Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 4

ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి - 4

ఈ అనువాదాలన్నీ ఏం చేశానన్న అనుమానం రావచ్చు మీకు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తమిళనాడు ఎడిషన్‌ తమిళ రచనల అనువాదాలు వేసినట్టే ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌ తెలుగు కథల అనువాదాలు వేస్తుందేమోనని వాకబు చేశాను. అక్కడ అలాటిది ఏమీ లేదన్నారు. 'పోనీ రమణగారి కోసం ఒక శీర్షిక ''ముళ్లపూడి మిసిలనీ'' పేర అన్ని రకాల రచనలతో ప్రారంభింపచేయండి' అని అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీ ఎడిటరుగా వున్న వాకాటి పాండురంగారావుగారి ద్వారా ప్రయత్నించాను. వాళ్లేమీ కదలలేదు. నేను 1995లో హైదరాబాదుకి బదిలీ అయి వచ్చాక ''దక్కన్‌ క్రానికల్‌'', ''న్యూస్‌టైమ్‌'' దగ్గరకు వెళితే వాళ్లు తెలుగు కథల అనువాదాలు వేయం అన్నారు. చివరకు ''ఎ.పి.టైమ్స్‌'' అనే దినపత్రిక పెట్టి, దాని సంపాదకవర్గంలో వాకాటి చేరాక అప్పుడు తెలుగువాళ్లు రాసిన డైరక్టు ఇంగ్లీషు కథలు,  తెలుగు కథల అనువాదాలు ప్రచురించారు. నేను అనువదించిన 'దాచింపాడు రోడ్డు కథ', 'బైయింగ్‌ బుక్స్‌' అప్పుడు వెలుగు చూశాయి. అంతకుముందే 'ఛాయలు' 1995 తానా సువెనీర్‌కు సంపాదకులుగా వ్యవహరించిన జంపాల చౌదరిగారు దానిలో ప్రచురించారు. తక్కినవి కూడా 'తానా పత్రిక'లో వరుసగా వేద్దామనుకున్నారు కానీ కుదరలేదు.

సినీరచయితగా మారిన సమీక్షకుడు : ''బాపురమణీయం''లో రమణగారి సినిమా సమీక్షలు చాలా చదివాను. ఆనాటి సినిమాల్లో లాజిక్‌ కొరవడినచోట యీయన వాళ్లకు పెట్టిన చురకలు చదివి పడిపడి నవ్వుకున్నాను. తర్వాత ఆయన అముద్రిత రచనలు సేకరిస్తూ పోయినపుడు యింకా ఎన్నో సమీక్షలు చదివి, ఆయన సునిశిత దృష్టికి అబ్బురపడుతూనే, 'అవునూ, మరి సినిమాల్లోకి రచయితగా వచ్చిన తర్వాత యిలాటి పొరపాట్లే యీయనా యిలాటి పొరపాట్లే చేశారెందుకు?' అని అనుకోసాగాను. అడగడానికి సందర్భం రాలేదు. అప్పుడు ''మిస్టర్‌ పెళ్లాం'' సినిమా ప్రివ్యూకి పిలిచారు. అదే నేను చూసిన మొదటి ప్రివ్యూ. మనకు తోచిన తప్పొప్పులు చెపితే వాళ్లు సరిదిద్దుకుంటారు కాబోలు అని అతి నిశితంగా పట్టిపట్టి సినిమా చూశాను. తర్వాత విఎకె రంగారావుగారు చెప్పారు - ''ప్రివ్యూ చూసిన వాళ్లు 'సినిమా బాగుంది, తప్పకుండా సక్సెస్‌ అవుతుంది' అని చెప్పేసి రావాలి తప్ప, సవరణలు చెప్పకూడదు. చెప్పడాలన్నీ రషెస్‌ ఘట్టంలోనే' అని. మనకు తెలియదు కదా. ప్రివ్యూ చూసిన మర్నాడు రమణగారికి నాలుగు పేజీల ఉత్తరం రాశాను - చాలా బాగుంది కానీ.. బ్యాంక్‌ ఘట్టాలు వాస్తవవిరుద్ధంగా వున్నాయి. నిందపడిన హీరో స్టాఫ్‌ యూనియన్‌కి ఫిర్యాదు చేయకుండా యింట్లో కూర్చోడమేమిటి? అని ప్రశ్నలు వేశాను. 

అది చదివి రమణగారు ఫోన్‌ చేశారు - 'ఇలా స్తనశల్య పరీక్ష చేస్తూ కూర్చున్నారా? సినిమా ఎంజాయ్‌ చేశారా?' అని కుశలం అడిగి తర్వాత చెప్పారు - 'నేను చిన్నతనంలో మీలాగే యిలాటివన్నీ తప్పులనుకునేవాణ్ని. మీరు బ్యాంక్‌ వాళ్లు కాబట్టి యూనియన్‌ లీడరేం చేశాడు, సస్పెన్షన్‌ ఆర్డరు యింటి రాలేదేం? లాటివి అడిగారు. సినిమాల్లో కోర్టు సీన్లు చూపిస్తాం. చట్టవ్యవహారాలు తెలిసున్నవాళ్లు 'ముందు సెషన్స్‌కి వెళ్లాలి, ఆ తర్వాతే హైకోర్టుకి.. హైకోర్టుకి సాకక్షులు రారు' యివన్నీ చెప్తారు. సామాన్యప్రేక్షకుడికి యివేమీ పట్టవు. జనం యీ సినిమాను ఆమోదించారు చూశారా..'' అని. సీతారాముడుగారు తన వ్యాసంలో రాశారు - ''బుద్ధిమంతుడు''లో నాగేశ్వరరావు అన్నగారి వేషంలో కనబడిన కాస్సేపటికే మీసంతో కనబడితే ఎలా?' అని సీతారాముడుగారు అంటే 'సీను పండితే ప్రేక్షకుడు లాజిక్కు పట్టించుకోడు' అని రమణగారు అన్నార్ట. ఈ అవగాహన ఆయనకు సినిమారంగంలో అడుగుపెట్టాకనే వచ్చిందనుకోవాలి.

సింప్లిసిటీ : సీతారాముడుగారు యింకో విషయం కూడా రాశారు. బాపురమణల యిళ్లల్లో ఫంక్షన్లు అతి సింపుల్‌గా జరుగుతాయని. ఆ విషయం నాకూ అనుభవమైంది. 1994 అక్టోబరులో వాళ్ల అబ్బాయి వరా పెళ్లయింది. పెళ్లికూతురు బాపుగారి సోదరుడు శంకర్‌ పెద్ద కుమార్తె అరుణ. రిసెప్షన్‌కి పిలిచారు. బాపురమణల సినిమాల్లో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ వచ్చేస్తారేమో ఒక్కసారిగా చూసేయవచ్చని నేనూ, మా ఆవిడా ఆశపడ్డాం. ఎనిమిది గంటల కెళితే ఎవరూ కనబడలేదు. రావి కొండలరావు దంపతులు, ''స్నేహం''లో వీళ్లు పరిచయం చేసిన శంకర్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వంటి వీళ్ల కుటుంబస్నేహితులు  తప్ప మేం గుర్తు పట్టేవారెవరూ కనబడలేదు. అసలు రిసెప్షనే వాళ్లింటికి దగ్గర్లో వున్న ఒక సాధారణ కల్యాణమండపంలో జరిగింది. పక్కనున్న ఫోటో చూడండి. వధూవరులు హాల్లో  ఓ పక్కగా నిలబడ్డారంతే. భారీ వేదిక లేదు, డెకొరేషన్‌, పెద్దపెద్ద కుషన్‌ కుర్చీలు - వగైరాలేవీ లేవు, మెడలో దండలు కూడా లేవు. మాకు చాలా వింతగా తోచింది. నిజానికి వాళ్లింటికి వెళ్లినప్పుడల్లా నాకు వింతగానే వుండేది. సినిమా వాతావరణం ఏమీ కనబడేది కాదు. మర్యాదలు చేయాలంటే 'రేయ్‌, ఎవర్రా అక్కడ, కాఫీ పట్రా' అని పనివాళ్లను పిలిచేవారు కారు. మామూలు యిల్లాల్లా శ్రీదేవిగారే పట్టుకుని యిచ్చేవారు. వరా కూడా ఫలహారాలు తెచ్చేవాడు. అతను ప్రొడ్యూసర్‌గారబ్బాయి. అప్పటికే అసిస్టెంటు డైరక్టర్‌. పూతరేకుల్లాటివి తెప్పించినపుడు రమణగారే స్వయంగా ప్లేట్లో పెట్టి యిచ్చేవారు. 

బాపుగారితో ప్రత్యక్షపరిచయం :రమణగారు తెలిస్తే బాపుగారు కూడా సాధారణంగా తెలిసిపోతారు. నా విషయంలో లేటయ్యింది. 1994 న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ కార్డు బాపు, రమణల సంతకాలతో వస్తే ఫోన్‌ చేసి 'బాపుగారికి నేనెవరో తెలుసాండి!?' అని అడిగాను. 'తీరిక వేళల్లో నేను బాపు సంతకం ఫోర్జరీ ప్రాక్టీసు చేస్తూంటాను.' అన్నారు రమణగారు చిరునవ్వుతూ. 'అయబాబోయ్‌, సెలబ్రిటీ కదాని మీ చేత మా బ్యాంకులో ఎక్కవుంటు ఓపెన్‌ చేయిద్దామని చూస్తూంటే మీ ఫోర్జరీ కళ గురించి చెప్తారేమిటండి బాబూ' అంటే పకపకా నవ్వేశారు. 

వరా పెళ్లి సందర్భంగా వాళ్ల యింట్లో విడిగా విందు యిచ్చినపుడు బాపుగారితో ప్రత్యక్షపరిచయం అయింది. పెద్దగా ఏమీ మాట్లాడలేదు. కొన్ని నెలల తర్వాత నా ''అచలపతి కథలు'' సీరియల్‌గా వేయడానికి ''రచన'' పత్రిక ఆమోదించింది. పిజి ఉడ్‌హవుస్‌ సృష్టించిన ఊస్టర్‌ పాత్ర ఆధారంగా అనంతశయనం తయారయ్యాడు. అతని వ్యాలే అయిన జీవ్స్‌ పాత్ర ఆధారంగా అచలపతి పాత్రను రూపొందించాను.  'సీరియల్‌కు లోగో బాపుగారి చేత లోగో వేయించండి. తక్కిన చిత్రకారులు ఉడ్‌హవుస్‌ను చదివారో లేదో నాకు తెలియదు. వ్యాలే అన్నది మన యిండియన్‌ వాతావరణంలో లేదు.  అతన్ని ఎలా చిత్రీకరించాలో బాపుగారి కైతేనే తెలుస్తుంది.'' అని రచన శాయి గార్ని కోరాను. రమణగారి పాత కథలు తవ్వి తీస్తున్నప్పుడు బయటపడిన ''భోగిమంట'' కథను అప్పుడే మార్కెట్లోకి వస్తున్న బాపు ఫాంట్‌లో మద్రాసులోనే టైపు చేయించి ఆయనకు పంపాను. ఆయన దాన్ని రచనలో ముద్రించారు. ఆ చనువు కొద్దీ బాపుగారి చేత లోగో వేయించమని అడిగాను. ''మీరు మద్రాసులోనే వున్నారుగా, మీరే అడగండి.'' అన్నారాయన. డైరక్టుగా అడిగే ధైర్యం లేక రమణగారి చేత అడిగించాను. 

''మూడు కథలు పంపండి. నచ్చితే వేస్తానన్నాడు.'' అన్నారు రమణ. పంపా. బాపుగారికి నచ్చాయి. అద్భుతమైన కాన్సెప్టుతో వేసి యిచ్చారు. ఉడ్‌హవుస్‌ రాసిన ఏ ఇంగ్లీషు పుస్తకం మీదా ఆ పాత్రలు అంత సజీవంగా వచ్చి వుండవు. పోనీ జీవ్స్‌ వచ్చినా, ఊస్టర్‌ విషయంలో మాత్రం బాపుగారిదే పై చేయి. బస్తీ మే సవాల్‌. దరిమిలా ''అచలపతి కథలు'' బాగా పాప్యులరై 2005లో పుస్తకరూపంలో వచ్చినపుడు బాపు లోగోనే ముఖచిత్రంగా వాడుకున్నాను. రమణగారు ముందుమాట రాసి నన్ను ఆశీర్వదించారు. ''బొమ్మా-బొరుసూ'' పుస్తకం తయారయ్యాక, నేను హైదరాబాదు వచ్చేశాక బాపుగారితో కూడా అనుబంధం బాగా పెరిగింది. ఆయనంటే బెరుకు పోయింది - ఒక్కోప్పుడు వాదానికి దిగేటంతగా!  (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?