వ్యాసాలు రాసేటప్పుడు రమణ ఒక శాస్త్ర పరిజ్ఞానాన్ని మరొక శాస్త్రానికి అన్వయించటం కనబడుతుంది. సినీ వ్యాసాలు రాసేటప్పుడు ''హాస్యనటులు'' (జూలై – సెప్టెంబరు '59) పేర అన్ని దేశాల హాస్యనటుల గురించి విశేషతలను ఉగ్గడిస్తూ ఆయన వ్యాసాలు రాసారు. మార్క్ బ్రదర్స్ మార్కు హాస్యం గురించి రాస్తూ సైంటిఫిక్ థియరీని తమ కనుగుణంగా, చక్కగా వాడుకున్నారు. ''మన కంట్లో రెటీనా మీద మనం చూసేవాటి బొమ్మలన్నీ తిరగబడి పడతాయనీ వాటిని మనం మళ్ళీ తర్జుమా చేసుకుంటామని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. మార్క్ బ్రదర్స్ సినిమా జగతి ఈ సిద్ధాంతాన్ని చితగ్గొడుతుంది. అది అపసవ్యంగా ఉంటుందని తెలిసి, వార్నింగ్ ఉండి కూడా దాన్ని మనం సవ్యంగా తర్జుమా చేసుకోలేము. చూస్తున్న కాసేపూ అదే మనని మింగేసి, గూచో, విక్కో, హార్పోలుగా అనువదించేస్తుంది…''
అలాగే నౌషాద్ గురించి '59లో వ్యాసం రాస్తూ'' '''శాస్త్రీయ రాగాలను కల్తీ లేకుండా శుద్ధ స్వరాల లోనే సులభ శైలిలో వరసలు కట్టి మధుర స్వరసరోవరం నిర్మించినవాడు ఆయన. అందులో ఇంగ్లీషు కెరటాలు లేపినవాడూ ఆయనే..' అంటూ నౌషాద్ శాస్త్రీయ పరిధిలో ప్రయోగాలు చేశారని చెప్పడానికి 'చెరువులో కెరటాలు' అనే నిత్య జీవిత సత్యాన్ని ఉపమానంగా వాడుకున్నారు.
పాఠకుడిగా ఇవన్నీ తెలుసా లేదా అనే చింత పెట్టుకోకుండా రాసినవీ ఉన్నాయి. – ''సత్యాన్వేషికి సమాధానం ఏమిటని గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే ''స్క్వేర్ రూట్ ఆప్ మైనస్ వన్'' అంటాడు. నౌషద్‌ను అడిగితే సప్తస్వరాలను అడగమంటాడు అది ఆయన తపస్సు.''
''రాధాగోపాలం''లో 'థింకర్స్ లైబ్రరీ వారి ట్రేడ్ మార్క్ అసామీ పోజులో'' అంటూ రోదిన్ శిల్పం గురించి అలవోకగా రాసేసారు. 'పాఠకుడి గురించి నా రచనలను డైల్యూట్ చేసుకోవలసి వస్తోంది' అని ఆయన ఎన్నడూ వాపోయినట్లు తోచదు. భాషా పాటవంతో బాటు రమణ ప్రతీ వాక్యంలోనూ ఒక లయ, తూగు ఉంటాయి. అది వ్యాసమేనా కానీ, కథైనా కానీ, సినిమా సంభాషణలైనా కానీ, అందుకే 'రమణ పాటలు రాయబోతున్నాట్ట' అని మల్లాది రామకృష్ణశాస్త్రిగారితో ఎవరో అంటే 'కొత్తగా రాసే దేముంది. అతని ప్రతీ మాటా పాటే' అన్నారట ఆయన!
''ఉచ్చారణ'' అనే వ్యాసం (జ్యోతి మాసపత్రిక ఆగస్టు'64) కొడవటిగంటి కుటుంబరావు. రావి కొండలరావుతో కలిసి సంయుక్తంగా రాస్తూ, 'తెలుగు అన్ని భాషల్లా కాదు. అందులో ఎలా రాస్తామో అచ్చు అలానే ఉచ్చరిస్తాం' అని తెలుగు వాళ్ళకి చాలా గర్వం. కాని కొంతవరకు 'జరుక్' ఇది అబద్దమని రుజువు చేశాడు. ''సూనాణ'' అని మనం పిలుస్తావేఁ ఆ మాటని ఎలా రాస్తాం? ''సూర్యనారాయణ'' అవి కాదూ? ''సత్యనారాయణ''ని ''సచ్నాణ'' అని అంటావా? అనవా? మకారాన్ని ఓష్ట్యంగా ఉచ్చరించే పాపాత్ముడెవడన్నా ఉన్నాడూ?'' అంటూ చాలా శాస్త్రీయమైన విషయాన్ని సరదాగా చెప్పుకుపోయేరు.
అలాగే మానసిక శాస్త్ర విషయమైన 'పగటి కలల' గురించి ఆలిండియా రేడియోకి ప్రసంగం రాసి ఇస్తూ రమణ- ''పగటికల అనేది మనిషికి దేవుడిచ్చిన మంచి వరాల్లో ఒకటి. మనసులో పేరుకుపోయిన దురాశలను, నిరాశలను అందీ అందని ఆశలుగా పరిమార్చి వేసే మందు మితంగా సేవిస్తే కండకూ గుండెకూ పుష్టినిచ్చే దివ్యౌషధం'' అంటూ సిద్ధాంతీకరించారు.
''పొగడ్త'' అనే వ్యాసంలో దాని మహత్యం గురించి చెబుతూ 'అది అహం కన్నా ఎత్తు. దురాశ కన్న చిన్న. దుర్మార్గుడి ఆలోచనల కన్న లోతు. మంచి వాని మనసు కన్న విశాలం. కుటిల రాజనీతి కన్న వక్రం' అంటారు.
''మెంటాలిటీలు'' అనే వ్యాసంలో ఎన్లార్జిమెంటాలిటీ గురించి రాస్తూ ''ఇది తెలుగువాళ్లకి బాగా అలవాటు. పద్యాలు రాసే ప్రతివాడూ మహాకవి. సినీవేషాలు వేసే ప్రతివాడూ మహా నటుడు. ప్రతి మంత్రి దేశసేవకుడు. కొంచెం పచ్చగా వున్నవాడు కాపిటలిస్టు… కాళిదాసు తెలుగు వాడే… మనవాళ్లుట్టి వెధవాయలోయ్'' అంటారు.
'కథానాయకుని కథ' అంటూ సినీనటుడు నాగేశ్వరరావు జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయడంతో బాటు 'తెలుగు-వెలుగు' శీరిక్షలో అనేకమంది అక్షరచిత్రాలు గీసారు రమణ. అవే కాకుండా ఫన్‌డాక్టర్ చంథ్రేఖరం. శంభుప్రసాద్, బాపు, భమిడిపాటి కామేశ్వరరావు ఇత్యాది మహానుభావుల గురించి రాసారు. ''భకారాగారి నవ్వుల నగారా'' అని జనవరి '97లో రాసిన వ్యాసంలో ''…తన జాతివాళ్లని వెక్కిరించి ఐమూలగా చీల్చి చెండాడి పారేళి సదరు తిట్టు తిన్న జాతి చేత ఓహో శాబాస్ నువ్వురా వైతాళకుడివి అని పొగిడించుకున్న ఏకైక తెలుగు రైటర్ మొనగాడు భకారా (భమిడిపాటి కామేశ్వరరావు) ఒక్కడే'' అని ఆయన పట్ల తమ భక్తి చాటుకున్నారు.
'మి(త)భా(ష)ణం' అనే అని నవంబరు '96నాటి వ్యాసం వాగుడుకాయ వక్తలను హేళన చేస్తుంది. అందులో తనెంతో మితభాషినని చెప్పుకునే వక్త ఇలా అంటాడు- ''నేనెవరి ననుకుంటున్నారు? అనేక సభలలో 'మిభాగ్రేసర చక్రవర్తి' అని బిరుదులు. సత్కారాలు పొందినవాణ్ణి. టైము ఆటోమీటరులా పరుగెడుతోంది. టైము అనగా కాలము చాలా విలువైనది. దానికి విలువ కట్టలేరు. ఎంచేతనంటే కాలము అమూల్యమే. బజార్లో మనం మిరపకాయలు కొనగలం, చింతపండు కొనగలం, ఇడ్లీలూ- కిడ్నీలూ కొనగలం. గొడుగులూ-గోంగురా కొనగలం, లాల్చీలు కొనగలం కానీ కాలాన్ని మాత్రం కొనలేం. కాలాన్ని వృథా చేయటం క్షమించరాని నేరం…'' ఇదీ వరస.
'అపార్థసారథి' అనే వ్యంగ్య వ్యాసం (సెప్టెంబరు '96)లో కలియుగంలో అపార్థానికున్న విలువ గురించి ''అసలివాళ అపార్థమే జీవనానికి ఆయువుపట్టు. బండిని సరదాగా నడిపే ఇంధనం. గాలం చివర ఉన్న ఎర చేపని చూసిన సొరచేప బేవార్సు భోజనంగా అపార్థం చేసుకోకపోతే- జాలరికి, జనానికి భోజనం లేదు… బీదబట్టల వాళ్లంతా దొంగలనీ గొప్పబట్టల వాళ్లంతా దొరలనీ, పాముని తాడనీ, స్వాములార్లు దేవదూతలనీ, మన తప్పుల్ని చూపేవాళ్లు శత్రువులనీ, ఒప్పుల్ని పొగడేవాళ్లు మిత్రులనీ. మన రచనలు అచ్చువేసే పత్రికలు మంచివనీ, వెయ్యనివి కావనీ- ఇలా… ఆ శ్రీ అపార్థసారథి మన జీవన రథాలను తోలుతూనే ఉన్నాడు'' అంటూ ఒక చిత్రమైన పద్ధతిలో రచన సాగించారు. ''మోహన కందాలు'' రాస్తూ ఆశీః అనే పేరుతో పడికట్టు పీఠికలు రాసే పీఠికాధిపతులను వెక్కిరించి వదిలిపెట్టారు.
సమాజంలో తనకు కనబడిన అవకతవకలను దుయ్యబట్టడానికి గిరీశం పాత్రను చక్కగా ఉపయోగించుకుంటున్నారు రమణ. ''గిరీశం లెక్చర్లు''లోని వ్యాసాలు సినిమా రంగాన్నే కాదు. రాజకీయ రంగాన్నీ కొంతమంది సాహితీవేత్తలనూ, తెలుగు తెగుళ్లనూ- అన్నిటినీ పరామర్శించి, వీపు వాయగొట్టి వదిలిపెడతాయి. ఇటీవల (1992) రాసిన 'ఐకమత్యానికి ప్రిరిక్విసిట్ – తేడా' లెక్చరు కూడా తెలుగు సంఘాలు ఐకమత్యంగా పనిచేయకపోవడం గురించి ఎక్కు పెట్టిన బాణమే.
వ్యాసాల్లో రమణ ఇంతటి విస్తృతి చూపారని చాలామందికి తెలియదు. ఆయన కథా రచయితగానే ప్రసిద్ధుడు. అందునా హాస్య రచయితగానే జనాలు ఆయనను జ్ఞాపకం పెట్టుకున్నారు ఈ హాస్యరచనా శైలి కారణంగానే ఆయనను అభ్యుదయ రచయితగా కొందరు గుర్తించరని, ఆరుద్ర ''కానుక''కు 1972లో రాసిన పీఠిక వల్ల తెలుస్తుంది – ''రమణ తొలినుంచీ అభ్యుదయ వాదే. ఇటీవల స్వయంప్రతిపత్తి గల అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు'' అంటూ రాసారు ఆరుద్ర.
'ఫర్వాలేదు మనవాడే' అని ఆరుద్ర కితాబు ఇవ్వవలసి రావడం దురదృష్టకరం. అది రమణ రచనలను సరిగ్గా చదివి అంచనా వేయలేనివారి హ్రస్వ దృష్టిని, వారు ఉపయోగించే తూనిక రాళ్ల పరిమితిని సూచిస్తుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)