మూవీ రివ్యూ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ఇదొక బోరింగ్ చిత్రం. కథ, కథనాలు వాస్తవానికి దూరంగా ఉండి మనసుకి హత్తుకోవు.

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
రేటింగ్: 1.75/5
బ్యానర్: మాంక్స్ అండ్ మంకీస్
తారాగణం: ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి, సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, మురళిధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు
కెమెరా: బాల్ రెడ్డి
ఎడిటింగ్: పీ కే
సంగీతం: రథన్
కథ- సంభాషణలు: సందీప్ బోళ్ల
దర్శకత్వం: నితిన్-భరత్
విడుదల: ఏప్రిల్ 11, 2025

పవన్ కళ్యాణ్ తొలిచిత్రం టైటిల్ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” ని తీసుకుని ప్రదీప్ మాచిరాజు తెర మీదకి వచ్చాడు. ట్రైలర్ ని బట్టి ఉన్నంతలో వినోదమేదో ఉంటుందన్న అభిప్రాయాలు కలిగాయి. ఇంతకీ ఇందులో ఉన్నదేమిటి, లేనిదేమిటి చూద్దాం.

కథలోకి వెళ్తే.. ఆంధ్ర-తమిళనాడు బార్డర్లో భైరిలంక అనే పల్లెటూరు. ఆ ఊళ్ళో అందరూ మగపిల్లలే. లేక లేక ఒక ఆడపిల్ల పుడుతుంది. అప్పుడే కరువులో ఉన్న ఊళ్లో వాన కూడా పడుతుంది. దాంతో ఆ ఊరికి ఒక కట్టుబాటు మొదలవుతుంది. ఆ అమ్మాయి రాజకుమారి (దీపిక పిల్లి) పెరిగి పెద్దదయ్యాక ఆ ఊళ్లో ఉన్న 60 మంది అబ్బాయిల్లో ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి… అంతవరకు ఊరు దాటి కూడా వెళ్లకూడదు!

ఇదిలా ఉంటే కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఆ ఊరికి సివిల్ ఇంజనీర్ గా వస్తాడు. అక్కడ మరుగుదొడ్లు కట్టడం అతని కాంట్రాక్ట్. అతని పక్కన ఒక సైడ్ కిక్ (సత్య). ఆ ఊళ్లో ఉన్న 60 మంది కుర్రాళ్లు రాజకుమారి కోసం పోటీలు పడుతుంటారు. పొరుగూరు నుంచి వచ్చిన ఈ ఇద్దరిపై కన్నేసి ఉంచుతారు.

ఈ నేపథ్యంలో కృష్ణ-రాజకుమారిల ప్రేమాయణం మొదలవుతుంది. విషయం తెలిసిన ఊరి పెద్ద కొత్త షరతు పెడతాడు. అదేంటంటే ఆ ఊళ్లో ఉన్న 60 మంది మగాళ్లకి పెళ్లి చేసాక గానీ కృష్ణ-రాజకుమారిలు పెళ్లి చేసుకోకూడదు! ఆ తర్వాత ఏమౌతుందనేది కథ.

ఈ కథ మొత్తం లాజిక్ కి వంద కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంటుంది. ఇలాంటి ఊరు, జనం, కట్టుబాట్లు ఉంటాయా అని అనుకుంటుండగా కేరళలో వాయతి అనే ఊరు ఇలానే ఉంటోందని ఒక డైలాగ్ చెప్తాడు హీరో. పోనీ ఉందనే అనుకుని చూద్దామనుకున్నా సహనాన్ని పరీక్షంచక మానదు.

ఇంత బలహీనమైన రచన ఎలా చేసారా అని ఆశ్చర్యమేస్తుంది. ఎంత ప్రపంచం చూడని జనమే అనుకున్నా టాయిలెట్ కమోడ్ ని గోడకి ఫిక్స్ చేయడం.. దానిని కామెడీ అనుకుని ప్రేక్షకులు నవ్వుతారనుకోవడం రచయితల ఐ.క్యూ ని చెబుతుంది. అలాగే 60 మందికి సరిగ్గా 60 మంది అమ్మాయిలు కంటైనర్ లో దొరికేయడం మరొక కన్వీనియంట్ పాయింట్. ఎక్కడా మెదడుకి అలసటనివ్వకుండా, అసలు కథ మీద, స్క్రీన్ ప్లే మీద కసరత్తు చేయకుండా రాసుకోవడం చూస్తే ప్రేక్షకుల్ని మరీ ఇంత తక్కువ అంచనా వేసారా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఉన్నా నాలుగు నవ్వులు పండకపోవడం, సత్య ఉన్నా సరైన పంచులు పేలకపోవడం..అన్నీ ఉన్నా ఏమీ లేని ఫీలింగొస్తుంది.

ప్రధమార్ధంలో హీరోకి, సత్య కి మధ్యన సాగే టీవీ సీరియల్ పాటల ట్రాక్ కూడా నవ్వించదు. ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న సీన్లున్నాయి తప్ప, అసలా సీన్లు అవసరమా, అవసరం లేకుండా పెడితే ఎఫెక్ట్ వస్తుందా అనే లెక్క వేసుకున్నట్టు లేదు. ప్యాన్ ఇండియా ప్రభాకర్ పేరుతో వచ్చే బ్రహ్మాజి పాత్ర కూడా తేలిపోయింది.

మొత్తం సినిమాలో “పాణీ- పానీ; బిలాల్-జలాల్” అనే షాట్ తప్ప ఎక్కడా క్రియేటివిటీ కనిపించదు, వినిపించదు. ప్రధమార్ధంలో ఒకటి రెండు అలాంటి మొమెంట్స్ తప్ప అసలు కామెడీయే లేదు. కథ, పాత్రలు, పాత్రల ప్రవర్తన అన్నీ అసహజంగానే ఉన్నాయి.

సాంకేతికంగా చూస్తే రధన్ సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి కానీ “పిల్ల ఎంత మాయ చేసావే..” అనే పాట వాయిస్ ప్రదీప్ కి నప్పలేదు. మాంటేజ్ వాయిస్ గా ఉంటే సరిపోయేది. ఐటం సాంగ్ ఔట్ డేటెడ్ గా ఉంది. కెమెరా వర్క్ చెప్పుకునే విధంగా ఉంది. ముఖ్యంగా ఇంటెర్వల్ ముందు ఒక పాటలో వాడిన లైటింగ్ ఎఫెక్ట్ వగైరాలు పొయెటిక్ గా ఉన్నాయి. కథనంలో సమస్య మూలాన సినిమా నిడివి చాలా ఎక్కువలా అనిపిస్తుంది. ఎడిటర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి.

ఇక ప్రదీప్ మాచిరాజు గురించి చెప్పుకోవాలి. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి ఇలాంటి చిత్రాన్ని చూడమని ముందర పెడితే కెరీర్ పట్ల శ్రద్ధ లేదా లేక కంటెంట్ పై అవగాహన లేదా అనిపిస్తుంది. దర్శకుడు కోరినట్టు ఆ డైలాగులేవో చెప్పేస్తూ చేసాడు తప్ప ఎక్కడా పాత్రలో ఇన్వాల్వ్ అయినట్టు కనిపించలేదు. అసలలా ఇన్వాల్వ్ అయ్యేలాంటి రచన లేకపోవడం కూడా కారణమే.

దీపిక పిల్లి స్క్రీన్ ప్రెజెన్స్ కి, కథలో పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ కి పొంతన లేదు. అయినప్పటికీ ఆమె కాంఫిడెంట్ గా నటించింది.

సత్య, గెటప్ శీను ఒకటి రెండు సీన్లలో కాస్త నవ్వించగలిగారు. మిగిలిన నటుల్ని పెద్దగా వాడుకోలేదు.

మొత్తంగా చూస్తే ఇదొక బోరింగ్ చిత్రం. కథ, కథనాలు వాస్తవానికి దూరంగా ఉండి మనసుకి హత్తుకోవు. కమెడీ రిలీఫ్ లేక, సరైన కన్విక్షన్ లేక ఆద్యంతం భారంగా ఉండి ఎప్పుడెప్పుడైపోతుందా అనిపిస్తుంది. ప్రధమార్ధం నీరసపడేలా ఉంటే, ద్వితీయార్ధం నిట్టూర్చేలా ఉంది. రాసుకున్న వాళ్లకేమో కానీ, చూసిన వాళ్లకి మాత్రం పిసరంత వినోదం లేని సినిమా ఇది. ఓటీటీల్లో ఓకే ఏమో తప్ప, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమైతే ఇలాంటి సినిమాలు కష్టం. బాక్సాఫీసు కలెక్షన్స్ ఆశించి “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అని టైటిల్ పెట్టి ఇలాంటి సినిమా తీస్తే “ఇంట్లో ప్రేక్షకులు” అని క్యాప్షన్ వేసుకోవాల్సి వస్తుంది.

బాటం లైన్: ఇంట్లో ప్రేక్షకులు

13 Replies to “మూవీ రివ్యూ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”

  1. కొంచం అక్షర దోషలు లేకుండా రాయండి….. చాలా తప్పులు ఉన్నాయి….. ఒకసారి సరి చూసుకొండి

  2. ఆ సినిమా పేరు మహిమ ప్రదీప్ కి బుర్ర అనేది లేదు పోయి పోయి ప్లాప్ సినిమా పేరు పెట్టుకుంటే ఇట్లే వస్తుంది

Comments are closed.