సర్వే కాదు, కూపీ!

సెటిలర్లెందరు? స్థానికులెందరు? Advertisement నిజం వేరు: నెపం వేరు  నిజం రాజకీయం. నెపం సంక్షేమం. ఇది చాలా పాత ట్రిక్కు. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా వేస్తుంటారు. జనం నమ్ముతుంటారు.  లోన అదే ముల్లు:  పైన…

సెటిలర్లెందరు? స్థానికులెందరు?

నిజం వేరు: నెపం వేరు  నిజం రాజకీయం. నెపం సంక్షేమం. ఇది చాలా పాత ట్రిక్కు. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా వేస్తుంటారు. జనం నమ్ముతుంటారు. 

లోన అదే ముల్లు:  పైన అదే ఎర. వేసిన గాలాన్నే వేసినా, చేపలు కొరికి గిలాగిలా కొట్టుకుంటూనే వుంటాయి. వేట ఆగదు.

పేరు కు ‘సర్వే’. తీరుకు ‘కూపీ’. ఈ పని తెలంగాణ సర్కారు చేపట్టింది. కుర్చీలో కూర్చుని ముచ్చటగా మూడు నెలలూ కాక ముందే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో వచ్చిన మెరుపు లాంటి ఆలోచన. 

ఈ ఆలోచన వెనుక నిజం వేరు:  పైకి చెప్పే నెపం వేరు.

నిజం:  ముంచుకొస్తున్న ‘గ్రేటర్‌ హైదరాబాద్‌’ ఎన్నికలు. ఇక్కడ తెలుగుదేశాన్నీ. బీజేపీనీ ప్రధానంగా ఎదుర్కోవాలి. పనిలోపనిగా ఈ రెంటినీ, కాంగ్రెస్‌నూ గ్రామీణ తెలంగాణలో ముందే నొక్కి పారెయ్యాలి. ఎందుకోసం, వారి వోటు బ్యాంకులను ‘కుటుంబాలు కుటుంబాలు’ గా లెక్కించి, తేల్చి పారెయ్యాలి.నెపం: సంక్షేమం. సంక్షేమం. సంక్షేమం. అర్హులయిన వారికి సంక్షేమ ఫలాలు అందాలి. నకిలీ రేషన్‌ కార్డులను ఏరిపారెయ్యాలి. ఇందుకే ఈ సర్వే. ‘సర్వే’ జనా సుఖినోభవంతు.

అందుకే ఇళ్ళనుంచి కదలకండి. పెళ్ళా? వదిలేయండి. ‘కళ్యాణఘడియలు’ ఎప్పుడయినా వస్తాయి. కానీ, ‘సర్వే ఘడియలు’ ఆ ఒక్క రోజే వస్తాయి. డోన్ట్‌ మిస్‌. అంటున్నారు అధికార పక్ష నేతలు.

కానీ, ఈ మాటలు విపక్ష నేతలకు వేరేలా వినబడుతున్నాయి ‘నీ ఇంటికి వస్తా. నీ నట్టింటికి వస్తా, నీ వంటింటికి వస్తా.’(ఎన్ని ‘పొయ్యి’లో లెక్కించటానికి కావచ్చు.) అని బెదరిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.

నిజాన్ని నిజంలాగా, నెపాన్ని నెపంలాగా చూపటం మీడియా పని. ఆ ప్రయత్నమే ఈ విశ్లేషణ.

తిరుమల కొండ ఎక్కేశాక గుర్తొస్తుంది భక్తుడికి, ‘ఇంతకీ నేను ఎక్కి వచ్చిన మెట్లెన్ని?’. దీనికి రెండే మర్గాలు. ఒకటి: తక్షణం లెక్కించుకుంటూ దిగివెళ్లిపోవాలి. రెండు: డబ్బులిచ్చి ఎవర్నన్నా దిగి, ఎక్కి రమ్మనాలి. 

సింహాసనం ఎక్కి కూర్చున్నాక కేసీఆర్‌కు గుర్తొచ్చింది, ఇంతకీ తనను ఎక్కించింది ఎవరని. దిగి చూస్తే తెలిసిపోతుంది. అంత సాహసానికి ఆయన ఒడిగట్టలేడు. ఇక మిగిలింది ఒక్కటే, పైసలిచ్చి కనుక్కుని రమ్మనటం. జిల్లాకి రెండు కోట్లు చొప్పన ఇచ్చి, తెలంగాణలోని 10 జిల్లాల్లో కుటుంబ సర్వేకు లక్షల్లో సిబ్బందిని దించాడు. వీళ్లందరూ ఒక్క రోజులో దాదాపు కోటి తలుపులు కొట్టాలి. 

‘ఇలా గెలిచాం’ అనే నిర్థారణ ఎందుకంటే, ‘ఎలా నిలుస్తామో’ తెలుసుకోవటానికి. ఎవరు పెట్టారో శాపం తెలీదు కానీ, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో, తొలి సర్కారు ఏర్పాటు చేసిన పార్టీ తర్వాత ఎన్నికల్లో ‘మటాష్‌’ అయిపోతుంది. చత్తీస్‌గఢ్‌లూ, జార్ఖండ్‌లూ ఈ నిజాన్ని చాటి చెప్పాయి. అందుకంటే కొత్త రాష్ట్రాల్లో ప్రజల కోరికలు రేసు గుర్రాల్లా వుంటాయి. వాటిని తీర్చటం కొత్తగా వచ్చిన ఏ సర్కారుకీ సాధ్యం కాదు. దాంతో కొత్త కేబినెట్‌ మీద మోజు మొదటి రెండు మూడేళ్ళలోనే తీరిపోతుంది. ఈ భయం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఉండక పోదు. అదీకాక, ప్రతీసారీ తాను ‘ఆత్మబలిదానం’ చేసుకుని, టీఆర్‌ఎస్‌ను రక్షించటానికి కాంగ్రెస్‌ వుండదు. తెలంగాణ  ‘ఇచ్చి’, తాను విపక్షంలో కూర్చునే ఉదారమైన పని మళ్ళీ మళ్ళీ ఆ పార్టీ చెయ్యలేదు కదా!  

‘తెలంగాణ సెంటిమెంటు’ మీద ఏర్పడ్డే వోటు బ్యాంకు, ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పడగానే మాయమవుతుంది. అయితే, రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌ తో వచ్చిన వివాదాల వల్ల ‘ఆంధ్ర’ వ్యతిరేకతను   కొంత కాలం టీఆర్‌ఎస్‌ నిలుపుకోవచ్చు. మహా అయితే కొన్ని నెలలో ఒక ఏడాదో కాపాడ వచ్చు. తర్వాత పరిస్థితి ఏమిటి? ‘ప్రాంతం’ ప్రాతిపదిక మీద కాకుండా, ఇతర ప్రాతిపదికల మీద ‘వోటు బ్యాంకుల్ని’ తయారు చేసుకోవాలి.నిజానికి ఈ పనిని కాస్త ఆలస్యంగానే కేసీఆర్‌ మొదలు పెట్టేవారు.

‘గ్రేటర్‌’ లెక్కలు: సెటిలర్స్‌ ఎందరు? స్థానికులెందరు?

కానీ, ఈ లోపుగా ఓ గండం ముంచుకొచ్చింది. అది మామూలు గండం కాదు. ‘గ్రేటర్‌’ గండమే. జిహెచ్‌ఎంసి ఎన్నికలు. ఎంత ఊపులో వున్నా, ఈ ఎన్నికలను ఎదుర్కోవటమనేది కేసీఆర్‌కు సవాలే. గత ఎన్నికలలో అయితే ఖాతాయే తెరవలేదు.( పోటీకే రాలేదు.) ఇంత పెద్దవిజయాన్ని తెచ్చిపెట్టిన 2014 అసెంబ్లీ ఎన్నికలలో అయినా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో( జిహెచ్‌ఎంసి ఈ రెండు జిల్లాల్లోనూ విస్తరించి వుంటుంది.) పొడిచేసిందా` అంటే అదీ లేదు. హైదరాబాద్‌లో మొత్తం 15 స్థానాల్లో ఒక స్థానాన్ని, రంగారెడ్డి లోని 14 స్థానాల్లోనూ 4 స్థానాల్లోనూ మాత్రమే గెలిచింది. అయితే, ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ కన్నా నయం. ( కాంగ్రెస్‌లో హైదరాబాద్‌కు శూన్యం:  రంగా రెడ్డిలో రెండు సీట్లూ దక్కాయి.) పాత బస్తీలో మజ్లిస్‌ కాకుండా, ఎక్కువ స్థానాలను తెలుగుదేశం మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ తో నువ్వా, నేనా` అంటూ సమ ఉజ్జీతో వుంది. ఇలాంటి నేపథ్యంలో ‘గ్రేటర్‌ ఎన్నిక'లంటే, ఎంత అధికారంలో వున్నా కించెత్తు తత్తరపాటు తప్పదు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తక్షణ శత్రువులు:  టీడీపీ, బీజేపీలే. శత్రువుకి శత్రువు మిత్రుడే కాబట్టి బీజేపీకి శత్రువయిన ‘మజ్లిస్‌’ ను టీఆర్‌ఎస్‌ ముందుగానే మచ్చిక చేసుకుంది. మరి టీడీపీని ఎదుర్కోవటం ఎలా? హైదరాబాద్‌ వరకూ టీడీపీకి ‘ఆంధ్ర సెటిలర్ల’ వోట్లు కీలకం. వెంటనే వచ్చే అనుమానం: సెటిలర్లు స్థానికులను మించి వుంటారా? ఉండరు. మరి? గెలిచినా గెలవక పోయినా, (తెలంగాణ సెంటిమెంటుతో వచ్చిన) స్థానికుల వోట్లను కాంగ్రెస్‌ ఒక మేరకు పంచుకున్నది. ఈ వోట్లను ఈ సారి మొత్తం  టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకోవాలి. అంటే ఈ స్థానికులకు ‘సెంటిమెంటు’ కాకుండా, ఇంకా ఏ ఎరలు వెయ్యాలి? అసలు ఈ స్థానికుల సంఖ్య ఎంత వుంటుంది? ఇవి ఇప్పటికిప్పుడు తేలి పోవాలి. అందుకే ఈ ‘సర్వే’ ఇప్పటికిప్పుడు అవసరమయి పోయిది. ఇందుకు (నేడు వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతున్న) సర్వే పత్రంలోని విభాగం ఐ (కుటుంబ సొంత చరాస్తుల వివరాలు) కింద 21, 22, 23 కాలమ్స్‌లో ఇచ్చిన ప్రశ్నలు చాలు. ఈ లెక్కను ఇట్టే తెలుసుకోవటానికి. ‘ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి ఇక్కడ వుంటున్న వారి వివరాలు’ అనే శీర్షిక కింద 1) ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? 2) మాట్లాడే భాష? 3) వచ్చిన సంవత్సరం?` అనే మూడు వివరాలు అడిగారు. అంతే కాదు. ‘భాష’ అంశం వచ్చినప్పుడు తెలుగు, హిందీ,మరాఠీ, గుత్తి కోయభాష, లేదా ఇతర భాషల్లో ఏ భాష అయితే ఆ భాషను రాయాలి అని ‘అధోజ్ఞాపిక’(ఫుట్‌ నోట్‌) కూడా ఇచ్చారు. అంటే ‘వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌’, మాట్లాడే భాష ‘తెలుగు’ అని రాసిన వాళ్ళు ఏయే డివిజన్‌లో ఎంతమంది వున్నారో తెలిస్తే చాలు. ‘ఆంధ్ర సెటిలర్సు’ తేలి పోతారు. (అయితే అంతిమంగా ఇచ్చే సర్వే పత్రంలో ఈ ప్రశ్నలు వుంటాయా? లేదా? అన్నది కూడా అనుమానమే.వ్యతిరేకత వస్తున్న దృష్ట్యా ఈ విభాగాన్ని తొలగించ వచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.) అంటే టీఆర్‌ ఎస్‌ ఆశిస్తున్న సమాచారం వచ్చేసినట్లే. వీరితో పాటు మిగిలిన రాష్ట్రాల వారిని మినహాయిస్తే, అచ్చంగా స్థానికులు తేలిపోతారు. వీరు ఏయే సామాజిక వర్గాలకు చెందిన వారో కూడా తేలిపోతారు. అప్పుడు ‘ఆంధ్ర సెటిలర్ల’ పై మరి కాస్త ద్వేషాన్ని, తెలంగాణ స్థానికులలోని వివిధ వర్గాలకు మరిన్ని వరాలనూ ఇచ్చుకుంటూ పోతే, ‘గ్రేటర్‌’ తమ వశమవుతుంది.

‘దేశం’ బీసీలకు ‘టీఆర్‌ఎస్‌’ గాలం!

పనిలోపని. ఇంతవరకూ వచ్చాక, టీడీపీకీ, బీజేపీకీ తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా ‘నూకలు’ లేకుండా చేయాలనే` ఆలోచన కూడా ఈ ‘సర్వే’ వెనుక దాగి వుందని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌, ఇటు పొరుగు రాష్ట్ర (ఆంధ్రప్రదేశ్‌) ప్రభుత్వాన్ని ‘కవ్విస్తూ’ , అటు కేంద్ర ప్రభుత్వాన్ని ‘ఎదిరిస్తూ’  యుధ్ధం ప్రకటించేశారు. 

ఎంత అభివృద్ధి మంత్రాన్ని జపించినా, బీజేపీ రాజకీయానికి మతమే (హిందూత్వమే) ప్రాతిపదిక. దీనిని ఎదుర్కోవటానికి ‘కుల’(వివక్ష) ప్రాతిపదిక ను ముందుకు తీసుకు రావాలి. అంటే కులాల వారి ‘వోటు బ్యాంకుల్ని’ తయారు చేసుకోవాలి. ఇందుకు ముందు నుంచే కేసీఆర్‌ పునాది వేశారు. దళిత కుటుంబానికి ‘మూడు ఎకరాల’ భూమి లాంటి ‘జనాకర్షక’ వరాలు ఈ కోవలోకే వస్తాయి. ఎస్టీలకూ, బీసీలకూ కూడా ఇలాంటి వరాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా బీసీల పై చాలాకాలం టీడీపీ పట్టు వుంది. ఈ పట్టు టీఆర్‌ఎస్‌కు కావాలీ` అంటే వారు ఎంతమంది వున్నారో తేల్చుకోవాలి. సాధారణ జనాభా లెక్కల్లో వీరి వివరాలు తెలీవు. ఇప్పుడు ఈ సర్వే ‘వృత్తి’  ( కాలమ్‌ 17)లోని వివరాలను ‘అధో జ్ఞాపిక’ ప్రకారం పూర్తి చేస్తే వారు ఎవరో( చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, స్వర్ణకారులు, మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, కంచరి, వడ్రంగి, మేదరి వగైరా) తేలిపోతుంది. అప్పుడు వరాల జల్లులు కురిపించ వచ్చు. కడకు ముస్లింలలో ‘బీసీ’ల కిందకు వచ్చేవారిని( ఉదా: దూదేకుల) కూడా వేరుగా గుర్తిస్తున్నారు.  ఇప్పటికే మైనారిటీలకు 12 శాతం కోటాను కేసీఆర్‌ ప్రకటించారు. ఇక ఎస్టీల గురించి లెక్క తీసేటప్పుడు ‘సంచార జాతుల’ వారి వివరాలను కూడా వదలటం లేదు. వీటన్నిటి రీత్యా చూస్తే, ముందు ముందు ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండానూ, ఒక వేళ పెరిగినా, అది బీజేపీ, టీడీపీల వశం కాకుండానూ చూసుకునే పనికి ఈ ‘సర్వే’ ను వినియోగించుకోబోతున్నారు. 

అంటే టీఆర్‌ఎస్‌ ముందు ఇప్పటికిప్పుడు వున్న ‘గ్రేటర్‌’ సవాలునే కాకుండా, ముందు ముందు రాబోయే గ్రామీణ తెలంగాణలో పెను సవాలును కూడా ఎదుర్కోవటానికి ‘సర్వే’ ను అస్త్రంగా సంధించిందీ` అన్నది నిజం.

ఇక నెపమంటారా? రోజూ కేసీఆర్‌ దగ్గర నుంచి టీఆర్‌ఎస్‌ నేతలందరూ ఊదర గొడుతున్నదే. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయటానికీ, వాటిని అర్హులకు మాత్రమే చేరటానికి వీలుకల్పించటానికీ ఈ సర్వే చేస్తున్నామంటున్నారు.అర్హత వున్న కుటుంబాలు 80 లక్షల కుటుంబాలు మాత్రమే వుండగా, 1.02 రేషన్‌ కార్డుల మీద సరుకులు ఎలా పంపిణీ అవుతున్నాయి? అని వారు పదేపదే ప్రశ్నిస్తున్నారు. అందుచేత, రేపు ఇవ్వబోయే సమస్త సంక్షేమ పథకాలకూ ఈ సర్వేయే మూలాధారం అని చెప్పారు. ప్రజలు ఈ ‘నెపాన్ని’ నమ్మాలి. నమ్మటం వల్ల ప్రయోజనం లేకపోయినా, నమ్మక పోవటం వల్ల నష్టం వుంటుందన్న భయంతో, ఈ సర్వేలో పాల్గొనటానికి, రెక్కలు కట్టుకుని తమ తమ స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. ‘ఏమో! తమ పేర్లు నమోదు కాకపోతే, ఇస్తానన్న ఇల్లు ఇవ్వరేమో! రేషన్‌ ఆపేస్తారేమో! వృధ్ధాప్య పించను బంద్‌ అవుతుందేమో!’ . ఎవరి నోట వున్నా, ఇవే ఆందోళనలు! ఇవే అనుమానాలు!!  ఈ భయం చూసి చెప్ప వచ్చు: సర్వే విజయ వంత మవుతుందని. కానీ, ఈ ‘సర్వే’ వెనుక వున్న రాజకీయోద్దేశ్యాలు మాత్రం ‘స్కెచ్‌’ వేసినంత ఈజీగా సఫలం కావు.  
                                        
ఇది కేరళ మార్కు సర్వే!

సామాజిక ఆర్థిక సర్వే అన్నది దేశంలో కొత్త కాదు. బ్రిటిష్‌ ఇండియా 1931లో నిర్వహించింది. సామాజిక వెనుకబాటు తనాన్ని అంచనా వేయటంకోసం ఏయే కులాల్లో ఎంత మంది వున్నారో లెక్కించింది. తర్వాత మళ్ళీ అలాంటి సర్వే దేశవ్యాపితంగా జరగలేదు కానీ, స్వరాజ్యం వచ్చాక, 1958లో ఇ.ఎం.ఎస్‌ నంబూత్రిపాద్‌ నేతృత్వంలో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం బీసీలను లెక్కించి, వారికి సంక్షేమ పథకాలను అమలు జరిపింది. ఆ తర్వాత 2011లో జరిగిన జాతీయ సర్వేలో తొలుత ఎస్సీ, ఎస్టీ జనాభాతో పాటు, బీసీల గణన కూడా చేయాలనుకుంది కానీ, తర్వాత కోర్టుల జోక్యంతో జాతీయ జనగణన సంస్థ చేయలేక పోయింది. ఇప్పుడు తెలంగాణ తలపెట్టిన సామాజిక అర్థిక సర్వే విజయవంతమయితే, కేరళ తర్వాత స్థానం తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. 

1956నాటి కుటుంబాలెన్ని?

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే తల పెట్టటానికీ, ఎంసెట్‌ ఫీజు రీయంబర్స్‌ మెంట్‌లో 1956 స్థానికతకూ సంబంధం వుందని కొందరు అనుమానిస్తున్నారు. 1956కు ముందు నుంచే నివాసం వున్న వారిని సర్వేద్వారా నిగ్గుతేల్చవచ్చనే ఉద్దేశ్యం ఈ సర్వే వెనుక దాగి వుందని కూడా వారు భావిస్తున్నారు. ఆస్తులు, నివాసం వంటి వివరాల ఆధారంగా 1956కు ముందు నుంచి వున్న కుటుంబాలను లెక్కదీయటం ఒక పద్ధతి అయితే, ఈ మధ్యలో వచ్చిన సెటిటలర్ల కుటుంబాల సంఖ్యను లెక్క తేల్చి, మొత్తం కుటుంబాల సంఖ్య నుంచి మినహాయించటం వల్ల కూడా వీరిని అంచనా కట్ట వచ్చని వీరు అంటున్నారు. ఇలా చేయటం వల్ల మొత్తం తెలంగాణ విద్యార్థుల ఫీజుల భారం ఎంత వుంటుందో కూడా తేలిపోతుందన్నది సర్కారు ఆశ కావచ్చంటున్నారు. 

-గ్రేట్‌ ఆంధ్ర ఎడిటోరియల్‌ డెస్క్‌