ఇదో తరహా కొత్త స్ట్రాటజీ

సినిమా అంతా అయిపోయాక చివర్లో “పార్ట్ 2” అంటూ చిన్న లీడ్ ఇవ్వడం ఇటీవల మామూలైంది

సినిమా అంతా అయిపోయాక చివర్లో “పార్ట్ 2” అంటూ చిన్న లీడ్ ఇవ్వడం ఇటీవల మామూలైంది. సినిమా హిట్ అయితే పార్ట్ 2 వుంటుంది. లేదంటే లేదు. అలా చాలా సినిమాల పార్ట్ 2లు పెండింగ్‌లో పడిపోయాయి.

సినిమాకు సీక్వెల్ ఉందని ప్రకటించకపోయినా, హిట్ అయితే సీక్వెల్ ప్రకటించడం మరో పద్ధతి. ఇది కాకుండా మూడో పద్ధతి కూడా వచ్చింది ఇప్పుడు. సినిమా హిట్ అని చెప్పడం కోసం సీక్వెల్ అనౌన్స్ చేయడం.

‘జాట్’ సినిమాకు అదే చేశారు నిర్మాతలు మైత్రీ మూవీస్. దర్శకుడు గోపీచంద్ మలినేని నార్త్ ప్రేక్షకులకు సౌత్ ఇండియా మాస్ ఫ్లేవర్‌ను రుచి చూపిస్తూ చేసిన సినిమా జాట్. అనుకున్న రేంజ్‌కు వెళ్లలేకపోతోంది. తొలి రోజు హడావుడి, కార్పొరేట్ బుకింగ్‌ల సంగతి అలా ఉంచితే, కాస్త మెలమెల్లగా ముందుకు సాగుతోంది. దీనికి కాస్త మంచి పుష్ ఇవ్వాలనుకున్నారు నిర్మాతలు. అందుకే వున్నట్లుండి, ‘జాట్ 2’ అంటూ అనౌన్స్ చేసేశారు.

ఇది కాస్త షాకింగ్‌నే. ఎందుకంటే జాట్ బ్యాడ్ మూవీ కాదు. అలా అని సూపర్ హిట్ మూవీ కూడా కాదు. దర్శకుడు గోపీచంద్ మలినేని త్వరలో బాలయ్య సినిమా మీదకు వెళ్తున్నారు. దాని నుంచి వచ్చిన తరువాత ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో వున్నట్లుండి సీక్వెల్ అనౌన్స్ చేయడం అంటే ఈ వీకెండ్‌ మరి కాస్త కలెక్షన్లు రాబట్టడం కోసం తప్ప, వేరే ఉద్దేశం లేదు అనుకోవచ్చు.