వీడియోతో పాటు దొరికిపోయిన ‘విలన్’

ఓవైపు డ్రగ్స్ ఆరోపణలు, మరోవైపు హీరోయిన్ ఆరోపణలతో షైన్ టామ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు.

ఇప్పటికే పీకల్లోతు వివాదంలో కూరుకుపోయాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. తెలుగు, తమిళ భాషల్లో చిన్నచిన్న వేషాలు వేస్తూ కెరీర్ లాగిస్తున్న ఈ నటుడిపై విన్సీ అలోసియస్ అనే నటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ వేడి ఇంకా చల్లారకముందే, ఇప్పుడు మరోసారి దొరికిపోయాడు షైన్ టామ్ చాకో. నిన్న అర్థరాత్రి ఎర్నాకుళంలోని ఓ హోటల్ పై యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించింది. ఆ దాడి జరగడానికి కొద్దిసేపటి ముందు, షైన్ టామ్ చాకో అక్కడ్నుంచి పారిపోయాడు. ముందుగా మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి దూకి, అక్కడ్నుంచి మెట్ల మార్గంలో, స్విమ్మింగ్ పూల్ మీదుగా పరారయ్యాడు.

అతడు ముందస్తు సమాచారంతోనే తప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో ఇది కాస్తా రాజకీయ దుమారంగా మారింది.

డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలపై షైన్ టామ్ చాకో 2015లోనే అరెస్ట్ అయ్యాడు. తాజాగా ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అంతలోనే ఇలా అతడు హోటల్ నుంచి పారిపోవడం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారాయి.

మరోవైపు షైన్ టామ్ చాకోపై సోషల్ మీడియాలో పరోక్షంగా ఆరోపణలు చేసిన నటి విన్సీ అలోసియస్, నేరుగా అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్-‘అమ్మ’ను సంప్రదించారు. షైన్ టామ్ పై ఆమె నేరుగానే ఫిర్యాదు చేశారు.

సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ టైమ్ లో షైన్ టామ్ డ్రగ్స్ తీసుకున్నాడని, తనతో అసభ్యంగా కూడా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేశారు. సెట్స్ లో కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే విషయాన్ని ఈమధ్య హేమ కమిటీ కూడా హైలెట్ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ‘అమ్మ’ నిర్ణయించింది. ఆరోపణలు నిజమైతే, మల్లువుడి లో షైన్ టామ్ పై జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉందంటున్నారు. ఓవైపు డ్రగ్స్ ఆరోపణలు, మరోవైపు హీరోయిన్ ఆరోపణలతో షైన్ టామ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు.

2 Replies to “వీడియోతో పాటు దొరికిపోయిన ‘విలన్’”

Comments are closed.