ఞత కోసం ఆశించే కన్న ఆంధ్ర రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు. ఆంధ్రుల్లో కార్యశూరత్వాన్ని ఆశించు. నువ్వు సఫలీకృత మనోరథుడవడానికి అవకాశాలు లేకపోలేదని నేను అనబోడం లేదు''.
'లోక యాత్ర'- చిన్నప్పుడు తను నడిపిన ప్రేమాయణం గుర్తుకు తెచ్చుకుని, ఈనాడు తన కూతురు ప్రేమలో పడుతుందేమో నని భయపడి ఖర్చయినా ఫర్వాలేదని పై క్లాసుకి రైలు టిక్కెట్లు మార్చుకున్న నడివయస్కుడు అనుకున్నదిది – ''…అమ్మయ్య, వెధవ డబ్బు పోతే పోయింది కానీ, చీకూ చింతా లేకుండా బెజవాడ చేరవచ్చు. ఆ ఇంటరు క్లాసులో ఆ అల్లరి కుర్రాళ్లతో సీతలాంటి పెంకికూతుర్ని వేసుకొని ప్రయాణం చేస్తే నిద్రకు నీళ్లు ధారపోయవచ్చు. రోజులు మరీ గడ్డుగా వున్నాయి. ఆడా మొగా క్షణాల మీద ప్రేమించేసుకుని, ఉత్తర క్షణాలలోనే పెళ్లాడేసి అంచెల మీద లేచిపోతున్నారు… 'అమ్మయ్యేది, బాబయ్యేది అమర ప్రేమ కన్నానా?' అంటున్నారు…. ఆయన ఆలోచనలకు అంతరాయం కల్గింది. పాతికేళ్ల తను సీత తల్లి కాంతం విషయంలో ఎలా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చింది.''
'చండీదాసు హితోపదేశం' – డిసెంబరు 1955 నాటి కథ. భార్యాదాసుడైన దానయ్య కొడుకు కాపురంలో పొరపొచ్చాలు వస్తున్నాయంటే వెళ్లి కోడలికి హితోపదేశం చేస్తాడు. ఏతావాతా తన కొడుకు మొహంలో భర్త ఛాయ కనబడి తెల్లబోతుంది చండిక, అదే దానయ్య భార్య. ''ఏమో సుమండి. కోడలు పిల్లి పిల్ల అయిపోయిందంటున్నారు కానీ అబ్బాయి కోడలుతో మాట్లాడినప్పుడు మీ ఛాయలే కనబడుతున్నాయి. ఉన్న మాట చెప్పాలంటే, ముమ్మూర్తులా మీలా తయారయ్యాడనిపిస్తుంది'' అని వాపోతుంది – భర్త భార్యాదాసుడు కావచ్చు కానీ కొడుకు భార్యాదాసుడు కావడం సహించలేక.
'ఛాయలు' – సుబ్రహ్మణ్యం అనే కుర్రవాడు ఇంట్లోంచి పారిపోయిన తమ్ముడి గురించి వెతుకుతూ రాత్రి మద్రాసు సెంట్రల్ స్టేషన్‌కు వెళతాడు. అక్కడ ఇతన్ని దొంగగా పొరబడిన ఒక పోలీసు అవమానిస్తాడు. స్టేషన్ బయటపడి నడుచుకుంటూ పోతున్న సుబ్రహ్మణ్యం ఆ పోలీసుని ఎలా శిక్షించాలో ఊహిస్తూ కలలు కంటాడు. మధ్యలో సినిమా పోస్టరు మీద సెక్సీ హీరోయిన్ బొమ్మ చివర్లో స్టంటు సినిమాహాలు వద్ద బొమ్మ అతని ఆలోచనలను చెదరగొడతాయి. ఆ సినిమా హాల్లోకి దూరతాడు. ''రూపాయి పావలా టిక్కెట్టు కొని సుబ్రహ్మణ్యం ఆ సినిమాకి వెళ్లాడు, తన పాత శత్రువుకు కొత్త శిక్ష ఎలా వెయ్యాలో సినిమా చూస్తూ ఆలోచిద్దామని. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. తన తమ్ముడిని వెతికేందుకు ఉపాయాలు ఆలోచించటానికి… బహుశా ఇంకో ముఖ్య కారణమూ వుండొచ్చు. అతడిది మీకూ నాకు ఏనాటికి చెప్పడు… తను పొందిన ఇన్ని అవమానాల కన్నా సెంట్రల్ స్టేషన్‌లో ఒకే ఒక క్షణంపాటు తను చూసి, కక్షుణ్ణంగా చదువుకున్న ఆంగ్లో ఇండియన్ అమ్మాయి వంపులు అతని బుర్ర నిండా ఆలోచనల్ని కల్పించి, తీరని కోరికల్ని రేకెత్తించాయి. ఇప్పుడీ సినిమా హీరోయిన్ వంపులు గంటన్నర చూసి ఇంటికెళ్లినప్పు డతడు తిరిగి ఇంకో రంగురంగుల ఊహలోకంలో ప్రవేశించవచ్చు, తీరని కోరికల్ని తృప్తిపరచుకుందుకు…''
'జల ప్రళయం' – 2000 సంవత్సరానికి ప్రళయం వస్తోందని మనం ప్రస్తుతం అనుకుంటున్నట్టుగా చి.మా.భా (చీమల జనాభా) హడావుడి పడడం ''… పెళ్లి అంటే భయపడుతూ వచ్చినవారు ఎలాగా ప్రళయం వస్తోంది కదా అని తెగించి పెళ్లిళ్లు చేసుకోవడం'' జరుగుతుంది. చివరకు ప్రళయం వస్తుంది. ఎలాగ? చీమల పుట్ట ఉన్న ఇంటి డాబా మీద పెట్టిన నీళ్ల బాల్చీ ఒరిగి పడడంతో.
'సన్మానభంగం' – ఎవర్నయినా సరే పిలిచి సన్మానం చేస్తానంటే వాళ్లకి కొమ్ములెలా మొలుచుకు వస్తాయో చెబుతుందీ కథ. దాంతో మరో సన్మానితుణ్ణి వెతుకుతూంటారు. అప్పారావు, వక్తగా ఉన్న మంత్రిగారు వేషాలు మార్చుకుంటూ (ఎవరి కారణాలు వారి కున్నాయి) సభను కొనసాగించడం మహారక్తిగా ఉంటుంది. దానిలో ఒక సన్మానితుడి గురించి – ''ఆయన పేరు సుబ్బన్నగారు. మహాభక్తుడు. వినయ భూషణుడు. దారుణమైన వినయంట… అసలు లోకంలో వినయం నిండుకోడానిక్కారణం ఉన్నదంతా పోగై ఈయనగా కరడు కట్టుకుపోవడమే నన్న చమత్కారమే ప్రధానంగా ముఖ్య వక్త ఉపన్యాసం తయారైంది. తీరా సభవేళకి వినయభూషణుడు సుబ్బన్నగారికి తనంత వినయశీలుడు లేడన్న గర్వం గంటకి బోలెడు చొప్పున పెరిగిపోయింది. దాంతో కణతల పైన చిన్న బొడిపెలు వచ్చాయి. అంతలో అవి బారెడు కొమ్ములుగా పెరిగి చివర సుడి తిరిగాయి…''
'కానుక' – గోపన్న అనే చిన్ననాటి మిత్రుడు కృష్ణుడికి ఒక మంచి వేణువు పుట్టినరోజు బహుమతిగా ఇద్దామని ప్రయత్నించడం కథాంశం. కానీ చేసినదేదీ అతనికి నచ్చదే! చివర్లో అతనికి జ్ఞానోదయమవుతుంది – సృష్టిలో ఏదీ పనికిమాలినది లేదని. ''ప్రొద్దు వాటారినప్పటినుంచి మర్రి చెట్ల లోంచి ఊడలు ఊడలుగా దిగజారుతున్న చీకటి. చలమై, చెరువై చెలరేగిన యమునై సముద్రమై భూమినంతా ముంచివేసింది. ఆకాశమెత్తున ముంచేసింది – రాధ కంటి కాటుకలా – కృష్ణుడి వంటి నలుపులా- నందుడి యింటి చల్లలా చిక్కబడింది.'' అంటూ ప్రారంభమయి అసాంతం చదివించే ఈ కథ చదివి మనసు ఆర్ద్రం కాని పాఠకుడు పాఠకుడే కాదు.
ఎత్తులు – పై యెత్తుల కథలు :
'సాక్షి' – సాక్ష్యం చెప్పిన నేరానికి దుండగుడు పగ తీర్చుకోడానికి వస్తే ఊరు కలిపి రాని పరిస్థితిలో ఏం చెయ్యాలన్నది కథ.
'ఈశ్వరేచ్ఛ' – అనుకోకుండా అవకాశం కలిసివచ్చిన గురునాథం తనను దగా చేసిన గజపతిని ఏడిపించడం.
'ప్రయోజకుడు' – అంతా తెలివితక్కువవాడు అనుకున్న కుర్రాడు ఎంతో తెలివిగా ఊరిల్లిపాదినీ బురిడీ కొట్టించడం.
'ఆ చేతి చేత' – భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు పిల్లలకు సాయపడడం.
సరదా కథలు :
'భూషణం వైరాగ్యం' – ఉడకని బంగాళాదుంపల కూర తినాల్స రావడం వల్ల వైరాగ్యం అలవడడం.
'అదో రకం ముచ్చట' – రైలు టిక్కెట్ దాచేసి ఫ్రెండుని ఏడిపించడం.
'ప్రాప్తి' – కరువు రోజుల్లో మినుములు కోసం తంటాలుపడి కొలీగ్స్ చేసిన ప్రాక్టికల్ జోక్‌కి గురవడం.
భక్తిభావం :
'సీతా కళ్యాణం' – సి.వి.విజయలక్ష్మి పేరుతో రాసిన ఈ కథ భాషా సౌందర్యానికి చదవదగినది. ఆ కథ ఇలా సమాప్తమవుతుంది. ''…రఘురాముడు తన దక్షిణ హస్తంతో సీతా వధూటి పాణి పల్లవాన్ని మృదువుగా అదిమాడు. ఆ పరమ కళ్యాణి మందహాసం సిగ్గు దొంతరలలో అందంగా కలిసిపోయింది. సీతారాముల మధ్య క్షణార్థంలో జరిగిన రహస్య మధుర సరాగ వృత్తాంతం, నేటికీ వధూవర కర కమలాలలో పునః పునరావృతం అవుతూనే ఉంది. లోకమంతటా పాణిగ్రహణ మధురక్షణాల వేళ వధూవరులంతా సీతారాముల ఈ అనురాగాన్ని ప్రసరిస్తూ వారిని స్మరిస్తూ తరిస్తూ ఉన్నారు.''
ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి రమణ రచనల్లో విశేషాలు. ఒక్కటి మాత్రం నిజం. రమణ చాలా తక్కువగానే రాసినా చిరకాలం నిలబడిపోయే పాత్రలు ఎన్నో సృష్టించారు. మునిమాణిక్యం పేరు చెప్తే 'కాంతం' గుర్తుకు వస్తుంది. మొక్కపాటి అంటే 'బారిష్టర్ పార్వతీశం' గుర్తుకొస్తాడు. మరి రమణ? – బుడుగు, సీగాన పెసూనాంబ, పక్కింటి లావుపాటి పిన్నిగారి మొగుడు, రెండు జెళ్ల సీత, రాధ, గోపాలం, అప్పారావు, వరహాలరాజు, ఆనందరావు. కంట్రాక్టర్…. ఇలా ఎందరో.
ఎంతో వైవిధ్యం చూపే రచనలు చేసిన రమణ హ్యుమనిజానికి తప్ప మరే ఇజానికి లొంగలేదని అనిపిస్తుంది. ఏదో ఒక వర్గం పేరుతో మనుష్యులను ద్వేషించలేదాయన. మనుష్యులలో అసూయ, ద్వేషం, మూర్ఖత్వం, హజం – అన్నీ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళని ప్రేమించా డాయన! కాలపరిమితి ఇజానికి ఉంది, నిజానికి లేదు. హ్యూమనిజానికి లేదు. హ్యూమనిజాన్ని ఆధారం చేసుకుని రాసేవాళ్లకు అవధులు లేదు. అడ్డుగోడలు లేవు, ఫలానా వారి మెప్పు పొందాలని రంగు పులుము కోవలసిన అగత్యమూ లేదు. అది అర్థం చేసుకున్నవాళ్ళూ, మనుష్యులను అభిమానిస్తూనే వాళ్లని మంచికి మరల్చాలని కోరేవాళ్లూ రమణను ఆస్వాదించగలుగుతారు. సమాజంపై అలిగినవారికి రమణ ఒట్టి కాలక్షేపం రచయితగానే అనిపిస్తాడు. అది వారి దురదృష్టం!'
ఇదీ ఆ వ్యాసం. దీనితో బాటు నేను సేకరించి అప్పటిదాకా అముద్రితంగా వున్న రమణ సమీక్షలు, వ్యాసాలు 'రచన'కు యిచ్చాను. వాళ్లు చక్కగా బాక్స్ కట్టి వేశారు. ఒక్కసారిగా ఆవిష్కరింపబడిన రమణ విశ్వరూపం చూసి అనేకమంది పాఠకులతో బాటు రమణగారూ ఆశ్చర్యపడ్డారు. 'అవునండోయ్, మీరు చెప్తూ వుంటే యిన్ని రాశానా అని నాకే వింతగా వుంది.' అన్నారు. 'మీరు చరిత్రను సృష్టించే క్రమంలో వున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు గమనించుకోలేదు. సింహావలోకనం చేసుకుని చూస్తేనే యివి తట్టేది.' అని జవాబిచ్చాను. ఈ వ్యాసం ప్రచురణ తర్వాత రమణ సాహితీసర్వస్వం వెలువరించాలనే నా సంకల్పం దృఢతరం అయింది.
(సశేషం) – ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)