జీవితానికి ప్రతిబింబంగా కథను మలిచేటప్పుడు వాస్తవాలకు బురద, రక్తం పులిమితేనే ఉత్తమ రచన అవుతుందని, దానికి హాస్యపు పూత పూస్తే కాలక్షేపం రచన అవుతుందని అనుకోవడం చాలా పొరబాటు. ఆకలేస్తే కేకలేసే తీరాలన్న నియమం లేదు. జోకులు కూడా వేయవచ్చు. తన చుట్టూ ఉన్న మనుష్యులను మేల్కొల్పి వారికి సరైనదారి చూపించడమే రచయిత లక్ష్యమైనప్పుడు వారిని తిట్టడం ఒక పద్ధతైతే. వారి ముందు అద్దాన్ని నిలిపి 'చూసుకోండర్రా మీ వికారాలు' అని తెలియజెప్పి వారిని మార్చే ప్రయత్నమూ చేయవచ్చు. రావి శాస్త్రి 'రాజు-మహిషి'లో డొక్కు గుమాస్తా 'మనం…' అతి వెటకారంగా చెప్పుకొచ్చిన దెవరి గురించి? పెట్టీ బూర్జువా అనండి, మధ్య తరగతి అనండి. మరొకటనండి వారి గురించే కదా. 'మనమెంత వెధవాలయమో గుర్తించండి' అని చెప్పడమే కదా దాని లక్ష్యం.
జీవితంలో విషాదాన్ని ప్రదర్శిస్తూనే దాన్ని చమత్కారంగా చెప్పుకు రావడం. విలక్షణమైన ఉపమానాలు అనేకంగా ఉపయోగించడం రావిశాస్త్రి స్టయిలైతే ఆయన కంటే ముందే దాన్ని తన రచనల్లో ప్రవేశపెట్టినవాడు రమణ. 'ఛాయలు' 'అకలి-ఆనందరావు' 1953 నాటి రచనలని గుర్తుంచుకోవాలి ఈ సందర్భంలో. అప్పుడు రమణ వయస్సు 22.
పుస్తకాలు చదివేది మధ్యతరగతి వర్గాలే. అందునా లోయర్ మిడిల్ క్లాసు ఎక్కువ. మరి ప్రింటు మీడియాలో వారి గురించి రాయాలా? వద్దా? రాసినప్పుడు వారిలో తను చూసిన దంబాలను, మూఢ నమ్మకాలను, ఆశపోతుతనాన్నీ రమణ చూపలేదా? ధనిక వర్గాలనే వెనకేసుకొచ్చాడా? ఏ రకమైన దోపిడీలపైనా సంస్కృతి పేరుతో సమర్థించాడా? మూడభక్తిలో మునిగితేలే మాధవాచార్యుడికి (''బుద్ధిమంతుడు'') చివరికి మానవుడే మహనీయుడని. దైవలీలలు జరగవని జ్ఞానదోయం కలిగినట్లు చూపించాడు. నాస్తికుడూ, 'గుడి కాదు. బడే ముఖ్యమ'ని వాదించిన అతని తమ్ముణ్నీ హీరో చేసాడు. కొంపలు మునిగిపోబోతున్నాయని ప్రచారం చేసే వీరబ్రహ్మవాదులను (ప్రాఫెట్స్ ఆప్ డూమ్స్ డే) 'జలప్రళయం' అనే కథలో చీమల మీద పెట్టి నవ్వుల పాలు చేసాడు. అలాగే కాస్త అసింటా ఉండమనే బామ్మగారికి 'మీరాయన ప్రసాదం తింటున్నారు కానీ రాముడు మీ కులం వాడు కాదు సుమా' అని గుర్తుచేస్తాడు ''అందాల రాముడు''లో.
'కానుక' కృష్ణుడి మహిమ ఉగ్గడించే కథ కాదు. దానిలో కనిపించేది తను నమ్మినదానిపై మనిషికి కలిగే భక్తిభావం. తను చేసే పనిలో పెర్‌ఫెక్షన్ సాధించాలనే ఒక భక్తుడి ఆరాటం. అది కృష్ణుడికి ఇవ్వదలిచిన మురళి కావచ్చు. రాముడికి శబరి ఇద్దామనుకున్న పండు కావచ్చు. ఒక పార్టీ వర్కరు తమ నాయకుని రాకకై తయారు చేద్దామనుకున్న జండా కావచ్చు.
'సీతా కళ్యాణం' కథలో కూడా రాజులు, ఋషుల గురించే కాదు, సామాన్యులు ఏమనుకుని ఉంటారో అని ఊహించి వారి అభిప్రాయాలు కూడా రాసాడు. 'ప్రాణ మిత్రులు' సినిమా కథలో హీరో కార్మిక సంక్షేమానికీ, స్నేహానికీ సంఘర్షణ వచ్చినప్పుడు కార్మికులకు దన్నుగా నిలబడతాడు. వడ్డీ వ్యాపారస్తులను (ఈశ్వరేచ్ఛ), భూస్వాములను, రాజకీయ నాయకులను, పల్లెటూరి ప్రజలను అడలేసే అధికార్లను (దాచింపాడు రోడ్డు కథ) అందరినీ దుయ్యబట్టాడు రమణ. అర్థంలేని రూల్స్ (శాసన క్రీడాభిరామము)ను వెక్కిరింతపాలు చేసాడు.
రమణ రచనలు చదివితే ఆయనకు రాజకీయ స్పృహ బాగా వుందని తెలుస్తుంది. నిస్పృహతో రాస్తేనే సామాజిక స్పృహ ఉన్నట్టు లెక్కవేస్తే ఏమీ చెప్పలేం కానీ 'రాజకీయ బేతాళ పంచవింశతి' రచించిన వాడికి ఆ స్పృహ లేదనుకోవడం దుస్సాహసం. ఆ కథా సంపుటిలో రాజకీయ రక్కసి జడలు విప్పుకుని విశ్వరూపం ప్రదర్శిస్తుంది. 'ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు' వంటి ప్రేమ కథలో సైతం గుడి కట్టించే రాజకీయమూ, ఎన్నికల క్లయిమాక్స్ గా కూర్చారు. ప్రజలందరూ సంఘటితమై దోపిడీదారుణ్ణి ఎదిరించాలిగానీ బెదిరి తమ క్షేమం కోసం పాకులాడకూడదని 'సాక్షి'లో నిరక్షరాస్యుడి చేత చెప్పించాడు రమణ. 'పక్కవాడు ఎలాగూ చేస్తాడులే తనెందుకు శ్రమించడమని ప్రతివాడూ అనుకుంటే వ్యవస్థ బాగుపడదని' రాజకీయ బేతాళ… లో 'నేరమూ – శిక్షా' కథలో చెప్పాడు.
'రాధమ్మ బాకీ' (రాధా గోపాలం) కథలో అదర్‌సైడ్ ఆఫ్ ది కాయిన్ చూపాడు రమణ. సాధారణంగా తామే స్త్రీల కోసం ఊహూ తపించి పోయి, ప్రేమించి పెళ్లాడి వాళ్లని ఉద్ధరించామని అనుకునే పురుషులకు కనువిప్పు కలిగేట్లా, స్త్రీలు కూడా తాము వలచిన వారి కోసం ఎలా తపన పడతారో, ఎన్ని కష్టాలు పడతారో, అయినా పెదవి విప్పి ఎందుకు చెప్పరో ఆ కథలో చక్కగా వర్ణించారు. రమణ తీసిన సినిమా కథలన్నింటిలోనూ స్త్రీ పాత్రలు చాలా బలంగా, దృఢ సంకల్పంతో ఉంటాయి. 'సాక్షి', 'గోరంత దీపం', పెళ్లీడు పిల్లలు', 'లాయర్ సుహాసిని', 'పెళ్లి పుస్తకం', 'మిస్టర్ పెళ్లాం', 'రాంబంటు' – వీటన్నిటిలోనూ కూడా స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తారు. డీలాపడిన పురుషులకు ధైర్యం చెప్పి, ముందుకు నడిపిస్తారు. 'రాధా గోపాలం' కథల్లో రాధ అలిగి గోపాలానికి విడాకులిచ్చేసి, అల్ట్రా ఫెమినిజాన్ని నిలబెట్టకపోవచ్చు కానీ 'ముత్యాల ముగ్గు'లో పెద్దగా చదువుకోని పల్లెటూరి అమ్మాయి సహితం ''సిఫార్సులతో కాపురాలు చక్కబడవు మామగారూ'' అని తిరస్కరిస్తూ తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుంది. స్త్రీ పాత్రలను ఇంత శక్తిమంతంగా రమణ తీర్చిదిద్దడానికి స్ఫూర్తి ఆయన తల్లి ఆదిలక్ష్మిగారు. చిన్న వయస్సులోనే భర్త పోగా, ధైర్యంగా మద్రాసు మహా నగరానికి తరలివచ్చి హిందీ టీచరుగా పనిచేస్తూ కొడుకును పెంచి పెద్దచేసిన దృఢ సంకల్పం గల మహిళ ఆమె.
''విలువైన వలువల లోపల శిలలైన గుండెలు గల జనారణ్యంలో విలాసంగా నిలిచివున్న నీకు తన ఉనికి చిరాకు కలిగించ వచ్చనే భయంతో, తన మాసిపోయిన జీవితంలో పాతిక సంవత్సరాల దొంతర క్రింద నలిగి మాసిన పాత చిరునవ్వు శిథిలాలను చూపించి నిన్ను కానీ అడగడానికి వస్తున్న జీవచ్ఛవం. శత సహస్రచ్ఛాయలతో క్షణక్షణం విస్తృతమౌతున్న సారవంతమైన శ్మశాన భూవాటిక మధ్య నిలిచి వున్నాడు ఆనందరావు – తన శరీరాన్ని స్వహస్తాలతో భూస్థాపితం చేసే సంకల్పంతో ('ఆకలీ-ఆనందరావు'), ''…. ఒక హైక్లాసు ముష్టివాడూ, పెద్ద హోటల్లో క్లీనరూ బేరాలాడి ఒప్పందం కుదర్చుకుంటున్నారు. 'వారానికి అర్ధరూపాయి ఇస్తే భోజనపు హోటలు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చేవరకూ వుంచి రాగానే నీకు పడేస్తా…' అంటున్నాడు క్లీనరు… (మహారాజూ యువరాజూ) అని రాయగలిగేవాడికి సామాజిక స్పృహ లేదనుకోవడం స్పృహలో ఉన్న వారనుకోవలసినది కాదు.
రమణ తన రచనాస్త్రాలను ఎక్కుపెట్టినది ప్రధానంగా మధ్యతరగతి ప్రజల పైననే. కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి, తన స్వార్థం కోసం ఇంకోళ్లను బలి చేయడానికి వెనుకాడని సుబ్బారావు మామగారు (జనతా ఎక్స్‌ప్రెస్), డొక్కుదైనా సరే ఓ కారు కొనేస్తే గొప్పవాళ్లయిపోతామనుకునే సుందరమ్మ (జనతా ఎక్స్‌ప్రెస్), ఇంట్లో పెళ్లాం పిల్లలు పస్తులున్నారని తెలిసినా చేతిలో ఉన్న ఒక్క రూపాయి హోటల్లో తిండికి ఖర్చు పెట్టేసిన చిరుద్యోగి (మహరాజూ యువరాజూ), తిండికి లేకపోయినా సిగరెట్టు కోసం తపించే నిరుద్యోగి (మహరాజూ యువరాజూ) మామయ్య వాచీ తాకట్టు పెట్టేసి పేకాడేసిన గురునాధం (ఈశ్వరేచ్ఛ), సినిమా లోకంలోనే నివసిస్తూ ఇహలోకంలో విఫలమయ్యే యువకుడు (సెరిబ్రల్ సినేమియా); తమ్ముడి కోసం వెతుకుతూ, సినిమా చూడ్డానికి వెళ్లిపోయిన ఎస్కేపిస్టు పగటికలల కుర్రాడు (ఛాయలు) వీళ్లందరినీ కాగితాలపై కెక్కించి వాళ్లను వెక్కిరించిన రమణ లక్ష్యం ఏమిటి? ఆయన నిష్క్రియాత్వాన్ని నిరసించాడు. అందుకే గురుదత్ ''ప్యాసా''లో ఉత్తమ కళాంశాలున్నాయని అంటూనే హీరో పాత్రను దుయ్యబట్టాడు.
మెతుకుని పట్టి చూసి అన్నాన్ని అంచనా వేయడం అన్నీ ఒకలాటి రచనలు చేసేవారి విషయంలో సాధ్యం కానీ, వివిధ రకాల రచనలు చేసి, పులగం వండే రమణలాటి వారి విషయంలో ఆ పద్ధతి తప్పుతుంది. 'గురుపీఠం మెతుకు పట్టి చెప్పేసింది. దాన్ని వాసన కూడా చూడనవసరం లేద'ని భావించే 'అభ్యుదయులు' రమణ రచనల జోలికి పోకుండానే వాటి గురించి ఏవో అభిప్రాయాలు ఏర్పరచుకొని ఉండవచ్చును. 'రమణ స్కూలు' అంటేనే అంటరాని దానిగా పరిగణించేవారి సౌలభ్యం కోసం ఆయన కథలను రేఖామాత్రంగా పరిచయం చేస్తాను.
రాజకీయాల గురించి రాసిన 'రాజకీయ బేతాళ పంచవింశతిక', సినిమా రంగంలో పైకొద్దామని చేసే ప్రయత్నాల గురించిన 'విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు' అప్పులు ఇచ్చి పుచ్చుకో(కపోవ)డాల గురించిన 'ఋణానందలహరి' ఇవన్నీ కూడా కథామాలికలే. అయినా వాటిలో సబ్జెక్ట్ పేరు బట్టే తెలుస్తుంది కాబట్టి వాటిని ప్రస్తావించటం లేదు. రమణ రాసిన రచనలలోని వైశిష్ట్యం గురించి, వర్ణనా చాతుర్యం గురించి కాయిన్ చేసిన కొత్త మాటల గురించి, శైలి, శిల్పం గురించి ఎమ్వీయల్ 'కానుక' అనే పుస్తకంలో సవిస్తరంగా రాసారు. వాటిని పునశ్చరణ చేయకుండా, కథ గురించి చెప్పేటప్పుడు దానిలోని ఒక చిన్న మచ్చును మీ ముందుంచుతాను. రమణ గురించి మీ అంతట మీరే అంచనా వేసుకోవచ్చును. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)