న్యాయానికి ‘అన్యాయం’ చేసిన కొలీజియం.

నేను రాసిన పరీక్షకు నేనే మార్కులు వేసుకుంటే..? నా ఉద్యోగానికి నేనే జీతం నిర్ణయించుకుంటే..?  కడకు నాకు నేనే అప్పాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చుకుంటే…? Advertisement చిత్రంగా లేదూ..!? ఈ చిత్రమే న్యాయవవస్థలో 22 ఏళ్ళనుంచీ…

నేను రాసిన పరీక్షకు నేనే మార్కులు వేసుకుంటే..? నా ఉద్యోగానికి నేనే జీతం నిర్ణయించుకుంటే..?  కడకు నాకు నేనే అప్పాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చుకుంటే…?

చిత్రంగా లేదూ..!? ఈ చిత్రమే న్యాయవవస్థలో 22 ఏళ్ళనుంచీ జరిగిపోతోంది. జడ్జీలను జడ్జీలే నియమించేసుకుంటున్నారు. ఇదేమి ‘న్యాయం’? అంటే అదే ‘న్యాయం’ అంటూ ఇన్నాళ్ళూ న్యాయమూర్తులు చెబుతూ వచ్చారు. అయితే ఇలా ఎంపికయన వారంతా ‘సఛ్చీలురే’నా? అంటే ‘ఆరోపణల’తో తొలగించబడ్డవారు కూడా న్యాయమూర్తుల్లో వుంటున్నారు. ఇలా న్యాయమూర్తులను, న్యాయమూర్తులే ఎన్నుకోవటానికి వీరు ఒక నియామక మండలి తయారు చేసుకున్నారు. దాని పేరే ‘కొలీజియం’. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల విషయంలో అయితే ఈ ‘కొలీజియం’లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు వుంటారు. వీరే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియమాకాల్ని నిర్ణయిస్తారు. ఇదే వరస హైకోర్టుల విషయంలోనూ జరుగుతుంది. 

అయితే ఇలాగే న్యాయమూర్తులను నియమించాలని రాజ్యాంగంలో ఎక్కడయినా రాసి వుందా? అలాగని ఈ విషయంలో ఎలాంటి నిర్దేశకమూ చేయకుండా కూడా రాజ్యాంగం వుండలేదు. రాష్ట్రపతి న్యాయమూర్తులతో సంప్రదించి న్యాయమూర్తుల నియామకం చేపడతారని రాజ్యాంగం చెప్పింది నిపుణులు చెబుతున్నారు.అయితే, ‘న్యాయమూర్తులతో సంప్రదించే’ పని కాస్తా ‘న్యాయమూర్తుల అంగీకారంతో  అని మారింది. అంటే, న్యాయమూర్తులు ఎవరి పేర్లను అంగీకరిస్తారో, వారినే రాష్ట్రపతి ఆమోదించాలి. అయితే రాజ్యాంగంలోని ఈ ‘క్లాజు’ ను ఎవరు మార్చేశారు? ఇంకెవరూ? ఆ పని చేసింది కూడా న్యాయమూర్తులే. కోర్టు వ్యాజ్యాలలో న్యాయమూర్తుల తీర్పుల్లోని వ్యాఖ్యానాలకూ ‘శాసన’ స్థాయి వస్తుంది. ఇలా తమకు అనుకూలంగా న్యాయమూర్తులు చేసుకున్న వ్యాఖ్యానమే చట్టమయిపోయింది.అందుకోసం వారు తయారు చేసుకున్న ‘కొలీజియం’ విధానమే అధికారికమైన నియామక విధానమయిపోయింది కూడా. 

ఇలా చేయటం వల్ల ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుకు కానీ, ఆ పార్లమెంటులోని మెజారిటీ పక్షంతో ఏర్పడ్డ కార్యనిర్వాహక వర్గానికి( కేబినెట్‌కి) కానీ వీరి నియామకంలో క్రియాశీల ప్రమేయం లేకుండా పోయింది. దీంతో ప్రజాస్వామ్యంలో భాగంగా వున్న న్యాయవ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా లేకుండా పోయింది. అంతే కాదు. న్యాయమూర్తుల నియామకాలు ఎలా జరగుతాయో, సాధారణ పౌరులకు అంతుబట్ట నంత గోప్యంగా జరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణభూతమైన ‘పారదర్శకత’ ఈ మొత్తం ప్రక్రియలో మచ్చుకు కూడా కనిపించకుండా పోయింది.

దేశంలో ఎమర్జన్సీ ముగిసి, జనతా ప్రభుత్వం వచ్చాక సంకీర్ణ ప్రభుత్వాలకు బీజం పడిరది. తర్వాత మళ్ళీ పూర్తి మెజారిటీతో మధ్య మధ్యలో ప్రభుత్వాలు వచ్చినా, అంతిమంగా సంకీర్ణ ప్రభుత్వాలే తొంభయ్యవ దశకం నుంచి ఇప్పటి వరకూ రాజ్యమేలుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు (2014)లో అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని ఈ యుగానికి తెర దించింది. యూపీయే సర్కారులోనే ఈ ‘కొలీజియం’ విధానానికి మంగళం పాడాలని ప్రయత్నించి రాజ్యసభలో బిల్లు పెట్టినా, దానికి పూర్తిగా ఇప్పుడే వీలు పడిరది. అయితే సంకీర్ణ యుగంలో కార్యనిర్వాహక శాఖ పైన న్యాయశాఖ దే పై చేయి అన్నట్లుగా వుండేది. దీనినే ‘న్యాయపరమైన క్రియాశీలత’ (జ్యుడిషయల్‌ యాక్టివిజం) గా భావించేవారు. ఇది ప్రజలకు కొంత మేలు చేసింది.  కానీ ఈ క్రియా శీలత ముదిరి చొరబాటుగా మారి  ‘కొలీజియం’  విధానాన్ని ఏర్పరచుకున్నది. జాతీయ న్యాయశాఖ నియామకాల కమిషన్‌(ఎన్‌జెఎసి) బిల్లుకు యూపీయే మద్దతుతో ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ ఆమోదం లభించేలా చూసింది. అయితే ఈ బిల్లుకు దేశంలోని సగం అసెంబ్లీల ఆమోదం కూడా కావలసి వుంటుంది. ఈ పని సజావుగానే జరిగిపోవచ్చు. 

ఈ బిల్లు ప్రకారం, ఆరుగురు సభ్యులతో ఈ కమిషన్‌ ఏర్పాటవుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు, ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులూ, న్యాయశాఖామంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులూ వుంటారు. ఈ ఇద్దరిలో ఒకరు మహిళ కానీ, ఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన వారు కానీ వుంటారు. (ఈ ఇద్దరి ప్రముఖులను ప్రధాని, న్యాయశాఖా మంత్రి, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్షనేత లు కలిసి ఎంపిక చేస్తారు.)  అంటే ఆరుగురు సభ్యులతో ఈ కమిషన్‌ నడుస్తుంది. ఈ ఆరుగురులో ఏ ఇద్దరు ‘నో’ అన్నా నియామకం అగిపోతుంది. అంటే వీరి నియమాక ప్రక్రియలోకి న్యాయశాఖతో పాటు, కార్యనిర్వాహక శాఖ కూడా ప్రవేశించినట్లవుతుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం న్యాయవ్యవస్థో, లేక న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వమో ఏకపక్షంగా న్యాయమూర్తుల నియామకాలను జరపటం కుదరదు. నియామక కమిషన్‌ లో పారదర్శకతకూ, కొంత సామాజిక న్యాయానికీ చోటు దొరికినట్లయింది. 

అయితే న్యాయమూర్తుల్లో ఇంకా సామాజికపరమైన సమతూకం కనిపంచటంలేదనీ, కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతోందనే వ్యాఖ్యలు వినపడుతూ వున్నాయి. దానిని కూడా సరిదిద్దాల్సిన అవసరం వుంది.