సినిమాలు అమ్ముడు పోవడం లేదు

మా సినిమా టేబుల్ ప్రాఫిట్..మా సినిమా అన్ని ఏరియాలు అమ్మేసాం..శాటిలైట్ సూపర్ అమౌంట్ పలికింది. ఇలాంటి మాటలు తరచు నిర్మాతల నోట వినిపిస్తుంటాయి. కానీ నిజాలు వేరుగా వుంటున్నాయి. అంకెలు చెప్పుకుని, ఆనందించడమే కానీ,…

మా సినిమా టేబుల్ ప్రాఫిట్..మా సినిమా అన్ని ఏరియాలు అమ్మేసాం..శాటిలైట్ సూపర్ అమౌంట్ పలికింది. ఇలాంటి మాటలు తరచు నిర్మాతల నోట వినిపిస్తుంటాయి. కానీ నిజాలు వేరుగా వుంటున్నాయి. అంకెలు చెప్పుకుని, ఆనందించడమే కానీ, కాసుల కళ్ల చూడడం అరుదుగా జరుగుతోంది. గడచిన రెండు మూడు నెలలుగా బోలెడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు గట్టెక్కామని, నో ప్రోబ్లమ్ అని చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవాలు వేరుగా వున్నాయని తెలుస్తోంది. బయ్యర్లు సినిమాలు కొనడానికి ముందుకు రావడం లేదని, కావాలంటే అడ్వాన్స్ లు ఇస్తాం, పంపిణీ చేస్తామని మాత్రమే చెబుతున్నారని తెలుస్తోంది. నిర్మాతలు తప్పని సరి పరిస్థితుల్లో అందుకు అంగీకరించి సినిమాను జనంలోకి పంపాల్సి వస్తోంది. వాళ్లిచ్చిన అడ్వాన్సులు చూసుకుని కలెక్షన్లు వింటూ సంబర పడడం తప్ప, చివరికి చేతికి వచ్చేది అంతంత మాత్రంగా వుంటోంది. 

గీతాంజలి సినిమా సూపర్ అని చెబుతున్నారు. దాన్ని అమ్మలేక, దిల్ రాజు చేతిలో నైజాం, వైజాగ్ ఏరియాలు వుంచారు. సంపత్ నంది గాలిపటం ఒకటి రెండు ఏరియాలు మినహా సురేష్ వారి చేతిలో వుంది. వాళ్లంతా కలెక్షన్లు చూడాలి, థియేటర్ల అద్దెలు పోవాలి, ఖర్చులు తీయాలి. మిగిలితే నిర్మాతకు. లేదంటే లేదు. 

ఇటీవలి కాలంలో కాస్త లాభాలు కళ్ల చూసిన సినిమా కేవలం రన్ రాజా రన్ మాత్రమే. అంతకు ముందు దృశ్యం. దృశ్యం సినిమా వెంకీ పారితోషికం తీసేసినా పది నుంచి పదిహేను కోట్ల లాభం చవిచూసింది. మరోపక్క చిన్న సినిమాలకు కూడా ఖర్చు పెరిగి మీడియం రేంజ్ కు చేరుకుంటున్నాయి. రన్ రాజా రన్, ఆరు కోట్లు దాటింది ఖర్చు. గాలిపటం అసలు సిసలు ఖర్చు అయిదు వరకు అయింది. లవర్స్ సినిమా ఖర్చు అయిదు మేరకు చేరింది. నిజానికి ఆ సినిమా చూస్తే అంత ఖర్చా అనిపిస్తుంది. అయితే సినిమా మేకింగ్ లో వచ్చిన తేడాలు, తీసిందే మళ్లీ తీయడం వంటి వాటి వల్ల ఖర్చు తడిసి మోపెడయిందని తెలుస్తోంది. 

సికిందర్ సినిమా హక్కులు 13 కోట్లకు కొన్నారు. అమ్మేసామని అంటున్నారు. సేఫ్ అంటున్నారు.కానీ నిజానిక కేవలం అడ్వాన్స్ ల మీదే సినిమా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ వల్ల ఆది సేఫ్ జోన్ కు చేరడం కష్టమవతుంది. 

టాలీవుడ్ సినిమా 3 కోట్ల నుంచి 15 కోట్ల రేంజ్ లోనే బాగుంటొంది. చిన్న సినిమా మూడు కోట్లయితే ఏ మాత్రం బాగున్నా సగం శాటలైట్ వచ్చి గట్టేక్కే అకవాశం వుంటుంది. పెద్ద సినిమా 15 కోట్లయితే, భారీ విడుదల ప్లాన్ చేస్తే మొదటివారం తొమ్మిది వరకు లాగేస్తోంది. రెండో వారం, శాటిలైట్ కలిపి గట్టెక్కుతున్నారు. అంతకు మించిన బడ్జెట్ కు వెళ్లారో కష్టమే. అందుకనే ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ సినిమాల ఓపెనింగ్ లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.

'చిత్ర'గుప్త